పారూని ఆమె తండ్రి 2019లో మహారాష్ట్రలోని నాశిక్‌లో ఉండే తమ ఇంటి నుంచి గొర్రెలను కాయడానికి పంపినపుడు ఆమె వయసు కేవలం ఏడేళ్ళే!

మూడేళ్ళ తర్వాత, ఆగస్ట్ 2022లో వారి గుడిసె బయట - తెలివిలేనిస్థితిలో, దుప్పటిలో చుట్టివున్న పారూ తల్లిదండ్రులకు కనిపించింది. ఆమె మెడపై గొంతు నులిమిన గుర్తులున్నాయి.

"ఆమె తన చివరి శ్వాస వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏం జరిగిందని అడిగే ప్రయత్నంచేశాం, కానీ ఆమె మాట్లాడలేకపోయింది," అని పారూ తల్లి సవితాబాయి కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పారు. “ఆమెపై ఎవరో చేతబడి చేశారని మేం అనుకున్నాం. దాంతో మేం ఆమెను (ముంబై-నాశిక్ హైవే) సమీపంలోని మోరా కొండల్లో ఉండే ఒక దేవాలయానికి తీసుకెళ్లాం. పూజారి అంగారా (విభూది) పూశాడు. ఆమెకు స్పృహ వస్తుందేమోనని ఎదురుచూశాం, కానీ రాలేదు” అని సవితాబాయి గుర్తుచేసుకున్నారు. గాయాలతో కనిపించిన ఐదు రోజుల తర్వాత, సెప్టెంబర్ 2, 2022న, పారూ నాశిక్ నగరంలోని పౌర ఆసుపత్రిలో ఆ గాయాల కారణంగా మరణించింది.

ఇంటికి దూరంగా ఉన్న మూడేళ్లలో పారూ ఒక్కసారి మాత్రమే తన కుటుంబాన్ని చూడటానికొచ్చింది. ఆమెను పనిచేయడానికి తీసుకెళ్లిన మధ్యవర్తి ఆమెను ఏడాదిన్నర క్రితం ఇంటికి తీసుకొచ్చాడు. "ఆమె మాతో ఏడెనిమిది రోజులు గడిపింది. ఎనిమిదో రోజు తర్వాత అతను వచ్చి ఆమెను మళ్లీ తీసుకెళ్లాడు," అని పారూ అపస్మారక స్థితిలోకి వెళ్లిన మరుసటి రోజు మధ్యవర్తిపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సవితాబాయి పేర్కొన్నారు.

PHOTO • Mamta Pared
PHOTO • Mamta Pared

ఎడమ : మరణించిన పారూ తల్లిదండ్రులు పని వెతుక్కుంటూ వలసపోవటంతో , ఖాళీగా మిగిలివున్న పారూ ఇల్లు . కుడి : హైవేకు దగ్గరగా ఉన్న కాత్ కరీ సముదాయంవారికి చెందిన ఇళ్ళు

ఆ మధ్యవర్తిపై నాశిక్ జిల్లాలోని ఘోటీ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది. "ఆ తరువాత అతనిపై హత్యా నేరం నమోదయింది. అతన్ని అరెస్టు చేశారు, ఆపై బెయిల్‌పై విడుదలచేశారు," అని వెట్టి చాకిరీ నుంచి కార్మికులను విడిపించడంలో సహాయపడే సంస్థ, శ్రమజీవి సంఘటన్‌కు చెందిన నాశిక్ జిల్లా అధ్యక్షుడు సంజయ్ షిండే చెప్పారు. సెప్టెంబరులో, అహ్మద్‌నగర్‌ (పారూ గొర్రెలను మేపిన జిల్లా)కు చెందిన నలుగురు గొర్రెల కాపరులపై వెట్టిచాకిరీ కార్మిక వ్యవస్థ (నిర్మూలన) చట్టం కింద ఫిర్యాదు నమోదైంది.

ముంబై-నాశిక్ హైవేకి దూరంగా ఉన్న కాత్‌కరీ ఆదివాసుల నివాసమైన తమ తండాకు ఆ మధ్యవర్తి వచ్చిన రోజును సవితాబాయి గుర్తు చేసుకున్నారు. "అతను నా భర్తను తాగించి, అతనికి 3,000 రూపాయలు చెల్లించి, పారూను తీసుకువెళ్ళాడు," అని ఆమె చెప్పారు.

“బలపం పట్టుకుని రాయడం మొదలుపెట్టాల్సిన వయస్సులో ఆమె ఇంటికి చాలా దూరంగా బంజరు మైదానాల్లో, కఠినమైన ఎండలో నడవాల్సి వచ్చింది. మూడేళ్లపాటు బాలకార్మికురాలిగా వెట్టిచాకిరీ చేసింది," అని సవితాబాయి చెప్పారు.

పారూ సోదరుడు మోహన్‌ని కూడా ఏడేళ్ల వయసులో ఉండగానే గొర్రెల కాపలాకి పంపించారు. ఇక్కడ కూడా అతని తండ్రి రూ.3,000 తీసుకున్నాడు. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల వయస్సున్న మోహన్, తనకు ఉపాధి కల్పించిన గొర్రెల కాపరితో పనిచేసిన అనుభవాన్ని వివరించాడు. “నేను ఒక ఊరి నుంచి మరో ఊరికి గొర్రెలను, మేకలను మేపడానికి తీసుకెళ్లేవాడిని. అతనికి 50-60 గొర్రెలు, ఐదారు మేకలు, ఇతర జంతువులు ఉన్నాయి." అని మోహన్ చెప్పాడు. సంవత్సరానికి ఒకసారి ఆ గొర్రెల కాపరి మోహన్‌కి ఒక చొక్కా, ఒక ఫుల్ ప్యాంటు, ఒక హాఫ్ ప్యాంటు, ఒక రుమాలు, చెప్పులు కొనేవాడు - ఇంకంతే!

ఎప్పుడైనా ఈ చిన్నపిల్లవాడికి తినడానికి ఏదైనా కొనుక్కోవడానికి 5 లేదా 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. “నేను పని చేయకపోతే, శేఠ్ (గొర్రెల యజమాని) నన్ను కొట్టేవాడు. నన్ను ఇంటికి పంపమని చాలాసార్లు అడిగాను. ‘నేను మీ పప్పా (నాన్న)ను పిలుస్తాను’ అని చెప్పేవాడు, కానీ ఎప్పుడూ పిలవలేదు.”

తన సోదరిలాగే మోహన్ కూడా తన కుటుంబాన్ని మూడు సంవత్సరాలలో ఒక్కసారి మాత్రమే కలిశాడు. "అతని శేఠు పిల్లవాడ్ని మా ఇంటికి తీసుకువచ్చాడు, మరుసటి రోజే వాడ్ని మళ్ళీ తీసుకువెళ్ళాడు," అని తల్లి సవితాబాయి చెప్పారు. ఆ తర్వాత పిల్లాడిని కలిసేటప్పటికి ఆ పిల్లవాడు వారి భాషే మరిచిపోయాడు. "వాడు మమ్మల్ని గుర్తించనేలేదు."

PHOTO • Mamta Pared

ముంబై - నాశిక్ హైవేకి దూరంగా ఉన్న తమ గూడెంలో రీమాబాయి , ఆమె భర్త

PHOTO • Mamta Pared
PHOTO • Mamta Pared

సాధారణంగా రీమాబాయి వంటి కాత్ కరీ ఆదివాసులు ఇటుక బట్టీలలోనూ , నిర్మాణ స్థలాలలోనూ పనికోసం వెతుక్కుంటూ వలసపోతుంటారు

“మా కుటుంబంలో ఎవరికీ చేయడానికి పని లేదు, తినడానికి ఏమీ ఉండదు. దాంతో మేం పిల్లలను పనికోసం పంపించాం,” అని అదే కాత్‌కరీ గూడెంలో నివసించే రీమాబాయి వివరించారు. రీమాబాయి ఇద్దరు కుమారులను కూడా గొర్రెలను మేపడానికి తీసుకెళ్లారు. "వాళ్ళు పనిచేసుకొని కడుపు నిండా తింటారని మేం అనుకున్నాం."

ఒక మధ్యవర్తి రీమాబాయి ఇంటి నుండి పిల్లలను తీసుకువెళ్లి అహ్మద్‌నగర్ జిల్లాలోని పారనేర్ బ్లాక్‌లో ఉండే గొర్రెల కాపరుల దగ్గర ఉంచాడు. రెండు వైపుల నుంచి డబ్బు చేతులుమారింది - పిల్లలను తీసుకెళ్లడానికి మధ్యవర్తి పిల్లల తల్లిదండ్రులకు డబ్బు చెల్లించాడు; ఈ బాలకార్మికులను తీసుకువచ్చినందుకు గొర్రెల కాపరులు మధ్యవర్తికి డబ్బు చెల్లించారు. కొన్ని సందర్భాల్లో, ఒక గొర్రెనో లేదా మేకనో ఇస్తామని కూడా వాగ్దానం చేస్తారు.

రీమాబాయి పిల్లలిద్దరూ తరువాతి మూడు సంవత్సరాలు పారనేర్‌లోనే ఉన్నారు. గొర్రెలను మేపుకురావడం, వాటికి మేత వేయడంతోపాటు బావి నుంచి నీళ్లు తెచ్చి బట్టలు ఉతికి, గొర్రెల పాకను శుభ్రం చేస్తారు. ఒక్కసారి మాత్రమే ఇంటికి వెళ్లేందుకు వాళ్ళను అనుమతించారు.

తెల్లవారుజామున 5 గంటలకల్లా లేచి పని చేయకపోతే కొట్టేవారని చిన్న కొడుకు ఏకనాథ్ చెప్పాడు. “ శేఠ్ నన్ను వీపుమీదా కాళ్లపైనా కొట్టేవాడు, బూతులు తిట్టేవాడు. మమ్మల్నెప్పుడూ ఆకలితో ఉంచేవాడు. గొర్రెలు మేస్తూ ఎవరి పొలంలోకైనా వెళ్తే, ఆ పొలం రైతుతో పాటు (గొర్రెల) యజమాని కూడా మమ్మల్ని కొట్టేవాడు. మేం అర్ధరాత్రి దాటేవరకు పనిచేయాల్సి వచ్చేది,” అని అతను PARIకి చెప్పాడు. అతని ఎడమ చేతినీ, కాలునీ కుక్క కరిచినప్పుడు కూడా తనకు వైద్య చికిత్స అందలేదనీ, పైగా అలాగే జంతువులను మేపవలసివచ్చిందనీ ఏక్‌నాథ్ చెప్పాడు.

రీమాబాయి, సవితాబాయి కుటుంబాలు రెండూ మహారాష్ట్రలోని ప్రత్యేకించి క్లిష్ట పరిస్థితుల్లో నివసిస్తున్న ఆదివాసీ బృందాలు (Particularly Vulnerable Tribal Group) గా నమోదయిన కాత్‌కరీ ఆదివాసీ తెగకు చెందినవి. వారికి భూములు లేవు, ఆదాయం కోసం కూలీ పనులపై ఆధారపడతారు, పని వెతుకులాటలో వలసపోతారు. వారికి సాధారణంగా ఇటుక బట్టీలలోనూ, నిర్మాణ ప్రదేశాలలోనూ పనులు దొరుకుతాయి. కుటుంబ పోషణకు సరిపడా సంపాదన లేకపోవడంతో చాలామంది తమ పిల్లలను పాక్షిక సంచార జాతులైన ధన్‌గర్‌ సముదాయానికి చెందిన గొర్రెల కాపరుల వద్దకు, గొర్రెలను మేపే పనికి పంపుతున్నారు.

PHOTO • Mamta Pared
PHOTO • Mamta Pared

ఎడమ : నాశిక్ లోని పౌర ఆసుపత్రి వెలుపల వేచివున్న తల్లిదండ్రులు . కుడి : వెట్టిచాకిరీ నుండి రక్షించబడిన పిల్లల నుంచి వివరాలను నమోదు చేస్తున్న పోలీసులు

పదేళ్ల పారూ విషాద మరణం ఈ ప్రాంతంలోని బాల కార్మిక కేసులపై దృష్టి సారించేలా చేసింది. ఇది సెప్టెంబర్ 2022లో నాశిక్ జిల్లాలోని దిండోరి బ్లాక్‌లోని సంగమ్‌నేర్ గ్రామం నుండి, అహ్మద్‌నగర్ జిల్లాలోని పారనేర్ నుండి 42 మంది పిల్లలను రక్షించడానికి దారితీసింది. శ్రమజీవి సంఘటన ఆధ్వర్యంలో ఈ పిల్లలను రక్షించడం జరిగింది. ఈ పిల్లలు నాశిక్ జిల్లాలోని ఇగత్‌పురి, త్రయంబకేశ్వర్ బ్లాక్‌లకు; అహ్మద్‌నగర్ జిల్లాలోని అకోలా బ్లాక్‌కు చెందినవారు. కొంత డబ్బు ముట్టజెప్పి, బదులుగా ఆ పిల్లలను గొర్రెలు మేపేందుకు తీసుకెళ్లారని సంజయ్ షిండే తెలిపారు. ఇలా రక్షించిన పారూ గూడేనికి చెందిన 13 మంది పిల్లలలో పారూ సోదరుడు మోహన్, వారి పొరుగింటివాడైన ఏక్‌నాథ్ కూడా ఉన్నారు.

ఘోటీకి సమీపంలో ఉన్న ఈ గూడెంలో 26 కాత్‌కరీ కుటుంబాలు గత 30 ఏళ్లుగా నివసిస్తున్నాయి. వారి గుడిసెలు ఒక ప్రైవేట్ భూమిలో ఉన్నాయి. ఆ గుడిసెల పైకప్పును గడ్డి లేదా ప్లాస్టిక్ పట్టాలతో కప్పుకున్నారు. ఒక గుడిసెను రెండు లేదా అంతకంటే ఎక్కువ కుటుంబాలు పంచుకుంటాయి. సవితాబాయి గుడిసెకు తలుపులు లేవు, విద్యుత్తు కూడా లేదు.

“దాదాపు 98 శాతం కాత్‌కరీ కుటుంబాలు భూమి లేనివి. వారిలో చాలామందికి ఎంతో అవసరమైన తమ కులాన్ని ఋజువుచేసే పత్రాలు లేవు,” అని ముంబై విశ్వవిద్యాలయంలో పనిచేసే ఆర్థికశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ నీరజ్ హాతేకర్ చెప్పారు. "ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి కుటుంబం మొత్తం ఇటుక బట్టీలు, చేపల పెంపకం, చెత్త సేకరించడం వంటి ఇతర పనుల కోసం, కూలీ పనుల కోసం ఇంటి నుండి బయటకువస్తుంది."

PHOTO • Mamta Pared
PHOTO • Mamta Pared

వెట్టిచాకిరీ నుంచి రక్షించిన పిల్లలతో సునీల్ వాఘ్ ( నల్ల చొక్కా ధరించినవారు ) , ( కుడి ) ఇగత్ పురి తహసీల్ దార్ కార్యాలయం బయట

మహారాష్ట్రలోని కాత్‌కరీ జనాభా సామాజిక-ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేయడానికి 2021లో కేంద్ర ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మద్దతుతో నిర్వహించిన ఒక సర్వేకు డాక్టర్ హాతేకర్ నాయకత్వం వహించారు. సర్వేలో పాల్గొన్నవారిలో కేవలం 3 శాతం మందికి మాత్రమే కుల ధృవీకరణ పత్రం ఉందని, చాలామందికి ఆధార్ కార్డు గానీ, రేషన్ కార్డు గానీ లేదని ఈ బృందం కనుగొంది. “కాత్‌కరీలు (ప్రభుత్వ) గృహనిర్మాణ పథకాల ప్రయోజనాన్ని పొందగలగాలి. వారు నివసించే ప్రాంతాల్లో ప్రభుత్వం ఉపాధి కల్పన పనులను ప్రారంభించాలి,” అని హాతేకర్ చెప్పారు.

*****

ఇప్పుడు తన కుమారులు తిరిగి వచ్చినందున, రీమాబాయి వారిని బడికి పంపాలని కోరుకుంటున్నారు. “మాకు ఇప్పటి వరకు రేషన్ కార్డు లేదు. ఆ విషయాలు మాకు అర్థం కావు. అయితే ఈ అబ్బాయిలు చదువుకున్నవారే. వారే మాకు ఒక రేషన్ కార్డు ఇచ్చారు,” తన పిల్లలను రక్షించిన బృందంలో ఒకరైన శ్రమజీవి సంఘటన జిల్లా కార్యదర్శి సునీల్ వాఘ్ వైపు చూపిస్తూ ఆమె చెప్పారు. కాత్‌కరీ వర్గానికి చెందిన సునీల్ తన ప్రజలకు సహాయం చేయాలనే తపనతో ఉన్నారు.

పారూ చనిపోయిన మరుసటి రోజు నేను సవితాబాయిని కలిసినప్పుడు “పారూని గుర్తుచేసుకుంటూ భోజనం పెట్టాలి... నేను వంటచేయాలి,” అన్నారు సవితాబాయి. ఆమె తన గుడిసెకు సమీపంలో రాళ్లతో తాత్కాలికంగా కట్టిన పొయ్యిలో కట్టెలతో మంటపెట్టారు. ఒక పాత్రలో రెండు పిడికెళ్ళ బియ్యాన్ని పోశారు - చనిపోయిన తన కుమార్తె కోసం ఒక ముద్ద, మిగిలిన తన ముగ్గురు పిల్లలు, భర్త కోసం. ఇంట్లో బియ్యం మాత్రమే ఉన్నాయి. ఇతరుల పొలాల్లో పనిచేస్తూ రోజుకు రెండు వందల రూపాయలు సంపాదించే తన భర్త, ఈ వండిన అన్నంతో పాటు తినడానికి ఏదైనా తెస్తాడని ఆమె ఆశిస్తున్నారు.

వారి గోప్యతను కాపాడటం కోసం ఈ కథనంలోని పిల్లల , వారి తల్లిదండ్రుల పేర్లను మార్చాం .

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Mamta Pared

Mamta Pared (1998-2022) was a journalist and a 2018 PARI intern. She had a Master’s degree in Journalism and Mass Communication from Abasaheb Garware College, Pune. She reported on Adivasi lives, particularly of her Warli community, their livelihoods and struggles.

Other stories by Mamta Pared
Editor : S. Senthalir

S. Senthalir is Senior Editor at People's Archive of Rural India and a 2020 PARI Fellow. She reports on the intersection of gender, caste and labour. Senthalir is a 2023 fellow of the Chevening South Asia Journalism Programme at University of Westminster.

Other stories by S. Senthalir
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli