"అందరూ చేస్తున్నారు. కాబట్టి మేం కూడా చేస్తున్నాం”  కాస్త అనిశ్చితంగా అంది రూపా పిరికాక.

'ఇది' జన్యుపరంగా మార్పు చేయబడిన (GM) బీటీ పత్తి విత్తనాలు, ఇప్పుడు స్థానిక మార్కెట్‌లో లేదా ఒకరి స్వంత గ్రామంలో కూడా సులభంగా కొనుగోలు చేయవచ్చు. 'అందరు' అంటే ఒడిశాలో నైరుతి వైపు ఉన్న రాయగడ జిల్లాలోని తన ఊరు ఇంకా మిగతా ఊర్లలో ఆమె లాంటి లెక్కలేనంత మంది రైతులు.

'వారికి డబ్బులు అందుతున్నాయి', అని ఆమె అంటుంది.

పిరికాక 40 ఏళ్ల కోండ్ ఆదివాసీ రైతు. రెండు దశాబ్దాలకు పైగా ప్రతి సంవత్సరం ఆమె డోంగర్ చాస్, అంటే కొండ వ్యవసాయం(మారు సాగు) కోసం ఒక కొండ వాలును సిద్ధం చేస్తుంది. శతాబ్దాలుగా ఈ ప్రాంత రైతులు సానబెట్టిన సంప్రదాయాలను అనుసరిస్తూ, పిరికాకా నిరుడు కుటుంబ పంటల నుండి తను భద్రపరిచిన విత్తనాలతో వేర్వేరు భూముల్లో విత్తుతుంది. ఇవి రకరకాల ఆహార పంటల దిగుబడిని ఇస్తాయి: మాండియా , కంగు వంటి చిరుధాన్యాలు, ఎర్ర పప్పు, నల్లరేగడి వంటి పప్పులు, అలాగే పొడవాటి చిక్కుళ్ళు, నైజర్ గింజలు, నువ్వులు వంటివి.

ఈ సంవత్సరం జులైలో పిరికాక మొదటిసారి బీటీ పత్తికి మారింది. బిషామకటక్ బ్లాక్‌లోని ఆమె ఊరు వద్ద కొండ వాలుపై ముదురు గులాబీ, రసాయనాలు కలిపిన విత్తనాలను నాటుతున్న ఆ సమయంలో మేము ఆమెను కలిసాము. ఆదివాసీల సాగు పద్ధతుల్లోకి పత్తి ప్రవేశించడం ఆశ్చర్యంగా ఉంది, ఈ మార్పు గురించి మేము ఆమెను దాని గురించి అడిగేలా చేసింది.

"పసుపు లాంటి వేరే  పంటలు కూడా డబ్బు ఇస్తాయి" అని పిరికాకా ఒప్పుకుంటుంది. "కానీ ఎవరూ అలా చెయ్యట్లేదు. అందరూ మాండియా [చిరుధాన్యాలు] వదిలి పత్తి కావాలనుకుంటున్నారు".

రాయగడ జిల్లాలో పత్తి విస్తీర్ణం కేవలం పదహారేళ్ళలో 5,200 శాతానికి పైగా పెరిగింది. అధికారిక డేటా ప్రకారం 2002-03లో కేవలం 1,631 ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. 2018-19లో అది 86,907 ఎకరాలయ్యింది అని జిల్లా వ్యవసాయ కార్యాలయం తెలిపింది.

దాదాపు 1 మిలియన్ మంది జనాభా ఉన్న రాయగఢ, కోరాపుట్ ప్రాంతంలో ఒక భాగం. కోరాపుట్ ప్రపంచంలోని గొప్ప జీవవైవిధ్య హాట్‌స్పాట్‌లలో ఒకటి, అంతేగాక వరి వైవిధ్యానికి చారిత్రక ప్రాంతం. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ యొక్క 1959 సర్వే ప్రకారం ఈ ప్రాంతంలో అప్పటికీ 1,700 వరి రకాలు ఉన్నాయి. ఇప్పుడు సుమారు 200కి పడిపోయాయి. కొంతమంది పరిశోధకులు ఈ ప్రాంతం వరిసాగుకి పుట్టినిల్లు అని నమ్ముతారు.

Adivasi farmers are taking to GM cotton, as seen on this farm in the Niyamgiri mountains.
PHOTO • Chitrangada Choudhury
But many are reluctant to entirely abandon their indigenous food crops, such as pigeon pea. They sow this interspersed with cotton, thus feeding agri-chemicals meant for the cotton plants to their entire farm.
PHOTO • Chitrangada Choudhury

నియమగిరి పర్వతాలలో, ఆదివాసీ రైతులు (ఎడమవైపు) GM పత్తికి మారుతున్నారు (దాని గులాబీ విత్తనాలు కుడివైపు డబ్బాలో ఉన్నాయి), అయితే కందుల (తెల్ల గిన్నెలో విత్తనాలు) వంటి దేశీయ ఆహార పంటలను వదిలేయడానికి చాలా మంది ఇష్టపడరు. వీటిని పత్తితో కలుపుతారు, పత్తి మొక్కలకు వాడే వ్యవసాయ రసాయనాలు మొత్తం పొలంలోకి ఇంకిపోతాయి

జీవనాధార రైతులైన ఇక్కడి కొంద్ ఆదివాసీలు, వ్యవసాయ-అటవీ సంరక్షణలో వారి అధునాతన పద్ధతులకు పేరొందారు. నేటికీ, ఈ ప్రాంతంలోని పచ్చని పొలాలు, కొండ పొలాలు అంతటా అనేక కోండ్ కుటుంబాలు వరి, రకరకాల చిరుధాన్యాలు, పప్పులు, కూరగాయలను పండిస్తారు. రాయగడలో లివింగ్ ఫామ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల చేసిన సర్వేలు36 మిల్లెట్ రకాలు, 250 అటవీ ఆహారాలను నమోదు చేశాయి.

ఇక్కడ చాలా మంది ఆదివాసీ రైతులు 1 నుండి 5 ఎకరాలు ఉన్న స్వంత పొలాల్లో లేదా ఉమ్మడి పొలాల్లో పని చేస్తున్నారు.

దాదాపు ఎలాంటి సింథటిక్ ఎరువులు గానీ వ్యవసాయ రసాయనాలు గానీ ఉపయోగించకుండానే వాళ్ళ విత్తనాలు వారి మధ్యనే పంచుకుంటారు.

అయినప్పటికీ, రాయగడలో వరి తర్వాత ఈ ప్రాంతపు ప్రధాన సాంప్రదాయ ఆహార పంట అయిన చిరుధాన్యాలను దాటి, అత్యధికంగా సాగు చేయబడిన రెండవ పంటగా పత్తి మారింది. ఈ జిల్లాలో సాగులో ఉన్న మొత్తం 428,947 ఎకరాల్లో ఇది ఐదో వంతు ఉంటుంది. వేగంగా విస్తరించే ఈ పత్తి,  వ్యవసాయ-పర్యావరణ జ్ఞానం మెండుగా ఉన్న ఈ భూమిని, ప్రజలని పునర్నిర్మిస్తోంది.

భారతదేశంలోని స్థూల పంట విస్తీర్ణంలో పత్తి దాదాపు 5 శాతం ఆక్రమించింది, కానీ దేశ వ్యాప్తంగా వర్తించే పురుగుమందులు, కలుపు సంహారకాలు, శిలీంద్రనాశకాల మొత్తంలో 36 నుండి 50 శాతం వరకు వినియోగిస్తుంది. భారతదేశం అంతటా పెరిగిన రుణభారానికి, రైతు ఆత్మహత్యలకు - ఈ పంటతో దగ్గర సంబంధం ఉంది.

ఇక్కడి పరిస్థితులు 1998 నుంచి 2002 మధ్య కాలంలో విదర్భను గుర్తు చేస్తున్నాయ్ - ముందు (చట్టవిరుద్ధమైన) విత్తనాలపై నూతనోత్సాహం, గొప్ప లాభాల గురించి కలలు కనడం, ఆపై అధికంగా నీళ్లు అవసరమయ్యే వాటి స్వభావం వల్ల ప్రభావాలు, ఖర్చులు, అప్పులు భారీగా పెరగడం, పర్యావరణ సంబంధమైన ఒత్తిళ్లు. ఆ తరువాత దశాబ్దానికి పైగా విదర్భ దేశంలో రైతుల ఆత్మహత్యల కేంద్రంగా నిలిచింది. ఆ రైతులు అత్యధికంగా బిటి పత్తి సాగు చేసేవాళ్లు.

*****

మేము నిలబడి ఉన్న దుకాణం 24 ఏళ్ల కోంద్ యువకుడైన చంద్ర కుద్రుక (పేరు మార్చబడింది)కి చెందినది. భువనేశ్వర్ నుండి హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీతో తిరిగి వచ్చిన అతను ఈ జూన్‌లో నియమగిరి పర్వతాలలోని రుకాగూడ (పేరు మార్చబడింది) అనే ఊర్లో ఈ దుకాణాన్ని ప్రారంభించాడు. బంగాళదుంపలు, ఉల్లిగడ్డలు, వేయించిన చిరుతిళ్లు, స్వీట్లు -  ఒక పల్లెటూర్లో ఉండే వేరే దుకాణాల్లాగే ​​ఉంది.

కౌంటర్ కింద పేర్చబడి ఉన్న అతని హాట్-సెల్లింగ్ ఉత్పత్తి మినహా. సంతోషంగా ఉన్న రైతుల చిత్రాలు, రెండు వేల రూపాయల నోట్ల చిత్రాలు ఉన్న పత్తి విత్తనాల రంగురంగుల ప్యాకెట్లు అక్కడి కౌంటర్ మీద ఉన్నాయి.

కుద్రుక దుకాణంలోని విత్తన ప్యాకెట్లలో చాలా మటుకు చట్టవిరుద్ధం, అనధికారమైనవి. కొన్ని ప్యాకెట్లు మీద లేబుల్ కూడా లేదు. అందులో కొన్నిటిని ఒడిశాలో అమ్మడానికి అనుమతి లేదు. విత్తనాలు, వ్యవసాయ రసాయనాలను అమ్మడానికి అతని దుకాణానికి లైసెన్స్ లేదు.

విత్తనాలతో పాటు అమ్మకానికి సరుకుల్లో ఎరుపు, ఆకుపచ్చ డబ్బాల్లో ఉన్న వివాదాస్పద హెర్బిసైడ్ గ్లైఫోసేట్ కూడా ఉంది. 2015లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక (తర్వాత పరిశ్రమ ఒత్తిడి వల్ల WHO విరోధించింది) గ్లైఫోసేట్‌ను 'మనుషుల్లో క్యాన్సర్ కారకం' అని పేర్కొంది. ఇది పంజాబ్, కేరళ వంటి రాష్ట్రాలలో నిషేధించబడింది, పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్‌లో పరిమితులు విధించబడ్డాయి, అంతేగాక ప్రస్తుతం దాని మూల దేశం అమెరికాలో క్యాన్సర్ రోగులు వేసిన బహుళ-మిలియన్ డాలర్ల వ్యాజ్యాల్లో కేంద్రంగా ఉంది.

In Kaliponga village, farmer Ramdas sows BT and HT cotton, days after dousing their lands with glyphosate, a broad spectrum herbicide
PHOTO • Chitrangada Choudhury
In Kaliponga village, Ramdas' wife Ratnamani sows BT and HT cotton, days after dousing their lands with glyphosate, a broad spectrum herbicide
PHOTO • Chitrangada Choudhury

కలిపొంగ గ్రామంలో రైతులు రాందాస్, అతని భార్య రత్నమణి తమ భూముల్లో బ్రాడ్ స్పెక్ట్రమ్ హెర్బిసైడ్ అయిన గ్లైఫోసేట్‌తో తడిపిన కొద్ది రోజులకే బిటి,హెచ్‌టి పత్తిని విత్తారు

ఇదంతా రాయగడ రైతులకు తెలియదు. 'ఘాసా మారా' - అంటే గడ్డిని చంపేది'గా సూచించబడే గ్లైఫోసేట్ - వాళ్ళ పొలాల్లోని కలుపు మొక్కలను వేగంగా నాశనం చేయడానికి వాళ్ళకి మార్కెట్ చేయబడుతుంది. కానీ ఇదొక బ్రాడ్ స్పెక్ట్రమ్ హెర్బిసైడ్, ఇది జన్యుపరంగా మార్పు చేయబడిన మొక్కలు తప్ప మిగతా అన్ని మొక్కలను ఇది చంపుతుంది. గ్లైఫోసేట్‌ను పిచికారీ చేసినా బతుకుతుంది అని కొన్ని పత్తి విత్తనాలను కూడా కుద్రక పైపైన మాకు చూపించాడు. అలాంటి 'హెర్బిసైడ్లను తట్టుకునే' లేదా 'HT విత్తనాలు' భారతదేశంలో నిషేధించబడ్డాయి.

గత పక్షం రోజులలో కుద్రుక ఇప్పటికే 150 విత్తన ప్యాకెట్లను రైతులకు అమ్మినట్లు ఆయన తెలిపారు. "నేను ఇంకొన్ని ఆర్డర్ చేసాను. అవి రేపటికి ఇక్కడికి చేరతాయి."

వ్యాపారం జోరుగా సాగుతున్నట్టు అనిపిస్తుంది.

"నేడు రాయగడలో 99.9 శాతం పత్తి బిటి పత్తినే - వేరే విత్తనాలు అందుబాటులో లేవు" అని జిల్లాలో పంటల సాగును పరిశీలిస్తున్న పేరు తెలియజేయడానికి ఇష్టపడని ఒక అధికారి మాకు చెప్పారు. "అధికారికంగా ఒడిశాలో బిటి పత్తి ఆలా ఉండిపోయింది. ఇది ఆమోదించబడనూలేదు, నిషేధించబడనూలేదు.”

"ఒడిశా రాష్ట్రంలో బిటి పత్తిని విడుదల చేయడానికి బాధ్యత వహించే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఎలాంటి అనుమతులు మాకు కనిపించలేదు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ యొక్క 2016 పత్తి స్థితి నివేదిక ప్రతి సంవత్సరం ఒడిశాలో బీటీ పత్తికి సంబంధించిన అంకెలను సున్నాగా చూపిస్తుంది, దీన్ని బట్టి ప్రభుత్వాలు దాని ఉనికిని గుర్తించకుండా ఉన్నట్లు తెలుస్తుంది. "HT పత్తి గురించి నా దగ్గర సమాచారం లేదు," రాష్ట్ర వ్యవసాయ కార్యదర్శి డాక్టర్ సౌరభ్ గార్గ్ మాకు ఫోన్‌లో చెప్పారు. "బీటీ పత్తిపై, భారత ప్రభుత్వ విధానమే మా విధానం. ఒడిశా కోసం ప్రత్యేకంగా మా దగ్గర పాలసీ ఏమీ లేదు. "

ఈ వైఖరి తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. రాయగడలోని కొత్త ప్రాంతాలలో అనధికార Bt, చట్టవిరుద్ధమైన HT విత్తనాలు, అలాగే వ్యవసాయ రసాయనాల వ్యాపారం వృద్ధి చెందుతూ  వేగంగా చొచ్చుకుపోతోంది, ఇది నియమగిరి పర్వతాలలోని కుద్రుక దుకాణంలో స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా, వ్యవసాయ రసాయనాలు నేలలోని సూక్ష్మజీవులను నాశనం చేశాయి, సంతానోత్పత్తిని నాశనం చేశాయి,  "భూమిపైనా, నీటిలోనూ లెక్కలేనన్ని మొక్కలు, జంతువుల ఆవాసాలకు" హాని కలిగించాయని న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్శిటీలో ఎకాలజీ, ఎవల్యూషన్ మరియు ఎన్విరాన్‌మెంటల్ బయాలజీ విభాగానికి అధిపతిగా ఉన్న నయీమ్ అన్నారు, "ఈ జీవులన్నీ ముఖ్యమైనవే, ఎందుకంటే అవి సమిష్టిగా మన నీటి నుంచి గాలి నుంచి కాలుష్య కారకాలను తొలగించి, మట్టిని సుసంపన్నం చేసే ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలను ఏర్పరుస్తాయి. మన పంటలను, వాతావరణ వ్యవస్థలను నియంత్రిస్తాయి."

*****

"ఇదంతా సులభంగా అవ్వలేదు, వాళ్ళని (ఆదివాసీ రైతులని) పత్తికి మార్చడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది" అని ప్రసాద్ చంద్ర పాండా అన్నారు.

రాయగడలోని బిషామకటక్ తహసీల్ పట్టణంలోని కామాఖ్య ట్రేడర్స్ అనే తన విత్తన, రసాయన ఇన్‌పుట్‌ల దుకాణంలో 'కప్ప పాండా' - అంటే 'కాటన్ పాండా'గా - ఖాతాదారులు, ఇంకా ఇతరుల చేత పిలువబడే ఈయన మాతో మాట్లాడారు.

పాండా 25 ఏళ్ల క్రితం జిల్లా వ్యవసాయ శాఖలో విస్తరణ అధికారిగా ఉండగానే దుకాణాన్ని తెరిచాడు. అతను అక్కడ 37 సంవత్సరాల తర్వాత, 2017లో పదవీ విరమణ చేసాడు. ప్రభుత్వ అధికారిగా అతను పత్తి కోసం "వెనకబడ్డ సాగు" వదిలేయమని గ్రామస్తులను ప్రేరేపించగా, అతని కొడుకు సుమన్ పాండా పేరు మీద లైసెన్స్ పొందిన అతని దుకాణం, వాళ్ళకి విత్తనాలు, అనుబంధిత వ్యవసాయ రసాయనాలను అమ్ముతుంది.

Top left and right-GM cotton seeds marketed to Adivasi farmers lack mandatory labelling, are sold at prices beyond official caps, and are in most cases, do not list Odisha as among the recommended states for cultivation. 
Bottom left-IMG_2727-GM cotton seeds marketed to Adivasi farmers lack mandatory labelling, are sold at prices beyond official caps, and in most cases, do not list Odisha as among the recommended states for cultivation.  
Bottom right-Prasad Chandra Panda-Former government agriculture officer Prasad Chandra Panda at his seeds and inputs shop in Bishamakatak on a July evening.
PHOTO • Chitrangada Choudhury

రాయగడలో ఆదివాసీ రైతులకు విక్రయించబడే GM పత్తి విత్తన ప్యాకెట్‌లు తప్పనిసరైన లేబులింగ్‌ను కలిగి ఉండవు, అధికారిక పరిమితుల కంటే ఎక్కువ ధరలకు విక్రయించబడతాయి, చట్టవిరుద్ధమైన హెర్బిసైడ్‌లను తట్టుకునే విత్తనాలు అయ్యుండచ్చు, సాధారణంగా ఒడిషాను సాగు కోసం సిఫార్సు చేయబడిన రాష్ట్రాల జాబితాలో గుర్తించవు .  కుడివైపు కింద: పి.సి.పాండా అనధికార విత్తనాలను విక్రయించనని చెప్పారు. ఇటీవల పదవీ విరమణ పొందిన ఈ వ్యవసాయ అధికారి బీషామకటక్‌లో 25 సంవత్సరాలుగా విత్తనాలు, ఇన్‌పుట్‌ల దుకాణాన్ని నడుపుతున్నారు

పాండాకి ఇందులో ఎలాంటి వైరుధ్యం కనిపించలేదు, “ప్రభుత్వ విధానాలు పత్తిని రైతులకు వాణిజ్య పంటగా ప్రవేశపెట్టాయి. పంటకు మార్కెట్ ఇన్‌పుట్‌లు అవసరం కాబట్టి నేను ఒక దుకాణాన్ని స్థాపించాను."

పాండా దుకాణంలో రెండు గంటల పాటు మా మధ్య సంభాషణ జరుగుతున్నంత సేపు రైతులు విత్తనాలు, రసాయనాలను కొనడానికి వస్తూనే ఉన్నారు, ఏం కొనాలి, ఎప్పుడు విత్తాలి, ఎంత పిచికారీ చేయాలి లాంటి వాటిపై అతని సలహాను అడిగారు. అతను ప్రతి ఒక్కరికి నిర్దిష్టమైన అధికారంతో సమాధానం ఇచ్చాడు. వాళ్లకి శాస్త్రీయ నిపుణుడు, విస్తరణ అధికారి, సలహాదారు, అన్నీ కలిపి ఆయనే. ఆయన ఆదేశమే వాళ్ళ ‘ఎంచుకుంటారు’.

పాండా దుకాణంలో కనబడ్డ అధీనతకి సంబంధించిన ఇటువంటి దృశ్యాలు మేము పత్తి పండించే ఊర్లలో చూసాము. ‘మార్కెట్’ రాక పత్తి పంటపై మాత్రమే కాక వేరే విషయాలపై కూడా ప్రభావం చూపింది.

"వ్యవసాయ భూమి పూర్తిగా పత్తికి కేటాయించడం వల్ల రైతులు తమ గృహావసరాలన్నింటినీ మార్కెట్ నుండి కొనుక్కోవాలి" అని శాస్త్రవేత్త, సంరక్షకుడు దేబల్ దేబ్ మాకు చెప్పారు. 2011 నుండి రాయగడ కేంద్రంగా దేబ్ ఒక అద్భుతమైన ఇన్-సిటు(స్వస్థానంలో) వరి సంరక్షణ ప్రాజెక్ట్‌ను నడిపిస్తున్నారు, అంతేగాక రైతు శిక్షణలను కూడా నిర్వహిస్తున్నారు.

"వ్యవసాయ సంబంధిత, వ్యవసాయేతర వృత్తులకు సంబంధిచిన సాంప్రదాయ జ్ఞానం వేగంగా కనుమరుగవుతోంది," అని అతను చెప్పాడు. ఊర్లలో కుమ్మరి, వడ్రంగి, నేత పని చేసేవాళ్ళు లేరు. అన్ని గృహోపకరణాలు మార్కెట్ నుండి కొనబడుతున్నాయి, వీటిలో చాలా వరకు - కుండ నుంచి చాప వరకు - ప్లాస్టిక్ తో తయారు చేయబడి సుదూర పట్టణాల నుండి దిగుమతి చేసుకున్నవి. చాలా గ్రామాల నుండి వెదురు, వాటితో పాటు వెదురు చేతిపనులు కూడా కనుమరుగయ్యాయి. వాటి స్థానంలో ఇప్పుడు అడవి నుండి కలప ఇంకా ఖరీదైన కాంక్రీటు వచ్చాయి. స్తంభం వేయాలన్నా, కంచె వేయాలన్నా గ్రామస్థులు అడవిలోంచి చెట్లను నరకాల్సి వస్తోంది. లాభాపేక్షతో ఎంత ఎక్కువగా ప్రజలు మార్కెట్‌పై ఆధారపడితే పర్యావరణం అంతగా క్షీణిస్తుంది.

*****

"ఇవి మంచివని దుకాణదారు చెప్పాడు," రాందాస్ (అతను తన మొదటి పేరును మాత్రమే ఉపయోగిస్తాడు) కుద్రుక దుకాణం నుండి ఋణం పై కొనుగోలు చేసిన మూడు బిటి పత్తి విత్తన ప్యాకెట్ల గురించి మాకు అపనమ్మకంగానే చెప్పాడు. బిషామకటక్ బ్లాక్‌లోని తన ఊరైన కలిపంగాకు తిరిగి వెళుతుండగా, నియమగిరి పర్వత పాదాల వద్ద కొండ్ ఆదివాసీ రైతైన ఇతన్ని మేము కలిశాము. ఆ విత్తన ప్యాకెట్లను ఎంచుకోడానికి దుకాణదారు సలహా ఒక్కటే కారణం.

అతను వాటి కోసం ఎంత చెల్లించాడు? “నేను ఇప్పుడే చెల్లించినట్లయితే, ఒక్కొక్కటి రూ.800 ఇవ్వాలి. కానీ నా దగ్గర రూ. 2,400 లేవు, కాబట్టి దుకాణదారుడు పంట సమయంలో నా దగ్గర నుంచి రూ.3,౦౦౦ తీసుకుంటాడు”. కానీ అతను ఎలాగోలా ప్యాకెట్టుకు వెయ్యి రూపాయల బదులు రూ.800 చెల్లించినా కూడా పత్తిలో అత్యంత ఖరీదైన బోల్ల్గార్డ్- II బీటీ పత్తి విత్తనం కోసం నిర్దేశించిన రూ.730 కన్నా కూడా ఎక్కువే చెల్లిస్తున్నాడు.

పీరికాక, రాందాస్, సున, ఇంకా ఇతర రైతులు మాతో మాట్లాడుతూ, పత్తి ఇంతకు ముందు వేసిన పంటలకు భిన్నంగా ఉంది: మా సాంప్రదాయ పంటలు పండించడానికి ఏమీ అవసరం ఉండేది కాదు...'

వీడియోను చూడండి: ‘పిల్లలను సంరక్షించినట్లుగానే,  మీరు పత్తిని కూడా జాగ్రత్తగా సంరక్షించుకోవాలి’

రాందాస్ కొనుగోలు చేసిన ప్యాకెట్లలో దేని మీదా ధర, తయారీ లేదా గడువు తేదీ, కంపెనీ పేరు లేదా సంప్రదింపు వివరాలు ముద్రించబడి లేవు. అవి ఒక బోల్‌వార్మ్ చిత్రంపై అతి పెద్ద ఎరుపు రంగు 'X'ని కలిగి ఉన్నాయి, కానీ వాటిని Bt విత్తనాలుగా లేబుల్ లో పేర్కొనలేదు. ప్యాకెట్లు 'HT'ని పేర్కొననప్పటికీ, దుకాణదారుడు తనకు చెప్పినందున " ఘాసా మారా [హెర్బిసైడ్]తో పంటను పిచికారీ చేయవచ్చు" అని రాందాస్ నమ్మకం.

మేము జూలైలో పక్షం రోజుల పాటు ఇంటర్వ్యూ చేసిన ప్రతి రైతులాగే, భారతదేశంలో కలుపు సంహారకాలను తట్టుకునే విత్తనాలకు అనుమతి లేదని రాందాస్‌కు తెలియదు. కంపెనీలు లేబుల్ లేని విత్తనాలను అమ్మకూడదని, పత్తి విత్తనాలపై ధర పరిమితులు ఉన్నాయని అతనికి తెలియదు. విత్తనాల ప్యాకెట్లు, వ్యవసాయ రసాయనాల సీసాలు వేటి మీద కూడా ఒడియాలో రాసి లేదు కాబట్టి, రైతులకి చదవడం వచ్చినప్పటికీ, తయారీదారులు ఏ దావా చేస్తున్నారో తెలిసే అవకాశం లేదు.

అయినప్పటికీ డబ్బు ఆశ వారిని పత్తి వైపు లాగుతోంది.

“మేము దీన్ని పండిస్తే, నా కొడుకు ప్రైవేట్ ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో ఫీజుల కోసం ఈ సంవత్సరం నాకు కావాల్సిన కొంత డబ్బు సంపాదించవచ్చు” - ఇది బిషామకటక్ బ్లాక్‌లోని కెరండిగూడ గ్రామంలో మాతో మాట్లాడుతున్న దళిత కౌలు రైతు శ్యాంసుందర్ సున యొక్క ఆశ.

పీరికాక, రాందాస్, సున తదితర రైతులు మాతో మాట్లాడుతూ పత్తి ఇంతకు ముందు వేసిన ఏ పంట లాగా లేదని అన్నారు. "మన సాంప్రదాయ పంటలు పండించడానికి ఏమీ అవసరం లేదు - ఎరువులు, పురుగుమందులు లేవు" అని పిరికాక చెప్పారు. రాందాస్ మాట్లాడుతూ అన్నారు, పత్తికి “ఒక్కో ప్యాకెట్‌కు 10,000 రూపాయల అదనపు ఖర్చులు అవసరమవుతాయి. మీరు ఈ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల కోసం ఖర్చు చేయగలిగితే, పంట సమయంలో కొంత రాబడిని పొందవచ్చు. మీరు దీన్ని చేయలేకపోతే... మీరు మీ డబ్బు మొత్తాన్ని కోల్పోతారు. మీరు చేయగలిగితే, [స్థిరమైన వాతావరణంతో] పరిస్థితులు బాగుంటే - మీరు దాన్ని [పంటని] రూ.30,000- రూ. 40,000కి  అమ్మవచ్చు."

రైతులు డబ్బు ఆశతో పత్తి సాగు చేస్తున్నప్పటికీ, దాని ద్వారా ఎంత సంపాదించారో చెప్పడానికి చాలా మంది ఇబ్బంది పడ్డారు.

జనవరి-ఫిబ్రవరి నాటికి, రైతులు తమ ఉత్పత్తులను ఇన్‌పుట్ రిటైలర్ ద్వారా తిరిగి అమ్మవలసి ఉంటుంది, అతను తన ఖర్చులను అధిక వడ్డీతో సహా తిరిగి పొందుతాడు, మిగిలిన డబ్బుని వాళ్ళకి అందజేస్తాడు. "నేను గున్‌పూర్‌లోని వ్యాపారి నుండి ఉద్దరకి 100 ప్యాకెట్లను ఆర్డర్ చేశాను" అని చంద్ర కుద్రుక మాకు చెప్పారు. "నేను ఆ డబ్బు పంట సమయంలో అతనికి తిరిగి చెల్లిస్తాను, ఇంకా రైతులు చెల్లించే వడ్డీని మేము పంచుకుంటాము."

PHOTO • Chitrangada Choudhury

పై వరుస: జూలై మధ్యలో, కోండ్ ఆదివాసీ రైతు రూపా పిరికాక మొదటిసారిగా కరంజాగూడ గ్రామంలోని తన పర్వత ప్రాంతంలోని పొలంలో మార్కెట్ నుండి తెచ్చిన GM పత్తి విత్తనాలను విత్తారు. ఎడమ వైపు కింద: నంద సర్కా, ఆమె కుటుంబం కలిపొంగ గ్రామంలో తమ రెండు ఎకరాల్లో నాలుగు ప్యాకెట్ల బిటి పత్తిని విత్తారు. కుడివైపు కింద: కెరండిగూడలో శ్యాంసుందర్ సున, కమల కౌలు రైతులు. వాళ్ళు ఇటీవల బిటి పత్తిని సాగు చేయడం ప్రారంభించారు, వాళ్ళ పిల్లల చదువు ఖర్చులకు మరింత డబ్బు సంపాదించాలనే ఆశతో ఉన్నారు

రైతుల పంటలు పండకపోతే వాళ్ళకి అతను రుణానికి ఇచ్చిన ప్యాకెట్లకు వాళ్ళు తిరిగి ఏమి చెల్లించలేకపోతే ఏం చేస్తారు? అది పెద్ద ప్రమాదం కాదా?

"ఏం ప్రమాదం?" నవ్వుతూ అడిగాడు ఆ యువకుడు. “రైతులు ఎక్కడికి వెళతారు? వాళ్ళ పత్తిని నా ద్వారా వ్యాపారికి అమ్ముతారు. వాళ్లు ఒక్కొక్కరు కేవలం1-2 క్వింటాళ్లు పండిస్తే, నేను నా బకాయిలను తిరిగి పొందుతాను."

రైతులకు ఏమీ లేకుండా పోయే అవకాశం ఉందని మాత్రం బైటికి చెప్పరు.

అమూల్యమైన జీవవైవిధ్యాన్నీ కూడా రాయగడ కోల్పోతుంది. ప్రొఫెసర్ నయీమ్ చెప్పినట్లుగా, ప్రపంచవ్యాప్తంగా, పంటల వైవిధ్యాన్ని తొలగించడం అంటే ఆహార భద్రతకు హాని కలిగించడం, గ్లోబల్ వార్మింగ్‌కు అనుగుణంగా పొసగే సామర్థ్యాన్ని తగ్గించడం. వాతావరణ మార్పు, జీవవైవిధ్య నష్టం లోతుగా ముడిపడి ఉన్నాయని కూడా అతను హెచ్చరించాడు : "తక్కువ పచ్చదనం, తక్కువ జీవ వైవిధ్యం ఉన్న గ్రహం వేడిగా, పొడిగా ఉండే అవకాశం ఉంది."

రాయగడలోని ఆదివాసీ రైతులు బిటి పత్తి ఏక పంట సాగు సంస్కృతి కోసం ఆ జీవవైవిధ్యాన్ని విడిచిపెట్టడంతో, ఒడిషా, పర్యావరణ శాస్త్రంలో ఆర్థిక వ్యవస్థలో సుదూర మార్పులకు లోనవుతోంది. ఇది  వ్యక్తిగత స్థాయిలోనే కాక, వాతావరణ సంక్షోభాలను కూడా ప్రేరేపిస్తుంది. పిరికాక, కుద్రుక, రాందాస్, 'కాటన్ పాండా' ఈ మార్పులో చిక్కుకున్న నమ్మదగని పాత్రధారులు.

“దక్షిణ ఒడిశా ఎప్పుడూ సాంప్రదాయ పత్తిని పండించే ప్రాంతం కాదు. దీని బలం బహుళ పంటల్లో ఉంది" అని దేబల్ దేబ్ చెప్పారు. "ఈ వాణిజ్య పత్తి ఏకసంస్కృతి పంట వైవిధ్యం, నేల నిర్మాణం, గృహ ఆదాయ స్థిరత్వం, రైతుల స్వాతంత్య్రం, చివరికి ఆహార భద్రతను మార్చింది." ఇది వ్యవసాయంలో విపత్తులు కలిగించే నిర్దుష్టమైన సూత్రం లాగా ఉంది.

కానీ ఈ కారకాలు, ముఖ్యంగా భూ వినియోగంలో మార్పులకు సంబంధించినవేగాక, అదనంగా వీటన్నిటి వల్ల నీరు, నదులు, జీవవైవిధ్యం కోల్పోవడం వంటివి - మరొక దీర్ఘకాలిక, పెద్ద-స్థాయి  ప్రక్రియగా పరిణమించచ్చు. ఈ ప్రాంతంలో వాతావరణ మార్పులకు బీజం పడడం మనం చూస్తునే ఉన్నాం.

కవర్ ఫోటో: కలిపొంగ గ్రామంలో రైతు రాందాస్, బ్రాడ్ స్పెక్ట్రమ్ హెర్బిసైడ్ అయిన గ్లైఫోసేట్‌తో నేలని తడిపి కొన్ని రోజుల తర్వాత బిటి, హెచ్‌టి పత్తిని విత్తాడు. (ఫోటో: చిత్రాంగద చౌదరి)

వాతావరణ మార్పుల గురించి ప్రజల అనుభవాలను వారి గొంతులతోనే పదిల పరచాలని PARI దేశవ్యాపిత వాతావరణ మార్పులపై రిపోర్టింగ్ ప్రాజెక్టును UNDP సహకారంతో చేపట్టింది.

ఈ వ్యాసాన్ని ప్రచురించాలనుకుంటున్నారా? అయితే [email protected]కి ఈమెయిల్ చేసి అందులో [email protected]కి కాపీ చేయండి.

అనువాదం: దీప్తి సిర్ల

Reporting : Chitrangada Choudhury

Chitrangada Choudhury is an independent journalist.

Other stories by Chitrangada Choudhury
Reporting : Aniket Aga

Aniket Aga is an anthropologist. He teaches Environmental Studies at Ashoka University, Sonipat.

Other stories by Aniket Aga

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Series Editors : Sharmila Joshi

Sharmila Joshi is former Executive Editor, People's Archive of Rural India, and a writer and occasional teacher.

Other stories by Sharmila Joshi
Translator : Deepti

Deepti is a Social Activist. She likes to question.

Other stories by Deepti