సుశిక్షితమైన దీపికా కమాన్ కళ్ళు, దాదాపు ఒకేలా కనిపించే మగ-ఆడ పట్టు పురుగుల మధ్యనున్న తేడాను ఇట్టే పసిగట్టగలవు. “ఆ రెండూ ఒకేలా కనిపిస్తాయి కానీ, మగ పురుగు ఆడ పురుగు కంటే పొడవుగా ఉంటుంది,” దాదాపు 13 సెంటీమీటర్ల పొడవైన రెక్కలున్న గోధుమ-లేత గోధుమరంగు జీవులను చూపిస్తూ ఆమె వివరించింది. “పొట్టిగా, స్థూలంగా ఉన్నది ఆడ పురుగు.”

అస్సామ్‌లోని మాజులీ జిల్లా, బొరుణ్ సితదర్ సుక్ గ్రామానికి చెందిన దీపిక, మూడేళ్ళ క్రితం ఎరి పట్టుపురుగుల ( సమియా రిసినీ ) పెంపకాన్ని మొదలుపెట్టారు. దీనిని ఆమె తన తల్లి, అమ్మమ్మల దగ్గర నుంచి నేర్చుకున్నారు..

ఎరి అనేది అస్సామ్‌లోని బ్రహ్మపుత్ర లోయలోనూ, అలాగే పొరుగున ఉన్న అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్‌లలో సాగు చేసే ఒక రకమైన పట్టు. మిసింగ్ (మిషింగ్ అని కూడా అంటారు) సముదాయం సాంప్రదాయికంగా ఈ పట్టుపురుగులను సాగు చేసి, వారి సొంత ఉపయోగాల కోసం ఎరి వస్త్రాన్ని నేస్తుంటారు. అయితే, వాణిజ్య ప్రయోజనాల కోసం పట్టును నేయడమనేది ఈ సముదాయానికి సాపేక్షంగా కొత్త పద్ధతి.

“ఇప్పుడు కాలం మారింది. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా పట్టు పురుగుల పెంపకాన్ని నేర్చుకుని, పెంచుతున్నారు,” ఇరవై ఎనిమిదేళ్ళ దీపిక అన్నారు.

PHOTO • Prakash Bhuyan

పట్టు పురుగులను పెంచుతోన్న దీపికా కమాన్. ఎరి పట్టుపురుగులకు ఆహారం పెట్టే ట్రేని శుభ్రం చేసి, దాన్ని తిరిగి ఎరా పాత్ ఆకులతో నింపుతోన్న దీపిక

పట్టుపురుగుల పెంపకాన్ని ప్రారంభించడానికి, మాజులీలోని సెరికల్చర్ విభాగం నుండి గుడ్లను కొనుక్కోవచ్చు – కొన్ని రకాలు ఒక్కో ప్యాకెట్ ధర సుమారు రూ.400 ఉంటాయి – లేదా, గ్రామంలో ఇప్పటికే ఈ వృత్తి చేపట్టిన వ్యక్తుల నుండి కూడా తీసుకోవచ్చు. ఉచితంగా దొరుకుతాయి కాబట్టి దీపిక, ఆమె భర్త ఉదయ్ సాధారణంగా రెండో పద్ధతినే ఇష్టపడతారు. ఈ జంట ఒకేసారి మూడు జతల కంటే ఎక్కువ పురుగులను ఉంచుకోరు. ఎందుకంటే, పొదిగిన లార్వాలను పోషించడానికి ఎక్కువ ఎరా పాత్ (ఆముదం ఆకులు) కావాలి. వారికి ఎరా బరీ (తోట) లేకపోవడంతో, ఆ ఆకుల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది.

“ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. వీటిని (ఆముదం ఆకులు) చిన్న విస్తీర్ణం ఉన్న భూమిలో సాగు చేయలేం. వీటి కోసం వెదురు కంచెను నిర్మించాలి, మేకలు తినకుండా చూసుకోవాలి,” ఆమె తెలిపారు.

ఈ పురుగులు సుష్టుగా తినేవి కావటంతో వాటికి సరిపోయినన్ని ఎరా ఆకులను అందించడం కష్టమవుతుంది. “పైగా రాత్రిపూట మేల్కొని మరీ వాటికి ఆహారం అందించాలి. అవి ఎంత ఎక్కువ ఆహారం తింటే అంత పట్టును ఉత్పత్తి చేస్తాయి.” అవి కెసేరూ (హెటిరోప్యానాక్స్ ఫ్రేగ్రాన్స్) ఆకులను కూడా తింటాయని ఉదయ్ తెలిపారు. కానీ ఏదో ఒకదాన్ని మాత్రమే తింటాయి. “వాటి జీవితకాలంలో అవి మిగతా అన్నిటినీ మినహాయించి ఒక నిర్దిష్ట ఆకుని మాత్రమే తింటాయి.”

గూడు కట్టుకోవడానికి సిద్ధమైనప్పుడు, అనువైన ప్రదేశాల కోసం వెతుక్కుంటూ ఈ పొకా పొలు (పట్టుపురుగులు) పాకడం మొదలుపెడతాయి. అప్పుడవి రూపాంతరం చెందడం కోసం వాటిని అరటి ఆకుల మీద, ఎండుగడ్డిపైన ఉంచుతారు. దారాలు తయారుచేయడం ప్రారంభించాక, అవి కేవలం రెండు రోజులు మాత్రమే మనకి కనబడతాయి. ఆ తరువాత అవి కకూన్ (పట్టుగూడు)లోకి అదృశ్యమవుతాయి,” దీపిక వివరించారు.

PHOTO • Prakash Bhuyan
PHOTO • Prakash Bhuyan

ఎడమ: దీపిక, ఉదయ్‌ల ఇంటి లోపల గోడకు వేలాడుతున్న ఎరి పట్టుగూళ్ళు. ఆడ పురుగుల పట్టుగూళ్ళు మగ పురుగుల పట్టుగూళ్ళ కంటే పెద్దవిగా ఉంటాయి. కుడి: పళ్ళెంలోని ఆహారాన్ని తింటున్న పట్టుపురుగులు

*****

గూడు కట్టుకునే ప్రక్రియ ప్రారంభమైన పది రోజుల తరువాత పట్టు దారాలను వెలికితీసే ప్రక్రియ మొదలవుతుంది. “వాటిని ఎక్కువసేపు అలాగే ఉంచితే, పట్టుపురుగు రెక్కలపురుగుగా మారి ఎగిరిపోతుంది,” అన్నారు దీపిక.

పట్టుదారాలను రెండు విధాలుగా వెలికి తీయవచ్చు: పట్టుపురుగు రూపాంతరం చెంది, గూడుని వదిలి ఎగిరిపోయేవరకు వేచివుండటం, లేదా పట్టుగూళ్ళను ఉడకబెట్టే మిసింగ్ సంప్రదాయ పద్ధతి.

పట్టుగూడును ఉడకబెట్టకపోతే, చేతితో దారాన్ని తీయడం కష్టమని దీపిక అన్నారు. పురుగు బయటకు వచ్చాక అది త్వరగా కుళ్ళిపోతుంది. “వేడి నీళ్ళలో మరిగిస్తున్నప్పుడు, అవి మృదువుగా అయ్యాయో లేదోనని మేం వాటిని పరిశీలిస్తుంటాం. నిప్పుపై ఈ ప్రక్రియ సుమారు అరగంటపాటు సాగుతుంది,” అన్నారు ఉదయ్.

పొలు పొకా (పట్టుపురుగు) రుచికరమైనది, ఉడికించిన పట్టుగూడు నుంచి దానిని వెలికితీసి తింటారు. “ఇది మాంసంలా రుచిగా ఉంటుంది. దీన్ని వేయించి, లేదా పతొత్ దియా (ఏదైనా కూరగాయ, మాంసం, లేదా చేపను అరటి ఆకులో చుట్టి, నిప్పుల పొయ్యిలో కాల్చి తయారుచేసే వంటకం)గా తినవచ్చు,” దీపిక చెప్పారు..

వెలికితీసిన దారాలను కడిగి, గుడ్డలో చుట్టి, నీడలో ఆరబెడతారు. దారాలను ఒక టకూరి లేదా పపీ (కదురు) సహాయంతో వడుకుతారు. “250 గ్రాముల ఎరి దారాన్ని వడకడానికి మూడు నుండి నాలుగు రోజులు పడుతుంది,” తన రోజువారీ ఇంటి పనులను పూర్తిచేసుకొన్న తర్వాత దారాన్ని వడికే దీపిక తెలిపారు. సంప్రదాయ సదొర్-మెఖేలా (రెండు భాగాలుగా ఉండే దుస్తులు) తయారీకి దాదాపు ఒక కిలో నూలు అవసరమవుతుంది.

PHOTO • Prakash Bhuyan
PHOTO • Prakash Bhuyan

ఎడమ: గుడ్లు పెడుతోన్న ఆడ పురుగులు. పట్టుగూళ్ళ నుండి బయటకు వచ్చిన పురుగులు అప్పటికే పరిపక్వత చెంది సంభోగం, సంతానోత్పత్తికి సిద్ధంగా ఉంటాయి. కుడి: ఎరి పట్టుగూళ్ళ నుండి బయటకు వస్తున్న పురుగులు. పొదిగిన 3-4 వారాల నుండి ఎరి పట్టులార్వాలు గూళ్ళను తయారుచేయటం మొదలెడతాయి. ఈ సమయానికి, ఈ పట్టులార్వాలు వాటి జీవితపు చివరి (నాల్గవ) దశను చేరుకొని, పురుగులుగా రూపాంతరం చెందడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ ప్రక్రియ కోసం, పట్టులార్వా తన చుట్టూ గూడును నిర్మించుకుంటుంది. గూడు నిర్మాణం పూర్తి కావడానికి సుమారు 2-3 రోజులు పడుతుంది. ఆ తరువాత, మూడు వారాల పాటు, పట్టులార్వాలు గూళ్ళలో ఉంటాయి. అందులోనే అవి పురుగులుగా పూర్తి రూపాంతరం చెందుతాయి

PHOTO • Prakash Bhuyan
PHOTO • Prakash Bhuyan

ఎడమ: పట్టుగూళ్ళ నుండి ఎరి పట్టుదారాలను వడికేందుకు ఈ సంప్రదాయ పరికరాలను ఉపయోగిస్తారు: పట్టుదారాలను వడకడానికి టకూరీని ఉపయోగిస్తారు, వడికేటపుడు పపీ ఒక తూనికగా ఉపయోగపడుతుంది. సన్నని ఎరి పట్టు పోగులను ఒక దారంగా వడకడానికి పపీ సహాయపడుతుంది. కుడి: ఒక గిన్నెలో వడ్డించిన వేయించిన పట్టుపురుగులు. మిసింగ్‌తో పాటు ఈశాన్య భారతదేశంలోని అనేక ఇతర సముదాయాల ప్రజలకు పట్టుపురుగులు ఒక రుచికరమైన వంటకం

మొదట వడికినప్పుడు దారాలు తెల్లగా ఉంటాయి. కానీ, పలుమార్లు కడిగిన తరువాత, అవి ఎరి కి ఉండే విలక్షణమైన లేత పసుపుపచ్చ రంగులోకి మారతాయి.

“మేం ఉదయమే పని మొదలుపెట్టి, రోజంతా చేస్తే గనుక, ఒక్క రోజులో ఒక మీటరు ఎరి పట్టును నేయవచ్చు,” చెప్పారు దీపిక.

పట్టుదారాలను పత్తి దారాలతో కూడా కలిపి నేస్తారు. అస్సామీ మహిళలు ధరించే చొక్కాలు, చీరలు, సంప్రదాయ దుస్తులను తయారుచేయడానికి ఈ వస్త్రాన్ని ఉపయోగిస్తారని దీపిక చెప్పారు. ఎరి తో చీరల తయారీ ఇప్పుడున్న నూతన సరళి.

కొత్త పోకడలు ఎన్ని వస్తున్నా, పట్టు వ్యాపార నిర్వహణ చాలా కష్టంతో కూడుకున్న పని. “పట్టుపురుగులను పెంచి, బట్టలను నేయడానికి చాలా సమయం పడుతుంది,” పట్టు పెంపకం నుండి విరామం తీసుకున్న దీపిక తెలిపారు. ఇంటి పనులు, కాలానుగుణంగా చేసే వ్యవసాయ పనులు, అలాగే తన నాలుగేళ్ళ కొడుకు పెంపకం కారణంగా ఆమెకు ఇందుకు సమయం సరిపోవడం లేదు.

*****

నలభయ్యో వడిలో ఉన్న జమినీ పయెంగ్ అత్యంత నైపుణ్యం గల నేతరి. ఈమె క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపును కూడా పొందారు. దాదాపు ఒక దశాబ్దంకాలంగా ఎరి పట్టు వస్త్రాన్ని నేస్తోన్న ఆమె, ఈ కళ పట్ల ప్రస్తుతం ఆసక్తి తగ్గిపోతుండటం గురించి ఆందోళన చెందుతున్నారు. “మగ్గాన్ని కనీసం ముట్టుకోని వ్యక్తులు ఇప్పుడు మన మధ్య ఉన్నారు. వారు అసలైన ఎరి ని గుర్తించలేరు. అలాంటి పరిస్థితి వచ్చింది మరి.”

పదవ తరగతి చదువుతున్నప్పుడు జమినీ వస్త్రాలు, నేతపనికి సంబంధించిన ఒక కోర్సు చేసింది. కాలేజీలో చేరడానికి ముందు ఒక రెండేళ్ళ పాటు ఆమె ప్రాక్టీస్ కూడా చేసింది. డిగ్రీ పూర్తయ్యాక, ఒక ప్రభుత్వేతర సంస్థలో చేరి, సంప్రదాయ పట్టు నేతను గురించి తెలుసుకోవడానికి మాజులీలోని అనేక గ్రామాలను సందర్శించింది.

PHOTO • Prakash Bhuyan
PHOTO • Prakash Bhuyan

ఎడమ: అస్సామ్, మాజులీలోని కమలాబరిలో ఉన్న తన దుకాణంలో తన చిత్రం గీయటం కోసం పోజ్ ఇస్తోన్న జమినీ పయెంగ్. కుడి: మగ్గంపై నేసిన ఒక ఎరి శాలువా

PHOTO • Prakash Bhuyan
PHOTO • Prakash Bhuyan

జమినీ పయెంగ్ కార్యశాలలోని నేత పరికరాలు

ఎరి పెంపకాన్ని సాగించే ఇళ్ళల్లో పిల్లలు తమ తల్లుల నుండి ఈ కళను నేర్చుకుంటారు," మాజులీకి చెందిన జమినీ తెలిపారు. నాకు ఎవరూ తాత్-బతీ (నేతపని) చేయడంగానీ, కండె (బాబిన్)ను తిప్పడంగానీ నేర్పించలేదు. మా అమ్మ చేసే పనిని చూస్తూ నేను నేర్చుకున్నాను.”.

ఇప్పటిలా యంత్రంతో తయారుచేసిన బట్టలు విరివిగా అందుబాటులోకి రాకపోవటం వలన చాలామంది మహిళలు తమ సొంత మగ్గంపై నేసిన పట్టు వస్త్రాలనే ధరించేవారని ఆమె అన్నారు. మహిళలు ఎక్కువగా ఎరి , నూని , ముగా పట్టుతో చేసిన సదొర్ - మెఖేలా ధరించేవారు. “వారు వెళ్ళిన ప్రతిచోటుకూ మహిళలు తమ టకూరి (కదురు)ని తీసుకువెళ్ళేవారు.”

జమినీ స్ఫూర్తి పొందారు. " ఎరి పట్టుపురుగులను పెంచాలని, ఇతరులకు కూడా వాటిని ఎలా పెంచాలో నేర్పించాలని నేను అప్పుడే నిర్ణయించుకున్నాను." ప్రస్తుతం, ఆమె మాజులీకి చెందిన సుమారు 25 మంది మహిళలకు వస్త్రాలు, నేతపనిలో శిక్షణ ఇస్తున్నారు. బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శించిన ఒక వస్త్రం తో సహా ఆమె నేతపని దేశంలోనూ వెలుపలా ప్రదర్శించబడింది.

ఎరి దుస్తులకు గిరాకీ ఎక్కువ. కానీ, మేం వాటిని సంప్రదాయ పద్ధతులను ఉపయోగించి తయారుచేస్తాం,” జమినీ అన్నారు. మిగతాచోట్ల ఈ వస్త్రాలను యంత్రాలపై కూడా నేస్తారు. అంతేకాక, బిహార్‌లోని భాగల్‌పుర్ నుంచి వచ్చే పట్టు ప్రస్తుతం అస్సామ్ మార్కెట్లను ముంచెత్తుతోంది.

చేతితయారీ వస్త్రాల ధరలు వాటిలో ఉపయోగించే దారాలు, సాంకేతికతలపైనా, డిజైన్ సంక్లిష్టతపై కూడా ఆధారపడి ఉంటుంది. సంప్రదాయ డిజైన్లతో, చేతితో నేసిన ఎరి స్టోల్ ధర రూ.3,500కు పైగా ఉండవచ్చు. అలాగే, చేతితో నేసిన సదొర్-మెఖేలా ధర స్థానిక మార్కెట్లో దాదాపు రూ.8,000 దగ్గర మొదలై రూ.15,000 నుండి రూ. 20,000 వరకు ఉండవచ్చు.

“ఇంతకుముందు అస్సామీ అమ్మాయిలు తమ ప్రేమికుల కోసం గమూసా , రుమాల్ , దిండు కవర్లు నేసేవారు. మా మిషింగ్ అమ్మాయిలు అయితే గలుక్ కూడా నేసేవారు,” అన్నారామె. ప్రజలు సంప్రదాయ పద్ధతులను పునరుద్ధరించి, తర్వాతి తరానికి అందించకపోతే, ఈ గొప్ప సాంస్కృతిక వారసత్వం కనుమరుగవుతుందని జమినీ అభిప్రాయపడ్డారు. “అందుకే, ఎక్కువో తక్కువో నేను చేయగలిగినంత పనిని నా బాధ్యతగా తీసుకొని చేస్తున్నాను.”

ఈ కథనానికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ (ఎమ్ఎమ్ఎఫ్) ఫెలోషిప్ మద్దతు ఉంది.

అనువాదం: వై. క్రిష్ణ జ్యోతి

Prakash Bhuyan

Prakash Bhuyan is a poet and photographer from Assam, India. He is a 2022-23 MMF-PARI Fellow covering the art and craft traditions in Majuli, Assam.

Other stories by Prakash Bhuyan
Editor : Swadesha Sharma

Swadesha Sharma is a researcher and Content Editor at the People's Archive of Rural India. She also works with volunteers to curate resources for the PARI Library.

Other stories by Swadesha Sharma
Translator : Y. Krishna Jyothi

Krishna Jyothi has 12 years of experience in journalism as a sub-editor & features writer. Now, she is into blogging.

Other stories by Y. Krishna Jyothi