"యమునతోనే మా బంధం. మేమెప్పుడూ నదితోనే వున్నాం."

అలా తమ కుటుంబానికి యమునానదితో వున్న బంధాన్ని వివరిస్తోన్నది, విజేందర్ సింగ్. మల్లాహ్ (పడవ నడిపేవారు) సామాజిక వర్గానికి చెందిన వీరు తరతరాలుగా దిల్లీలోని యమునా నదికి ఆనుకుని ఉన్న వరద మైదానాల పక్కనే నివసిస్తూ వ్యవసాయం చేస్తున్నారు. 1376 కిలోమీటర్ల పొడవైన యమునానది, దేశ రాజధాని పరిసరాల్లో 22 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. 97 చదరపు కిలోమీటర్ల పరిధిలో దాని వరద మైదానాలు వ్యాపించి వున్నాయి.

విజేందర్ వంటి 5000 మందికి పైగా రైతులకు 99 ఏళ్ళ వరకు ఆ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చారు.

అదంతా బుల్‌డోజర్లు అక్కడకు రాక ముందరి సంగతి.

జనవరి 2020 లోని ఎముకలు కొరికే చలికాలంలో, ప్రతిపాదిత జీవవైవిధ్య ఉద్యానవనం (బయోడైవర్సిటీ పార్కు) కోసం మున్సిపాలిటీ అధికారులు వాళ్ళ భూముల్ని, అందులో ఉన్న పంటలతో సహా, బుల్‌డోజర్లతో తొక్కించేసారు. విజేందర్ వెంటనే తన కుటుంబాన్ని పక్కనే వున్న గీతా కాలనీలో అద్దె ఇంటికి మార్చాల్సి వచ్చింది.

రాత్రికి రాత్రే ఈ 38 ఏళ్ళ రైతు తన జీవనోపాధిని కోల్పోయారు. భార్య, 10 ఏళ్ల లోపున్న ముగ్గురు పిల్లలున్న తన కుటుంబాన్ని పోషించడానికి ఇప్పుడతను నగరంలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఇలా మారింది అతనొక్కరే కాదు. తమ భూమినుంచీ, జీవనోపాధి నుంచీ తరిమివేయబడిన ఆ రైతులంతా రంగులు వేసేవారిగా, తోటమాలులుగా, సెక్యూరిటీ గార్డులుగా, మెట్రో స్టేషన్‌లలో స్వీపర్లుగా చెల్లాచెదరయ్యారు.

"మీరుగనక లోహా పూల్ నుంచి ఐటిఒ వరకు ఉన్న రోడ్డుని గమనిస్తే, సైకిల్‌పై కచోరిలు అమ్ముకునేవాళ్ళు ఎక్కువయ్యారని తెలుస్తుంది. వాళ్లంతా రైతులు. ఒకసారి భూమిని కోల్పోయాక, ఒక రైతు ఇంతకన్నా ఇంకేం చెయ్యగలడు?" అడిగారతను.

PHOTO • Shalini Singh
PHOTO • Kamal Singh

ఎడమ: దిల్లీలోని యమునా నది వరదమైదానాలలో భాగంగా ఉన్న బేలా ఎస్టేట్. ఇక్కడ రైతులు వివిధ రకాల పంటలను సాగుచేసేవారు. జీవవైవిధ్య ఉద్యానవనం కోసం 2020లో ధ్వంసం చేసిన మొట్టమొదటి క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. కుడి: పోలీసు రక్షణతో నవంబర్ 2020లో ఢిల్లీలోని బేలా ఎస్టేట్‌లో పంటలను ధ్వంసం చేస్తున్న ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీకి చెందిన బుల్‌డోజర్‌లు

కొద్దినెలల తర్వాత ఆ కుటుంబాన్ని మరింత కష్టంలోకి నెట్టేస్తూ దేశం లాక్‌డౌన్‌లోకి - మార్చి 24, 2020 - వెళ్ళింది. ఆరేళ్ళ వయసున్న విజేందర్ రెండో కొడుకు సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్నాడు. ఇప్పుడు వాడి కోసం నెలనెలా కొనాల్సిన మందులు కొనలేని పరిస్థితి. యమునా తీరం నుంచి నిర్వాసితులైన విజేందర్‌లాంటి 500 కుటుంబాలకు పునరావాసం కల్పించడాన్ని గురించిన భరోసా ఏదీ రాజ్యం నుంచి లేదు. కానీ వాళ్ళ ఇంటినీ, ఆదాయ వనరులనూ మాత్రం మట్టిలో కలిపేశారు.

"కోవిడ్ విరుచుకుపడకముందు క్యాలీఫ్లవర్లు, పచ్చి మిర్చి, ఆవాలు, పువ్వులు, వగైరాలు అమ్ముకుని నెలకు 8000 నుంచి 10000 రూపాయలు సంపాదించేవాళ్ళం," అన్నారు కమల్ సింగ్. భార్య, 12,16 ఏళ్ళ వయసున్న కొడుకులు, 15 ఏళ్ళ వయసున్న కూతురు ఉన్న అయిదుగురు సభ్యుల కుటుంబం ఆయనది. 45 ఏళ్ల ఈ రైతు, తనలాంటి ఎంతోమంది రైతులకు ఎలా స్వచ్ఛంద సంస్థలు అందించే ఆహారం మీద ఆధారపడాల్సిన గతిపట్టిందో గుర్తు చేసుకున్నారు.

కోవిడ్ ముమ్మరంగా ఉన్న సమయంలో వాళ్ళకున్న ఒకే ఒక ఆదాయ వనరు- వాళ్ళ గేదె ఇచ్చే పాలు. దాని ద్వారా నెలకు వచ్చే 6000 రూపాయల ఆదాయం ఆ కుటుంబానికి ఏ మూలకీ సరిపోయేది కాదు. "నా పిల్లల చదువు కుంటుపడింది," అన్నారు కమల్. "మేం పండించే కూరగాయలు మాకు తినడానికి ఉపయోగపడేవి. కోతకు వచ్చిన పంటలను వాళ్లు (అధికారులు) ఎన్‌జిటి (నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్) ఆదేశాల మేరకు అంటూ బుల్‌డోజర్లతో తొక్కించేశారు."

దీనికి కొద్ది నెలల ముందు - సెప్టెంబర్ 2019లో - ఒక జీవవైవిధ్య ఉద్యానవనాన్ని కట్టడానికి వీలుగా యమునా తీర వరదమైదానాల చుట్టూ కంచె వెయ్యమని ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డిడిఎ)ని ఎన్‌జిటి ఆదేశించింది. అలాగే ఒక మ్యూజియం కట్టాలనే ప్రణాళిక కూడా వుంది.

"ఖాదర్ - అత్యంత సారవంతమైన భూమి - చుట్టూ వేలాదిమంది నది మీద జీవనోపాధికై ఆధారపడి నివసిస్తున్నారు. వారి సంగతేమిటి?" అని బల్జీత్ సింగ్ అడుగుతున్నారు. (ఇది కూడా చదవండి: ' దిల్లీలో రైతులే లేరని వాళ్ళంటున్నారు!' ) 86 ఏళ్ళ బల్జీత్, దిల్లీ రైతుల కో-ఆపరేటివ్ మల్టీపర్పస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి. ఆయన 40 ఎకరాలు రైతులకు లీజుకి ఇచ్చారు. "జీవవైవిధ్య ఉద్యానవనాలు కట్టడం ద్వారా ప్రభుత్వం యమునను ఒక ఆదాయ ప్రవాహంగా మార్చాలని చూస్తోంది." అన్నారాయన.

PHOTO • Courtesy: Kamal Singh
PHOTO • Shalini Singh

ఎడమ: తన భార్య, ముగ్గురు పిల్లలతో కమల్ సింగ్ (45). 2020లోని కోవిడ్ శీతాకాలంలో ఇంటి వినియోగం కోసం వారు పండించిన పంటలను డిడిఎ బుల్‌డోజర్లు నాశనం చేశాయి. కుడి: దిల్లీ రైతులు యమునా నది వరదమైదానాలను తరతరాలుగా సాగుచేస్తున్నారు. వాళ్లకు ఆ భూముల పై లీజు కూడా వుంది

కొంతకాలంగా డిడిఎ  రైతులనూ సాగుదారులనూ అక్కడి నుండి ఖాళీ చేయాలని చెబుతోంది. వాస్తవానికి, పునరుద్ధరణ పనులు, తిరిగి కొత్త నిర్మాణాల పనులు చేయడానికి ఒక దశాబ్దం క్రితమే మునిసిపల్ అధికారులు అక్కడి ఇళ్ళను పడగొట్టడానికి బుల్‌డోజర్లను తీసుకువచ్చారు.

దిల్లీని 'ప్రపంచ స్థాయి' నగరంగా మార్చే ప్రయత్నంలో  కూరగాయల పంటలు నష్టపోయిన యమున రైతులు, నష్టపోయిన వాళ్ళ జాబితాలో కొత్తగా చేరినవారు. ఇప్పుడు నదీ తీరాన్ని రియల్ ఎస్టేట్ ఆక్రమించుకోవడానికి సిద్ధంగా వుంది. "విషాదం ఏమిటంటే, నగరాన్ని అభివృద్ధిచేయాలనుకుంటున్నవారు వరదమైదానాలను అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న ప్రాంతంగా చూస్తున్నారు," అని విశ్రాంత ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి మనోజ్ మిశ్రా అన్నారు.

*****

ప్రపంచ ‘క్రాస్’ నగరంలో రైతులకు చోటు లేదు. ఎప్పుడూ లేదు.

70లలో, ఆసియా క్రీడల కోసం వసతి గృహాలు, క్రీడా ప్రాంగణాలు కట్టడానికి పెద్ద మొత్తంలో తీరమైదానాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యావరణ జోన్‌గా కేటాయించిన నగర మాస్టర్‌ప్లాన్‌ను ఇది విస్మరించింది. ఆ తర్వాత, 90లలో ఐటి పార్కులు, మెట్రో డిపోలు, ఎక్స్‌ప్రెస్ హైవేలు, అక్షరధామ్ గుడి, కామన్‌వెల్త్ క్రీడా గ్రామం- ఇవన్నీ ఆ వరదమైదానాలలో, ఇంకా నదీ గర్భంలోనూ వచ్చాయి. "ఇదంతా 2015లో నదీ మైదానంలో ఏ రకమైన కట్టడాలు ఉండకూడదని ఎన్‌జిటి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా," అన్నారు మిశ్రా.

ప్రతి నిర్మాణమూ యమున రైతుల బతుకులను కూల్చినదే. "ఎందుకంటే, మేం పేదలం కాబట్టే మమల్ని తరిమేశారు," అన్నారు శివశంకర్. ఆయన విజేందర్ తండ్రి. 75 ఏళ్ళ ఆయన తన జీవితమంతా యమున ఒడ్డున వ్యవసాయం చేశారు, లేదా కనీసం ఎన్‌జిటి ఆదేశాలు వచ్చిన ఇటీవలికాలం వరకు. "కొద్దిమంది సందర్శకులు వచ్చే పార్కులు, మ్యూజియంల నిర్మాణాల కోసం భారతదేశ రాజధానిలో రైతుల పట్ల వ్యవహరించే తీరు ఇది," అని ఆయన అన్నారు.

అదే సమయంలో భారతదేశ 'అభివృద్ధి' కోసం ఈ మెరిసే స్మారక కట్టడాలను నిర్మించిన కార్మికులను మాత్రం అక్కడికి దగ్గరలోనే వారు నివసించే గుడిసెల్లోంచి వెళ్ళగొట్టేశారు. 'దేశీయ ప్రతిష్ట'కు చిహ్నాలయిన క్రీడా ప్రాంగణాల సరసన వారి తాత్కాలిక ఆవాసాలకు చోటులేదు.

PHOTO • Shalini Singh
PHOTO • Shalini Singh

ఎడమ: శివశంకర్, విజేందర్ సింగ్ (ముందువైపు నిలుచున్నవాళ్ళు). కుడి: బుల్‌డోజర్లు తొక్కేయక ముందు తమ కుటుంబం సాగుచేసిన పొలాన్ని చూపిస్తున్న విజేందర్

"ఎన్‌జిటి (2015లో) ఆదేశించిన ప్రకారం, ఒకసారి ఒక స్థలాన్ని నదీతీర మైదానంగా గుర్తిస్తే ఇక దాన్ని పరిరక్షించాల్సి ఉంటుంది. ఎందుకంటే అది నదికి చెందిన భూమి. నీది కానీ నాది కానీ కాదు ," అన్నారు, ఎన్‌జిటి నియమించిన యమునా పర్యవేక్షణా కమిటీ అధినేత, బి. ఎస్. సెజ్వాన్. ట్రిబ్యునల్ కేవలం కమిటీ ఆదేశాన్ని అనుసరిస్తుందని ఆయన అన్నారు.

"ఇందులోంచే జీవనోపాధిని పొందుతున్న మా సంగతేమిటి?" అని 75 ఏళ్ళుగా ఆ నది ఒడ్డునే నివసిస్తూ, అక్కడే వ్యవసాయం చేసిన రమాకాంత్ త్రివేది అడిగారు.

ఇక్కడ 24,000 ఎకరాల్లో వ్యవసాయదారులు సాగుచేస్తున్నారు. వారు పండించిన వివిధరకాలైన పంటల్లో ఎక్కువ భాగం దిల్లీ మార్కెట్లలో అమ్ముడుపోతాయి. శివశంకర్ వంటి చాలామంది తాము పండిస్తున్న ఆహార పంటలు "నదిలోని కలుషిత నీటిని వినియోగిస్తున్నాయని, అది ఆహార గొలుసులోకి ప్రవేశిస్తే ప్రమాదకరం" అనే ఎన్‌జిటి వాదనతో కలవరానికి గురయ్యారు. "మరి మేం దశాబ్దాలుగా ఇక్కడే ఉండి, ఈ నగరం కోసం ఆహారాన్ని ఎందుకు పండిస్తున్నట్టు?" అని ఆయన ప్రశ్నించారు.

PARI మొదటిసారి శివశంకర్, విజేందర్‌లను 2019లో వాతావరణ మార్పులు వారి జీవితాలపై చూపిన ప్రభావం గురించిన నివేదిక కోసం కలిసింది. ఇది కూడా చదవండి: పెద్ద నగరం, చిన్న రైతులు; ఎండిపోతున్న ఒక న‌ది .

*****

ఐక్యరాజ్యసమితి చేసిన ఒక అధ్యయనం ప్రకారం రాబోయే ఐదేళ్లలో - 2028లో - దిల్లీ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంగా అవతరించనుంది. దాని జనాభా 2041 నాటికి 28 నుండి 31 మిలియన్ల మధ్యకు చేరుతుందని అంచనా.

పెరుగుతున్న జనాభా నదీ తీర మైదానాలపైనే కాకుండా నీటి వనరులపై కూడా ఒత్తిడి తెస్తుంది. "యమున ఒక వర్షాకాలపు నది, ఇది సంవత్సరంలో కేవలం మూడు నెలల పాటు నెలకు 10-15 రోజులు కురిసే వర్షానికి నిండిపోయే నది " అని మిశ్రా చెప్పారు. దేశ రాజధాని తాగునీటి కోసం యమునా నదిపై ఆధారపడి ఉందనీ, నది నీటి ద్వారా అభివృద్ధి అయ్యే భూగర్భజలాలే దీనికి మూలం అనే వాస్తవాన్ని ఆయన ఒప్పుకున్నారు

దిల్లీ ఆర్థిక సర్వే 2021-2022లో పేర్కొన్న విధంగా పూర్తి నగరీకరణను డిడిఎ ప్రతిపాదించింది.

"దిల్లీలో వ్యవసాయ కార్యకలాపాలు క్రమంగా  క్షీణిస్తున్నాయి" అని కూడా ఈ నివేదిక పేర్కొంది

PHOTO • Kamal Singh
PHOTO • Kamal Singh

ఎడమ: నవంబర్ 2020లో దిల్లీలోని బేలా ఎస్టేట్‌లో ఎదిగిన పంటని తొక్కేస్తున్న దిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీకి చెందిన బుల్‌డోజర్లు. కుడి: డిడిఎ బుల్‌డోజర్లు పొలాలలో తమ పనిని పూర్తి చేసిన తర్వాత

దిల్లీలోని యమునా నది ద్వారా, 2021 వరకు 5,000-10,000 మంది తమ జీవనోపాధిని పొందేవారని మను భట్నాగర్ చెప్పారు. ఆయిన ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (INTACH) లోని సహజ వారసత్వ విభాగానికి ప్రధాన సంచాలకుడిగా ఉన్నారు. వరదమైదానాల సుందరీకరణలో ఈ ప్రజలకు ఉపాధి కల్పించవచ్చని ఆయన సూచించారు."కాలుష్యం తగ్గేకొద్దీ నదిలో మత్య సంపద పెరుగుతుంది, జల క్రీడలకు కూడా అవకాశం ఉంటుంది. 97 చదరపు కిలోమీటర్ల ఈ వరదమైదాన ప్రాంతంలో పుచ్చకాయల్లాంటి పంటలు కూడా పండించొచ్చు," అని ఆయన 2019లో PARI తనను కలవడానికి వచ్చినప్పుడు అన్నారు. INTACH ప్రచురించిన 'నరేటివ్స్ అఫ్ ఎన్విరాన్‌మెంట్ అఫ్ ఢిల్లీ' అనే పుస్తకాన్ని కూడా ఆయన మాకు ఇచ్చారు.

*****

దిల్లీలో కోవిడ్ విభృంజించేసరికి, అక్కడి నుంచి వెళ్ళగొట్టబడిన దాదాపు 200 కుటుంబాలకు రోజువారీ తిండికి కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2021 ప్రారంభ వరకూ రూ. 4000 నుంచి రూ. 6000 వరకూ ఉన్న ఒక్కో కుటుంబ నెలసరి ఆదాయం, లాక్‌డౌన్ సమయానికి పూర్తి సున్నా అయ్యింది. "రోజుకు రెండు పూట్ల తినే తిండి ఒక్క పూటే అయ్యింది. రెండు కప్పుల టీ ఒక కప్పుకు తగ్గిపోయింది," అన్నారు త్రివేది. "మేము డిడిఎ ప్రతిపాదించిన పార్కులో పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం; కనీసం మా పిల్లలకయినా తిండి దొరుకుతుంది. మమ్మల్ని చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకోవలసిందే; మాకు సమాన హక్కులు లేవా? మా భూమిని తీసుకోండి. కానీ మాకు బతుకు దోవ చూపించండి."

2020 మే నెలలో సుప్రీం కోర్టులో రైతులు తమ కేసు ఓడిపోయారు. వాళ్ళ లీజులిక చెల్లవు. అప్పీలుకు వెళ్ళడానికి కావాల్సిన లక్ష రూపాయలు పెట్టుకునే స్థోమత వారికి లేకపోవడంతో వారిక శాశ్వతంగా వారి భూమికి దూరమయ్యారు.

"లాక్‌డౌన్ పరిస్థితిని మరింత దుర్భరం చేసింది. దినసరి కూలి పనులు, వాహనాల్లోకి సరుకులు ఎత్తీ దించే కూలి పని కూడా లేకుండా పోయాయి. మామూలుగా వాడే మందులు కొనుక్కోడానికి కూడా డబ్బులు లేకుండా అయింది," అన్నారు విజేందర్. 75 ఏళ్ళ అతని తండ్రి శివశంకర్ నగరంలో ఏదో ఒక పని కోసం వెతుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

"మేం ముందుగానే వ్యవసాయం చెయ్యడం మానేసి వేరే పని చూసుకునివుండాల్సింది. అసలు పంటలే లేకపోతే జనాలకి అర్థమయ్యేది, ఆహారం ఎంత అవసరమో, రైతులు ఎంత ముఖ్యమో," ఆయన కోపంగా అన్నారు.

*****

చరిత్ర ప్రసిద్ధమైన ఎర్ర కోటకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఆయన, ఆయన రైతు కుటుంబం నివసించిన కాలాన్ని గుర్తుచేసుకున్నారు శివశంకర్. ఈ కోట బురుజుల మీదనుంచే ప్రతి స్వతంత్ర దినం రోజున ప్రధాన మంత్రి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించేది. ఆ ప్రసంగాలు వినడానికి రేడియో లేదా టీవీ అవసరం ఉండేది కాదని ఆయన అన్నారు.

"గాలి దిశ ఆయన (పిఎమ్) మాటల్ని మా దగ్గరకు తెచ్చేది... కానీ విషాదమేమంటే, మా మాటలు మాత్రం ఎప్పటికీ ఆయనకు చేరేవి కావు."

అనువాదం: వి. రాహుల్జీ

Shalini Singh

Shalini Singh is a founding trustee of the CounterMedia Trust that publishes PARI. A journalist based in Delhi, she writes on environment, gender and culture, and was a Nieman fellow for journalism at Harvard University, 2017-2018.

Other stories by Shalini Singh
Editor : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Rahulji Vittapu

Rahulji Vittapu is an IT professional currently on a small career break. His interests and hobbies range from travel to books and painting to politics.

Other stories by Rahulji Vittapu