ఎస్. రామసామి తన పాత స్నేహితుడికి నన్ను పరిచయం చేశారు. వార్తాపత్రికలు, టీవీ ఛానెల్‌లు, ఐఎఎస్, ఐపిఎస్ అధికారులతో సహా మరెంతోమంది సందర్శకులు తన ప్రియమైన స్నేహితుడిని దర్శించారని ఆయన గొప్పగా చెబుతారు. అలా చెప్పేటపుడు ఎలాంటి వివరాలూ తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆయనొక సెలబ్రిటీ గురించీ, ఒక ప్రముఖుడి గురించీ మాట్లాడుతున్నారు కదా మరి...

ఆయన స్నేహితుడు, 200 ఏళ్ళ వయసున్న ఆ మహా వృక్షమే మాళిగమ్‌పట్టుకు చెందిన గొప్ప ఆయిరమ్‌కాచ్చి...

ఆయిరమ్‌కాచ్చి ఒక పలామరమ్ - పనస చెట్టు. ఇది చాలా పొడవుగానూ వెడల్పుగానూ ఉండే పండ్లచెట్టు. ఇది ఎంత వెడల్పుగా ఉంటుందంటే, దాని చుట్టూ తిరగడానికి 25 సెకన్ల సమయం పట్టింది. పురాతనమైన దాని కాండానికి దాదాపు వంద వరకూ పచ్చని, ముళ్ళుముళ్ళుగా ఉన్న పండ్లు వేలాడుతున్నాయి. అసలా చెట్టు ముందర నిల్చోవటమే ఒక గౌరవం. దాని చుట్టూ నడవడం ఒక ప్రత్యేక సౌకర్యం. నా స్పందన చూసి రామసామి నవ్వారు; సంతోషంతో, గర్వంతో విలాసంగా ఉన్న ఆయన మీసాలు ఆయన కళ్ళను తాకేంత పైకి లేచాయి. తన 72 ఏళ్ళ వయసంతా ఆ చెట్టును చూసి అబ్బురపడిపోయిన అతిథులను ఆయన చూస్తూనే ఉన్నారు. నాతో ఆయనింకా చాలా చెప్పారు...

"మేం కడలూరు జిల్లా పణ్రుటి బ్లాక్‌లో ఉండే మాళిగమ్‌పట్టు కుగ్రామంలో ఉంటాం," ఖావి (కావిరంగు) ధోవతి కట్టుకొని, సన్నని భుజమ్మీద ఒక తువాలు వేసుకుని, చెట్టుముందు నిల్చొని ఉన్న ఆయన చెప్పడాన్ని కొనసాగించారు. "ఈ చెట్టుని ఐదు తరాలకిందట మా పూర్వీకులు నాటారు. మేం దీన్ని ' ఆయిరమ్‌కాచ్చి ', అంటే వెయ్యి ఫలాలనిచ్చేది, అని పిలుస్తాం. ఇప్పుడైతే ఇది ఏడాదికి 200 నుంచి 300 పండ్లను మాత్రమే ఇస్తోంది. అవి 8-10 రోజుల వ్యవధిలో పండిపోతాయి. తొనలు చాలా రుచిగా, రంగు చాలా సుందరంగా ఉంటాయి. పండని కాయలతో బిరియానీ కూడా వండొచ్చు." ఇలా అరనిముషంలో దాని గుణగణాలన్నిటినీ పొగుడుతూ చెప్పారాయన. ఆయన చెట్టులాగే ఆయన ఉపన్యాసం కూడా దశాబ్దాల కాలంతో పాటు మెరుగుపడుతూ రూపుదిద్దుకున్నది.

PHOTO • M. Palani Kumar

తన ప్రియమైన సహచరుడూ , 200 సంవత్సరాల వయసున్న పనసచెట్టు ఆయిరమ్‌కాచ్చితో తన తోటలో ఎస్ . రామసామి

పనసపంటను పండించే రైతులను, అమ్మేవారినీ కలిసేందుకు 2022, ఏప్రిల్‌లో తమిళనాడులోని కడలూరు జిల్లా పణ్రుటి బ్లాక్‌ను మొదటిసారిగా PARI సందర్శించింది. రాష్ట్రంలోనే ఎక్కువగా పనసను పండించే ఈ పట్టణం - ప్రత్యేకించి ఫిబ్రవరి నుంచి జూలై వరకూ ఉండే ప్రనసపండ్ల కాలంలో - టన్నులకొద్దీ పనసపళ్ళను అమ్ముతూ బారులుతీరిన దుకాణాలతో నిండివుంది. ట్రాఫిక్ కూడళ్ళలో చిరువ్యాపారులు కొందరు పండ్లను కోసి, తొనలను అమ్ముతున్నారు. పణ్రుటి పట్టణంలో ' మండీ 'లుగా వ్యవహరించే దాదాపు రెండు డజన్లకు పైగా షాపులు వీటితో 'పెద్దమొత్తం'లో వ్యాపారం చేస్తున్నాయి. ప్రతిరోజూ చుట్టుపక్కల గ్రామాలనుంచి వచ్చే ట్రక్కులకొద్దీ పనసపండ్లను చెన్నై, మదురై, సేలం నుంచి వచ్చిన హోల్‌సేల్ వ్యాపారులకు అమ్ముతారు. ఇలా ఇవి ఆంధ్రప్రదేశ్‌కూ, మహారాష్ట్రలోని ముంబైకి కూడా వెళ్తాయి.

ఆర్. విజయ్‌కుమార్‌కు చెందిన అలాంటి ఒక మండీ లోనే నేను రామసామిని గురించీ, ఆయన వారసత్వపు పనసచెట్టును గురించీ విన్నాను. "వెళ్ళి అతన్ని కలవండి. ఆయన అన్ని విషయాలూ చెప్తాడు," రోడ్డు పక్కనే ఉన్న దుకాణం నుంచి నాకోసం టీ తెప్పిస్తూ అన్నారు విజయ్‌కుమార్. "ఇతన్ని మీతో తీసుకెళ్ళండి," అంటూ ఆ పక్కనే ఉన్న బల్ల మీద కూర్చొనివున్న ఒక వృద్ధ రైతును చూపిస్తూ అన్నారు.

అక్కడినుంచి మాళిగమ్‌పట్టు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ రైతు క్లుప్తంగా ఇస్తున్న సూచనలను పాటిస్తూ, కారులో పది నిముషాల్లో  అక్కడికి చేరుకున్నాం. "కుడివైపుకు తిరుగు, కింద ఉన్న ఆ రోడ్డుకు వెళ్ళు, ఇక్కడ ఆపు, అదే రామసామి ఇల్లు," అంటూ ఆయన, ఒక కుక్క కాపలా కాస్తోన్న అందమైన నలుపుతెలుపు రంగుల, పెద్ద ఇంటిని చూపించారు. వరండాలో ఒక ఉయ్యాల, కొన్ని కుర్చీలు, అందంగా చెక్కివున్న ముఖద్వారపు తలుపు, వ్యవసాయ ఉత్పత్తులతో నిండివున్న జనపనార బస్తాలు ఉన్నాయి. గోడలపై ఫోటోలు, క్యూరియోలు, కేలండర్లు బారులుతీరి ఉన్నాయి.

రామసామికి మేమొస్తున్నామని తెలియదు. అయినా మమ్మల్ని కూర్చోమని ఆహ్వానించి, వెళ్ళి బోలెడన్ని పుస్తకాలూ బొమ్మలూ తీసుకొచ్చారు. అందరూ కలిసితీరాలని కోరుకునే ఒక నిపుణుడిగా ఆయన, కుతూహలంతో వచ్చే సందర్శకులకు అలవాటుపడినవారే. ఆ వెచ్చని ఏప్రిల్ ఉదయాన, కరవాడు (ఎండు చేపలు) అమ్మే ఇద్దరు స్త్రీల పక్కన ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్న ఆయన నాకు పనసపండు గురించి ఒకట్రెండు విషయాలు బోధించారు...

*****

PHOTO • Aparna Karthikeyan
PHOTO • M. Palani Kumar

కడలూరు జిల్లా పణ్రుటి బ్లాక్ లోని మాళిగమ్ పట్టు కుగ్రామంలో రామసామి ప్రపంచంలోనే అతిపెద్ద పండ్లలో ఒకటైన పనసపండును పండిస్తున్నారు . ఆయన తోటలో ఉన్న అతిపురాతనమైన ఆయిరమ్‌కాచ్చిని ఐదు తరాల క్రితం ఆయన పూర్వీకులు నాటారు

ప్రపంచంలోని అతిపెద్ద పండ్లలో ఒకటైన - దీనిని వాడుకలో 'జాక్' అని పిలుస్తారు - ఈ పండు, దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమలకు చెందినది. ఈ పేరు పోర్చుగీస్ జాకా నుండి వచ్చింది, చక్కా అనే మలయాళ పదం నుండి తీసుకున్నది. దీని శాస్త్రీయ నామం కొద్దిగా సంక్లిష్టమైనది: ఆర్టోకార్పస్ హెటెరోఫిల్లస్

కానీ ముళ్ళముళ్ళగా, ఆకుపచ్చ రంగులో కొంత విచిత్రంగా కనిపించే ఈ పండును అంతర్జాతీయ సమాజం గమనించడానికి చాలా కాలం ముందే, తమిళ కవులు గమనించారు. పలాపళమ్ అని పిలిచే ఈ భారీ పండు 2,000 సంవత్సరాల క్రితం రాసిన ప్రేమ కవితలలో కొన్ని ఆసక్తికరమైన రూపాలలో కనిపిస్తుంది.

విశాలమైన నీ చల్లని కన్నుల్లో నీరు నింపుతూ
అతడు తన ప్రసిద్ధ దేశానికి తరలిపోతాడు
అతని దేశపు కొండలనిండా అలరారే పనసచెట్లు
ఆ చెట్లనిండా గుప్పుమనే సుగంధంతో పనసపండ్లు
రాళ్ల సందులలోని తేనెతుట్టను చెదరగొడుతూ
రాలిపడే కండగల పనసపండ్లు

ఐన్‌కుఱునూఱు -214 , సంగమ్ కవిత్వం

"కపిలర్ రాసిన అద్భుతమైన పద్యం" అంటూ అనువాదకుడు సెందిల్ నాథన్ పేర్కొనే మరొక పద్యంలో, పండిన పెద్ద పనసపండును గొప్ప ప్రేమతో పోల్చారు .

పెద్ద పండు వేలాడే చిన్న తొడిమెలాగా
ఆమె జీవితం సుకుమారమైనది, కానీ ఆమె ప్రేమ అపారమైనది.

కుఱున్‌దొగై -18 , సంగమ్ కవిత్వం

400 బిసిఇ ప్రాంతం నాటి బౌద్ధ, జైన సాహిత్యం అరటి, ద్రాక్ష, నిమ్మ వంటి ఇతర పండ్లతో పాటు పనసపండు గురించి కూడా ప్రస్తావించిందని కె.టి. అచ్చయ రాసిన ఇండియన్ ఫుడ్ : హిస్టారికల్ కంపానియన్ పుస్తకం ద్వారా తెలుస్తోంది.

PHOTO • M. Palani Kumar

తోట లోపల నాట్యమాడే ఛాయల మధ్య ఆగి , వృద్ధ వృక్షాల ఆవలి ప్రపంచాన్ని చూస్తున్న రామసామి

వేగంగా 16వ శతాబ్దానికి వెళ్తే, బాబర్ చక్రవర్తి (ఒక "అద్భుతమైన డైరీలు రాసినవాడు"), హిందుస్థాన్ ఫలాలను "అతి చక్కగా వర్ణించాడు" అని అచ్చయ రాశారు. అయితే, అతను పనసపండుకు పెద్ద అభిమానిగా తోచడం లేదు. ఎందుకంటే అతను దానిని "గొర్రె కడుపు భాగాన్ని నింపి తయారుచేసిన చేసిన గిపా (హాగీస్ లేదా పుడ్డింగ్‌లో ఒక రకం)"తో పోల్చాడు; దానిని "వెగటు పుట్టేటంత తీపి" అని వర్ణించాడు.

తమిళనాడులో అది మంచి జనాదరణ పొందిన పండు. తమిళ దేశంలోని ముక్కణి (త్రిఫలాలు) - మా (మామిడి), పలా (పనస), వాళై( అరటి) - లో ఒకటైన ఈ పండును గురించిన పొడుపుకథలు, సామెతలతో తమిళ భాష తీయగా మారింది. పనసపై తన అద్భుతమైన, సమగ్రమైన పుస్తకం పలామారం: ది కింగ్ ఆఫ్ ఫ్రూట్స్‌ లో ఇరా. పంచవర్ణం అనేక సామెతలను ఉదహరించారు. ఒక అందమైన పంక్తి ఇలా అడుగుతుంది:

ముళ్ళుకుళ్ళే ముత్తుకుళైయమ్ అదు ఎన్నా ? పలాపళమ్
(ముళ్ళలోపల ముత్యాల పంట. ఏమిటది? పనసపండు)

ఈ పండు ఇటీవల అద్భుతమైన వార్తాప్రచారాన్ని అందుకుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ లోని 2019 నాటి ఒక పత్రంలో , "పనస చెట్టు పండ్లు, ఆకులు, బెరడులతో సహా అనేక భాగాలు వాటికున్న యాంటీకార్సినోజెనిక్ (కేన్సర్ రాకుండా, వచ్చినా వ్యాపించకుండా చేసే గుణం), యాంటీమైక్రోబయల్ (సూక్ష్మజీవులను నివారించే గుణం), యాంటీ ఫంగల్ (శిలీంధ్ర నివారక గుణం), యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (వాపు, నొప్పి, ఎర్రగా మారటం వంటివాటిని నివారించే గుణం), గాయాలను నయంచేసే గుణం, హైపోగ్లైసీమిక్(రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోయే స్థితిని నివారించే గుణం) ప్రభావాల కారణంగా సంప్రదాయ వైద్యంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు." అని ఆర్.ఎ.ఎస్.ఎన్. రణసింఘే చెప్పారు. అయితే, "దీన్ని పెంచుతున్న ప్రాంతాలలో వాణిజ్య స్థాయిలో ప్రాసెసింగ్ చేయటం చాలా తక్కువగా ఉంది".

*****

PHOTO • M. Palani Kumar
PHOTO • M. Palani Kumar

ఎడమ : రామసామి తోటలో నాటివున్న చిన్న పనసమొక్క . కుడి : పనసపళ్ళ కాలంలో ముళ్ళుముళ్ళుగా ఉండే పచ్చని కాయలు చెట్ల నుండి వేలాడటం మొదలుపెట్టి , అంతలోనే చెట్ల కాండాలను కప్పివేస్తాయి

కడలూరు జిల్లాలోని పణ్రుటి బ్లాక్ తమిళనాడు రాష్ట్ర పనసపండు రాజధాని. పనసపండు, దాని భౌగోళిక అంశాల గురించి రామసామికున్న జ్ఞానం చాలా లోతైనది. చెట్టు ఎక్కడ బాగా పెరుగుతుందో ఆయన వివరిస్తారు. అంటే, నీటి మట్టం భూమిలో 50 అడుగుల దిగువన ఉంటే అక్కడ బాగా పెరుగుతుంది. వర్షంతో పాటే పెరిగితే, దాని వేర్లు కుళ్ళిపోతాయి. "జీడిమామిడి, మామిడి చెట్లు నీటిని తీసుకోగలవు కానీ పనస అలా కాదు," అని అతను ఎత్తి చూపారు. వరదలు ముంచెత్తితే, చెట్టు పని 'అయిపోయినట్టే'. చనిపోతుంది.

ఆయన స్వగ్రామమైన మాళిగమ్‌పట్టు నుండి 20 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న వ్యవసాయ విస్తీర్ణంలో నాలుగింట ఒక వంతు పనసను సాగుచేస్తున్నారని ఆయన అంచనా. తమిళనాడు ప్రభుత్వ 2022-23 వ్యవసాయ విధాన నోట్ ప్రకారం రాష్ట్రంలో 3,180 హెక్టార్లలో పనసను సాగుచేస్తున్నారు. అందులో 718 హెక్టార్లు కడలూరు జిల్లాలోనే ఉన్నాయి.

భారతదేశం మొత్తమ్మీద 2020-21లో, 191,000 హెక్టార్లలో పనసను పండించారు. కడలూరు కావడానికి చిన్న జిల్లా అయినా, ఆ ప్రాంతంలో పనస ఒక ముఖ్యమైన పంట. తమిళనాడులోని ప్రతి నాలుగు పనసపండ్లలో ఒకటి ఇక్కడి నుంచే వస్తుంది.

పలమారమ్ ఆర్థిక విలువ ఎంత? రామస్వామి కొంత వివరించారు. 15 లేదా 20 ఏళ్ల వయసున్న చెట్టుకు ఏడాదికి లీజు విలువ 12,500 రూపాయలు అని ఆయన చెప్పారు. “ఐదేళ్ల వయసున్న చెట్లకు ఈ ధర లభించదు. వాటికి మూడు లేదా నాలుగు పండ్లు మాత్రమే వస్తాయి. 40 ఏళ్ల వయసున్న చెట్టుకు 50 కంటే ఎక్కువే పండ్లు కాస్తాయి”.

చెట్టు పెరుగుతూవుంటే, దాని కాపు కూడా పెరుగుతుంది

ఒక్కో చెట్టుకు కాసే పండ్ల నుండి వచ్చే ఆదాయాన్ని లెక్కించడం కాస్త కష్టమైన పనే. అది అస్థిరంగా కూడా ఉంటుంది. ఆ రోజు ఉదయం పణ్రుటి మండి లో ఉన్న ఒక రైతు బృందం లెక్కలు చేసి, ప్రతి 100 చెట్లకు 2 లక్షల నుండి 2.5 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు వివరించారు. ఇందులో ఎరువులు, పురుగుమందులు, కూలీలు, రవాణా, కమీషన్లకు అయ్యే 50,000 నుండి 70,000 రూపాయల ఖర్చు కూడా కలిసివుంది.

మాళిగమ్‌పట్టుకు చెందిన రామసామి ఆల్బమ్‌లో 200 ఏళ్ల వయసున్న ఆయిరమ్‌కాచ్చి ఛాయాచిత్రాలు

మళ్ళీ, ప్రతిదీ మారుతూనే ఉంటుంది. ఒక్కో చెట్టుకు కాసే పండ్లు, ఒక్క పండు ధర, ఒక టన్ను పండ్ల ధర- ఇలా ఏదీ ఊహించలేం. పంట సీజన్‌ను బట్టి ఒక్కో పండుకు 150 నుంచి 500 రూపాయల మధ్య లభిస్తుంది. చాలాసార్లు దాని పరిమాణాన్ని బట్టి కూడా ఉంటుంది.'సాధారణంగా' (పణ్రుటిలో) ఒక పండు 8 నుండి 15 కిలోల మధ్య తూగుతుంది. కొన్ని 50 కిలోలు, అరుదుగా కొన్ని 80 కిలోలకు కూడా చేరుకుంటాయి. ఏప్రిల్ 2022లో ఒక టన్ను పనసపండ్ల ధర 30,000 రూపాయలు. ఎప్పుడూ కాకపోయినా, సాధారణంగా టన్నుకు 100 పండ్ల వరకూ తూగుతాయి.

ఆపైన విలువైన కలప ఉంది. 40 ఏళ్ల వయసున్న చెట్టును “కలప కోసం అమ్మితే 40,000 రూపాయలు వస్తాయి,” అని రామసామి వివరించారు. పనస చెట్టు కలప చాలా ఉత్తమమైనది. బలంగా ఉండి, నీటిని పీల్చుకోదని, "టేకు కంటే కూడా మంచిది," అని అతనన్నారు. మంచి కలపగా అర్హత పొందాలంటే, ఆ చెట్టు ఆరడుగుల పొడవుండాలి, మందంగా (రెండు అడుగుల మందం అన్నట్టు చేతులతో చూపించారు), ఎటువంటి లోపాలు లేకుండా ఉండాలి. కొనుగోలుదారులు చెట్టును చూసిన తర్వాత మాత్రమే ధరను నిర్ణయిస్తారు. కిటికీ ఫ్రేమ్‌లుగా ఉపయోగపడే మంచి కొమ్మలు ఉంటే - "ఇలా" అంటూ రామసామి తన వెనుక ఉన్న కిటికీని చూపించారు - అప్పుడు దాని విలువ ఇంకా ఎక్కువవుతుంది.

అతని పూర్వీకులు నిర్మించిన ఇంటిలో, ముఖద్వారపు తలుపు ఫ్రేమ్‌ను పనస చెక్కతోనే తయారుచేశారు. మా వెనుకనే ఉన్న - ఇప్పుడాయన నివసించే - కొత్త ఇంట్లో అలంకృతులు చెక్కివున్న తలుపును వారి తోట నుండి వచ్చిన టేకు చెక్కతో తయారుచేశారు. "పాతది లోపల ఉంది," అంటూ ఆయన తర్వాత దాన్ని నాకు చూపించారు. రెండు మందపాటి తలుపు చెక్కలు, కాలంతో పాటు పాతబడి, గీతలు పడివున్న వాటిని ఇంటి వెనుక భాగానికి తరలించారు. "వీటి వయసు 175 సంవత్సరాలు!" అంటూ కొంత గర్వంగా చెప్పారాయన.

తర్వాత ఆయన నాకు ఒక పాత కంజీరా ను చూపించారు. అది పనస చెక్కతో చేసిన ఒక సంగీత వాయిద్యం. దాని ఫ్రేమ్‌లో పుటాకారపు తాళాలున్నాయి. గుండ్రటి ఆ వాయిద్యానికి ఒక వైపు ఉడుంబు తోల్ (ఉడుము చర్మం)తో మూసి ఉంది. వీణై (వీణ), మృదంగం వంటి సంగీత వాయిద్యాల తయారీ కోసం కూడా పనస చెక్కను ఉపయోగిస్తారు. "ఈ పాత కంజీరా మా నాన్నగారిది," అంటూ రామసామి తన చేతుల్లోని కంజీరా ను తిప్పారు. దాని తాళాలు మృదువుగా, లయబద్ధంగా శబ్దం చేశాయి.

రామసామికి చెట్ల గురించీ, పంటల గురించీ ఉన్న విస్తృతమైన జ్ఞానంతో పాటు నాణేలను గురించి కూడా బాగా తెలుసు. ఆయన నాణేలను సేకరిస్తారు. నాణాలు ముద్రించిన సంవత్సరం, అవి ఎంత అరుదైనవో తెలియజేసే పుస్తకాలను ఆయన బయటకు తీశారు. తనకు 65,000, 85,000 రూపాయలను ఇచ్చి కొనడానికి సిద్ధంగా ఉన్న నాణేలను చూపించారు. "కానీ నేను వాటిని అమ్మలేదు," అని ఆయన నవ్వారు. నేను నాణేలను అబ్బురంగా చూస్తున్నప్పుడు, ఆయన భార్య నాకు తినడానికి వేయించిన జీడిపప్పు, ఎలందపళం (రేగు పండ్లు) తెచ్చిపెట్టారు. అవి కొంచం ఉప్పగా, పుల్లగా రుచికరంగా ఉన్నాయి. సమావేశం ఉన్నట్టే ఇవి కూడా సంతృప్తికరంగా ఉన్నాయి.

*****

PHOTO • M. Palani Kumar

పనసపండును చెట్టుమీంచి దించడమనేది ఒక సంక్లిష్టమైన, గమ్మత్తైన ప్రక్రియ. ఒక పెద్ద పండును కోసేందుకు చెట్టు పైకి ఎక్కిన జీతగాడు

PHOTO • M. Palani Kumar

పండ్లు పెద్దవిగా, ఎత్తులో ఉన్నప్పుడు వాటిని కోసి, తాడుతో కట్టి నెమ్మదిగా కిందికి దించుతారు

ప్రస్తుతం ఆయిరమ్ కాచ్చి ని బాగా తెలిసినవారు లీజుకు తీసుకున్నారు. “అయితే, పండిన పంటలో మనం కొంత భాగాన్ని తీసుకున్నా, అన్నీ తీసుకున్నా కూడా వారేం పట్టించుకోరు,” అంటూ నవ్వారతను. దీన్ని ఆయిరమ్ కాచ్చి - 1,000 ఫలాలనిచ్చేది - అని పిలుస్తున్నప్పటికీ, సంవత్సరానికి వచ్చే పంట ఆ సంఖ్యలో మూడవ వంతు, లేదా ఐదవ వంతు మధ్య ఉంటుంది. కానీ ఇది చాలా పేరెన్నికగన్న చెట్టు, దీని పండ్లకు చాలా డిమాండ్ కూడా ఉంది. మధ్యస్థ పరిమాణంలో ఉండే ఒక్క పండులో దాదాపు 200 తొనలుంటాయి. "ఇది తినడానికి చాలా రుచిగానూ, వండడానికి చాలా గొప్పగానూ ఉంటుంది." అని రామసామి చాలా ఆనందంగా చెప్పారు.

సాధారణంగా, చెట్టు వయసు పెరిగే కొద్దీ కాండం ఎంత మందంగా మారితే, అంత ఎక్కువ సంఖ్యలో పండ్లను భరించగలదని రామసామి చెప్పారు. “చెట్లను చూసుకునే వ్యక్తులకు పక్వం చెందడానికి ఒక్కొక్క చెట్టుకు ఎన్ని కాయలను వదిలివేయాలో తెలుసు. చిన్న వయసు చెట్టు మీద ఎక్కువ కాయల్ని వదిలితే, అవన్నీ చిన్నవిగానే మిగిలిపోతాయి,” అతను ఒక కొబ్బరికాయ పరిమాణంలోని కాయను పట్టుకున్నట్లుగా తన చేతులను దగ్గరకు తీసుకొస్తూ చూపించారు. సాధారణంగా, రైతు పనసకాయలను పండించడానికి కొన్ని రసాయనాలను ఉపయోగిస్తాడు. దీన్ని నూటికి నూరు శాతం సేంద్రియ పద్ధతిలో పెంచడం కాస్త కష్టమే అయినా అసాధ్యమేమీ కాదని రామసామి అంటున్నారు.

“ఒక పెద్ద చెట్టు మీద తక్కువ కాయలను వదిలేస్తే, ప్రతి పనస పండు పెద్దదిగా, బరువుగా తయారవుతుంది. కానీ దీనివల్ల ప్రమాదాలు కూడా ఎక్కువగానే ఉంటాయి - తెగుళ్ళు దాడి చేయొచ్చు, వర్షం వల్ల దెబ్బతినొచ్చు, తుఫాను సమయంలో పడిపోవచ్చు. అందుకని మనం కూడా అత్యాశకు పోకూడదు." అంటూ నవ్వారాయన.

రామసామి, పనస గురించి రాసివున్న ఒక పుస్తకాన్ని తెరిచి అందులో ఉన్న బొమ్మలను నాకు చూపించారు. “పెద్ద పండ్లను వీళ్ళెలా కాపాడుకుంటున్నారో చూడండి...పండును పట్టివుంచడానికి ఒక బుట్టను తయారు చేస్తారు, ఆపై దాన్ని జాగ్రత్తగా పైనున్న కొమ్మకు తాళ్లతో కట్టివేస్తారు. ఈ విధంగా చేయడం వలన పండుకు దన్ను లభించి, అది పడిపోదు. పండును కోశాక, కట్టివున్న తాళ్ళ సహాయంతో దాన్ని నెమ్మదిగా కిందికి దించి, ఇలా జాగ్రత్తగా తీసుకువెళ్తారు,” మనిషంత పొడవూ వెడల్పూ ఉన్న ఒక భారీ పనసపండును భుజాన వేసుకుని మోసుకుపోతున్న ఇద్దరు వ్యక్తుల ఫోటోను నాకు చూపిస్తూ చెప్పారు రామసామి. పండ్ల తొడిమలేమైనా దెబ్బతిన్నాయేమో తెలుసుకోవడానికి రామసామి ప్రతిరోజూ తన చెట్లను తనిఖీ చేస్తుంటారు. "అప్పుడు మేం వెంటనే తాళ్లతో ఒక బుట్టను తయారుచేసి పండు కిందిభాగాన కడతాం."

కొన్నిసార్లు, జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పండ్లు పగిలిపోతాయి. పగిలిన పండ్లను సేకరించి పశువుల దాణాగా ఉపయోగిస్తారు. “ఆ పనసపండ్లను చూశారా? అవి కింద పడిపోయాయి, అమ్ముడుపోవు. మా ఆవులు, మేకలు వాటిని సంతోషంగా తింటాయి”. కరువాడు ను అమ్మే స్త్రీలు తమ అమ్మకాలను ముగించారు. చేపలను ఇనుప త్రాసులో తూకం వేసి వంటగదిలోకి తీసుకెళ్ళారు. అమ్మేవాళ్ళకు దోసై (దోసెలు) వడ్డించారు. వాళ్ళవి తినేసి, మా సంభాషణను వింటూ అప్పుడప్పుడూ వాళ్ళూ మాట్లాడుతున్నారు. "మాకో పనస పండు ఇవ్వండి, మా పిల్లలు తినాలనుకుంటున్నారు" అని వాళ్ళు రామసామిని అడిగారు. "వచ్చే నెలలో వచ్చి ఒక పండు తీసుకెళ్ళండి." అని అతను జవాబిచ్చారు.

PHOTO • Aparna Karthikeyan

రామసామి తోట ప్రవేశ ద్వారం వద్ద తన పంటను వరుసగా పేర్చిన పొరుగింటి రైతు

పండ్లను కోసిన తర్వాత, వాటిని మండి వద్ద ఉండే కమీషన్ ఏజెంట్లకు పంపుతామని రామసామి వివరించారు. “కొనేవాళ్ళు వచ్చినప్పుడు వారు మమ్మల్ని పిలుస్తారు. మాకు అప్పటి ధర నచ్చిందో లేదో కనుక్కుంటారు. మనం ఒప్పుకుంటే వాటిని అమ్మి డబ్బులు ఇచ్చేస్తారు. అమ్మకాల ద్వారా వచ్చే ప్రతి 1,000 రూపాయలకు వారు 50 లేదా 100 రూపాయలు తీసుకుంటారు," అని అతను చెప్పారు, "అదికూడా రెండు వైపుల వారి నుండి." రామసామికి ఆ 5 లేదా 10 శాతం చెల్లించడం సంతోషంగా ఉంది. "అది రైతులను చాలా తలనొప్పుల నుండి కాపాడుతుంది. కొనేవాళ్ళు వచ్చే వరకు మనం నిలబడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు, అందుకు ఒక రోజు కంటే ఎక్కువ సమయమే పట్టవచ్చు. మనకు వేరే పనులుంటాయి కదా? ఉత్తినే పణ్రుటి పట్టణంలో వేచి ఉండాలంటే మాకు కుదరదు!"

రెండు దశాబ్దాల క్రితం వరకూ ఈ జిల్లాలో అనేక ఇతర పంటలు పండేవని రామసామి చెప్పారు. “మేము కర్రపెండలం, వేరుశెనగలను పుష్కలంగా పండించేవాళ్ళం. జీడిపప్పు ఫ్యాక్టరీలు ఎక్కువెక్కువ కావడంతో కార్మికుల కొరత ఏర్పడింది. దీనిని తట్టుకోలేక చాలామంది రైతులు పనసపంట వైపు మొగ్గు చూపారు. “పనస పంట సాగుకు కూలీలు చాలా తక్కువ రోజులు పని చేయాల్సి ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరూ దూరప్రాంతాల నుండి ఇక్కడ పనికి వస్తారు. వాళ్ళిద్దరూ వేరే ఊరి వాళ్ళు" ఎండు చేపలు అమ్ముకుంటున్న ఆ ఇద్దరు ఆడవాళ్ళను చూపిస్తూ అన్నారు రామసామి.

అయితే రైతులు కూడా పనస పంటకు దూరమవుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రామసామికి ఐదు ఎకరాల్లో దాదాపు 150 పనస చెట్లు ఉన్నాయి. అదే భూమిలో జీడిమామిడి, మామిడి, చింతచెట్లు కూడా ఉన్నాయి. “పనస, జీడిమామిడి తోటను లీజుకు ఇచ్చాం. మామిడి, చింతపండులను మేం కోసుకుంటాం." అన్నారు రామసామి. పలమారమ్ సంఖ్యను తగ్గించాలని ఆయన అనుకుంటున్నారు. “అది తుఫానుల వల్ల. థానే తుఫాను సమయంలో నేను దాదాపు 200 చెట్లను కోల్పోయాను. మేం వాటిని వదిలించుకోవాలి... ఈ ప్రాంతంలో చాలా చెట్లు పడిపోయాయి. ఇప్పుడు మేం పనస స్థానంలో జీడిమామిడిని నాటాం."

జీడిమామిడి వంటి కొన్ని ఇతర పంటలు తుఫానులకు నష్టపోవనేం కాదు, “అవి మొదటి సంవత్సరం నుండి పంటనిస్తాయి కాబట్టి. పైగా జీడి తోటకు చాలా తక్కువ నిర్వహణ అవసరం. కడలూరు జిల్లా తుఫానులకు ఎక్కువగా గురవుతుంది. దాదాపు ప్రతి పదేళ్ళకు మేమొక పెద్ద తుఫానును ఎదుర్కొంటాం. పదిహేనేళ్ళ వయసు పైబడి, ఎక్కువ ఫలాలను ఇచ్చే పనస చెట్లు మొదట పడిపోతాయి. మాకు ఇదంతా చాల దారుణంగా అనిపిస్తోంది,” అని తలను వూపుతూ, నష్టాన్ని సూచించేందుకు చేతితో సైగలు చేశారు.

PHOTO • Aparna Karthikeyan
PHOTO • Aparna Karthikeyan

ఎడమ : రామసామి కొన్ని సంవత్సరాలుగా పనస పండు గురించి సేకరించిన విస్తృతమైన సాహిత్యంలో కొన్ని అరుదైన పుస్తకాలు ఉన్నాయి . కుడి : నాణేల సేకర్త కూడా అయిన రామసామి వద్ద ఆకట్టుకునే నాణేల సేకరణ ఉంది

కడలూర్ డిస్ట్రిక్ట్ డయాగ్నస్టిక్ రిపోర్ట్ తుఫాను కారణాలను గురించి ఒక వివరణను అందిస్తుంది : "జిల్లాకు పొడవైన తీరప్రాంతం ఉండటం వలన తుఫానులకూ, కుండపోత వర్షాలకూ గురవుతుంది, ఇదే వరదలకు దారి తీస్తుంది."

2012 నాటి వార్తాపత్రిక నివేదికలు థానే తుఫాను విధ్వంసాన్ని నమోదు చేశాయి. ఇది డిసెంబర్ 11, 2011న కడలూరు జిల్లాను తాకింది. "జిల్లా అంతటా రెండు కోట్లకు పైగా పనస, మామిడి, అరటి, కొబ్బరి, జీడి చెట్లను నేలమట్టం చేసింది" అని బిజినెస్ లైన్ పత్రిక పేర్కొంది. పనసచెక్క కావాలంటే ఎవరైనా వచ్చి తీసుకువెళ్ళవచ్చని అడిగిన సంగతిని రామసామి గుర్తుచేసుకున్నారు. “మాకు డబ్బు అవసరంలేదు; కూలిన చెట్లను చూసి తట్టుకోలేకపోయాం... చాలామంది వచ్చి తమ ఇళ్ళను తిరిగి కట్టుకోవడం కోసం ఆ కలపను తీసుకువెళ్లారు."

*****

రామసామి ఇంటి నుండి పనస తోట కొంచెం దూరంలో ఉంది. పొరుగున ఉండే రైతు తన పండ్లను కోసి ఒక వరుసలో ఉంచుతున్నారు. ఆ పనస పండ్లు పిల్లల పార్క్‌లో ఉండే చిన్న రైలు పెట్టెల్లాగా ఒకదాని వెనుక మరొకటి బారుతీరి కూర్చుని తమను మార్కెట్‌కు తీసుకెళ్లే ట్రక్కు కోసం వేచి ఉన్నాయి. తోటలోకి ప్రవేశించిన మరుక్షణం, ఉష్ణోగ్రత పడిపోయింది; అనేక డిగ్రీల చల్లగా అనిపిస్తోంది.

రామసామి చెట్లు, మొక్కలు, పండ్ల గురించి మాట్లాడుతూ నడుస్తున్నారు. ఆయన తోటను సందర్శించడం కొంతవరకూ విద్యా పర్యటనగా, ఎక్కువగా విహారయాత్రలా ఉంది. ఆయన మాకు తినేందుకు అనేక రకాల ఉత్పత్తులను అందజేశారు: బొద్దుగా, రసంతో నిండి ఉండే జీడిపండ్లు; తీపి నిండిన తేనె ఆపిళ్ళు; కండకలిగి ఒకేసారి పుల్లగానూ తీయగానూ ఉన్న చింతపండు.

తర్వాత ఆయన మేం వాసన చూసేందుకు బిరియానీ ఆకులను కోసి ఇచ్చి, నీటిని రుచి చూడాలనుకుంటున్నారా అని మమ్మల్ని అడిగారు. మేం జవాబివ్వడానికి ముందే, త్వరత్వరగా పొలంలోని ఒక మూలకు వెళ్లి మోటారును ఆన్ చేశారు. మధ్యాహ్నపు ఎండలో వజ్రాలలా మెరుస్తూన్న నీరు, లావుగా ఉన్న పైపులోంచి పెద్ద ధారగా బయటకు దూకింది. మేం దోసిళ్ళలో పట్టి, ఆ బోర్‌బావి నీళ్లను తాగాం. నగరాలలోని పంపుల ద్వారా వచ్చే చప్పని క్లోరిన్ కలిపిన నీళ్ళలా కాకుండా ఈ నీళ్ళు తియ్యగా లేకున్నా, చాలా రుచిగా ఉన్నాయి. విశాలంగా నవ్వుతూ ఆయన మోటార్ స్విచ్ ఆపేశారు. మా పర్యటన కొనసాగింది.

PHOTO • M. Palani Kumar

మాళిగమ్‌పట్టు కుగ్రామం లోని తన ఇంట్లో రామసామి

మేం జిల్లాలోనే అతి పురాతనమైన చెట్టు, ఆయిరమ్‌కాచ్చి దగ్గరకు తిరిగి వెళ్ళాం. ఆకుల పందిరి ఆశ్చర్యకరంగా పెద్దదిగానూ, దట్టంగానూ ఉంది. అయితే దాని కాండం తన వయస్సును చూపుతోంది. అది ఇక్కడ బుడిపెలు తిరిగింది, అక్కడ బోలుగా ఉంది. కానీ దాని మొదలుభాగం, కాండం చుట్టూ పెరిగే పనసకాయల దుస్తులను చాలా నెలలపాటు ధరిస్తుంది. "ఇంకో నెలలో ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది!" రామసామి హామీ ఇచ్చారు.

పండ్లతోటలో చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. "అదిగో, అక్కడ 43 శాతం 'గ్లూకోజ్ జాక్' ఉంది. నేను దానిని పరీక్షించి చూశాను,” దాన్ని చూపిస్తూ ఆయన మరొక మూలకు నడిచారు. నీడలు నేలపై నృత్యం చేస్తున్నాయి, కొమ్మలు గలగలలాడాయి, పక్షులు పాడుతున్నాయి. చెట్టుకింద పడుకుని ప్రపంచాన్ని చూడాలనే కోరిక పుట్టింది. కానీ రామసామి అప్పటికే చెట్ల రకాల గురించి మాట్లాడుతున్నారు, అదంతా చాలా మనోహరంగా ఉంది. మామిడిపండ్లలో చాలా భిన్నమైన రుచిని కలిగి, సులభంగా వ్యాప్తి చేయగలిగే నీలం, బెంగుళూర వంటి రకాల్లా కాకుండా, పనసపండ్లకు ప్రతిరూపాల్ని తయారు చేయడం చాలా కష్టం.

"ఉదాహరణకు నేను ఆ చెట్టును వ్యాప్తి చేయాలనుకుంటున్నాను అనుకుందాం," అని అమిత తీపిగా ఉన్న ఒక చెట్టును చూపిస్తూ, "అందుకోసం నేను ఎల్లప్పుడూ విత్తనాలపైన ఆధారపడలేను. ఎందుకంటే ఒక పండులో 100 గింజలు ఉన్నప్పటికీ, వాటిలో ఏ ఒక్కటీ దాని తల్లి చెట్టులా ఉండకపోవచ్చు!" కారణం? పరపరాగసంపర్కం(క్రాస్ పోలినేషన్). వేరొక చెట్టు నుండి వచ్చిన పుప్పొడి మరొక రకంగా ఫలదీకరణం చెందవచ్చు. ఇది వివిధ సాగు రకాలను గందరగోళం చేస్తుంది.

"మేము సీజన్‌లో వచ్చే మొదటి లేదా చివర వచ్చే పండ్లను తీసుకుంటాం. 200-అడుగుల వ్యాసార్థంలో వేరే పనసపండు లేదని నిర్ధారించుకున్న తర్వాత దాన్ని ప్రత్యేకంగా విత్తనాల కోసం ఉపయోగిస్తాం." లేదంటే, సొళై (తొనలు) తియ్యదనాన్నీ, గట్టిదనాన్నీ బట్టి, అవే అనుకూలమైన లక్షణాలను పొందడానికి అంటుకట్టడంపై  రైతులు ఆధారపడతారు.

ఇవికాక మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. వివిధ సమయాల్లో (45 రోజుల నుండి 55 లేదా 70 రోజులు) పండించిన అదే చెట్టు పండ్ల రుచి కూడా భిన్నంగా ఉంటుంది. పనస పంట ప్రత్యేకించి శ్రమతో కూడుకున్న పంట కాకపోవచ్చు, కానీ దాని నిలవ ఉండే సామర్థ్యం తక్కువ కాబట్టి ఇది కొంత చిక్కులతో కూడుకున్నది. "మాకు కావలసింది కోల్డ్ స్టోరేజీ సౌకర్యం," ఇది సాగుదారులూ వ్యాపారులూ కూడా పలికే సాధారణ పల్లవి. “మూడు రోజులు లేదా ఐదు రోజులు! ఆ తర్వాత పండు పాడైపోతుంది,” అంటారు రామసామి. “చూడండి, నేను జీడిపప్పును నిలవ ఉంచి ఒక సంవత్సరం తర్వాత కూడా అమ్మగలను. కానీ ఇది ఒక వారం కూడా ఉండదు!”

ఆయిరమ్ కాచ్చి తప్పకుండా సంతోషిస్తుంది. ఎందుకంటే, రెండువందల యేళ్ళుగా అదలా నిలిచివుంది కదా...

PHOTO • M. Palani Kumar

ఎడమ : రామసామి సేకరించిన ఫోటోలలో ఆయిరమ్ కాచ్చి పాత ఫోటో . కుడి : 2022 లో రామసామి పండ్ల తోటలో ఉన్న అదే చెట్టు

ఈ పరిశోధనా అధ్యయనానికి అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం తన పరిశోధనా నిధుల కార్యక్రమం 2020లో భాగంగా నిధులు సమకూరుస్తుంది.

కవర్ ఫోటో: ఎమ్ పళని కుమార్

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Aparna Karthikeyan

Aparna Karthikeyan is an independent journalist, author and Senior Fellow, PARI. Her non-fiction book 'Nine Rupees an Hour' documents the disappearing livelihoods of Tamil Nadu. She has written five books for children. Aparna lives in Chennai with her family and dogs.

Other stories by Aparna Karthikeyan
Photographs : M. Palani Kumar

M. Palani Kumar is Staff Photographer at People's Archive of Rural India. He is interested in documenting the lives of working-class women and marginalised people. Palani has received the Amplify grant in 2021, and Samyak Drishti and Photo South Asia Grant in 2020. He received the first Dayanita Singh-PARI Documentary Photography Award in 2022. Palani was also the cinematographer of ‘Kakoos' (Toilet), a Tamil-language documentary exposing the practice of manual scavenging in Tamil Nadu.

Other stories by M. Palani Kumar

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli