మధ్య భారతదేశంలోని ఖర్‌గౌన్ పట్టణంలో అది ఏప్రిల్ నెలలోని ఒక వెచ్చని రోజు. మధ్యప్రదేశ్‌లోని ఈ పట్టణంలో రద్దీగా ఉండే చాందినీ చౌక్ ప్రాంతంలోకి దూసుకువస్తోన్న బుల్‌డోజర్‌ల ఝుమ్మనే శబ్దం, అక్కడి నివాసితుల ఉదయపు సందడికి అకస్మాత్తుగా అంతరాయం కలిగించింది. అక్కడ నివాసముండేవారంతా తమ చిన్న చిన్న ఇళ్ళనుండీ దుకాణాల నుండీ భయం భయంగా బయటకు వచ్చారు.

వసీమ్ అహ్మద్ (35) భయంతో నివ్వెరపోయి చూస్తుండగానే, బుల్‌డోజర్‌కున్న భారీ స్టీలు బ్లేడ్లు అతని దుకాణాన్ని అందులో ఉన్న విలువైన వస్తువులతో సహా నిమిషాలలో నలగగొట్టి నాశనం చేసేశాయి. "నా దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్నీ ఈ దుకాణం మీదే ఖర్చుపెట్టేశాను," అన్నారతను.

రాష్ట్ర ప్రభుత్వం 2022, ఏప్రిల్ 11న పంపించిన బుల్‌డోజర్లు కేవలం అతని చిన్న దుకాణాన్నే కాక, ఖర్‌గౌన్‌లోని ముస్లిమ్ జనాభా ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో సుమారు 50 వరకూ ఇళ్ళనూ దుకాణాలనూ నేలమట్టం చేశాయి. ఈ విధంగా ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయటం ద్వారా రామ నవమి పండుగ సందర్భంగా రాళ్ళు రువ్విన ‘విధ్వంసకారుల’పై మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీకార న్యాయం తీర్చుకుంది.

కానీ వసీమ్ వంటివారు రాళ్ళు విసిరారని నిరూపించడం కష్టం. ఎందుకంటే రెండు చేతులను కోల్పోయిన ఆయన రాళ్ళను తీసుకొని రువ్వటం అటుంచి, ఎవరిదైనా సహాయం లేకుండా టీ కూడా తాగలేరు.

"ఆ రోజు జరిగిన సంఘటనతో నాకేమాత్రం సంబంధం లేదు," అంటారు వసీమ్.

ఒక ప్రమాదంలో రెండు చేతులనూ పోగొట్టుకోవడానికి ముందు ఆయన రంగులు వేసే పని చేసేవారు. "ఒక రోజు నేను పని చేస్తుండగా విద్యుదాఘాతం తగిలింది. వైద్యులకు నా రెండు చేతులనూ తీసివేయక తప్పలేదు. ఇది చాలా విపత్తే అయినప్పటికీ, ఇందులోంచి బయటపడే దారి దొరికింది (దుకాణం పెట్టడంతో)," తన దుస్థితికి వ్యర్థంగా చింతిస్తూ కూర్చోవడం కంటే ఈ పని చేసినందుకు గర్వపడుతూ చెప్పారతను.

Left: Wasim Ahmed lost both hands in an accident in 2005.
PHOTO • Parth M.N.
Right: Wasim’s son Aleem helping him drink chai at his house in Khargone
PHOTO • Parth M.N.

ఎడమ: 2005లో జరిగిన ఒక ప్రమాదంలో రెండు చేతులనూ పోగొట్టుకున్న వసీమ్ అహ్మద్. కుడి: ఖర్‌గౌన్‌లోని తమ ఇంటిలో టీ తాగటంలో తండ్రికి సాయపడుతోన్న వసీమ్ కొడుకు అలీమ్

వసీమ్ దుకాణానికి కొనడానికి వచ్చినవారు తమకు ఏం కావాలో - వెచ్చాలు, సరుకులు, మొదలైనవి - ఆయనకు చెప్పి, వాటిని తామే తీసుకుంటారు. "వాళ్ళు డబ్బుని నా జేబులోనో, దుకాణంలోని సొరుగులోనో పెట్టి వెళ్తారు," అన్నారు వసీమ్. "15 ఏళ్ళుగా ఇదే నా జీవనాధారం."

ఆ ఉదయం మొహమ్మద్ రఫీక్ (73) ఖర్‌గౌన్‌లోని చాందిని చౌక్ ప్రాంతంలో తనకున్న నాలుగు దుకాణాల్లో మూడింటిని కోల్పోయారు. దీనివల్ల ఆయనకు రూ. 25 లక్షల నష్టం జరిగింది. "నేను వాళ్ళని బతిమాలాను, వారి కాళ్ళ మీద పడ్డాను," రఫీక్ గుర్తుచేస్తుకున్నారు. "వాళ్ళు (మునిసిపల్ అధికారులు) మమ్మల్ని ఎలాంటి పత్రాలను కూడా చూపించనివ్వలేదు. నా దుకాణాలకు సంబంధించిన ప్రతిదీ చట్టబద్ధమైనదే. కానీ అదేమీ పనికిరాలేదు."

సరుకులు, చిప్స్, సిగరెట్లు, మిఠాయిలు, శీతల పానీయాలు వంటి వాటిని విక్రయించే వసీమ్, రఫీక్‌ల వంటివారి దుకాణాలను ధ్వంసం చేయడం, అల్లర్ల సమయంలో జరిగిన నష్టానికి ప్రతీకారంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన దండన. ఆ తరువాత, కూల్చివేసిన నిర్మాణాలన్నీ ‘చట్టవిరుద్ధమైనవి’ అని జిల్లా యంత్రాంగం చెబుతోంది. అయితే మధ్యప్రదేశ్ గృహమంత్రి నరోత్తమ్ మిశ్రా విలేకరులతో ఇలా చెప్పాడు, " జిస్ ఘరోఁ సే పత్థర్ ఆయే హైఁ, ఉన్ ఘరోంకో హీ పత్థరోఁ కా ఢేర్ బనాయేంగే [ఏ ఇళ్ళనుంచైతే రాళ్ళు పడ్డాయో మేం ఆ ఇళ్ళను రాళ్ళ కుప్పలుగా మారుస్తాం].”

Mohammad Rafique surveying the damage done to his shop in Khargone’s Chandni Chowk by bulldozers
PHOTO • Parth M.N.

ఖర్‌గౌన్‌లోని చాందిని చౌక్‌లో ఉన్న తన దుకాణాలకు బుల్‌డోజర్లు చేసిన నష్టాన్ని పరిశీలిస్తోన్న మొహమ్మద్ రఫీక్

బుల్‌డోజర్లు రావడానికి ముందు జరిగిన అల్లర్లలో ముఖ్తియార్ ఖాన్ వంటివారు తమ ఇళ్ళను కోల్పోయారు. ఆయన ఇల్లు సంజయ్ నగర్‌లో హిందువులు అధికంగా ఉండే ప్రాంతంలో ఉంది. మునిసిపల్ కార్పొరేషన్‌లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తోన్న ఈయన, ఆ అల్లరులు జరిగినపుడు తన విధి నిర్వహణలో ఉన్నారు. "వెంటనే వచ్చి నా కుటుంబాన్ని ఏదైనా సురక్షిత ప్రదేశానికి తీసుకువెళ్ళమంటూ నా స్నేహితుడు కాల్ చేశాడు," అని ఆయన గుర్తుచేసుకున్నారు.

ముఖ్తియార్ ఇల్లు సంజయ్ నగర్‌లో హిందువులు అధికంగా ఉండే ప్రాంతంలో ఉండటం వలన, ఆ స్నేహితుడు ఇచ్చిన సలహా వారి ప్రాణాలను కాపాడింది. అదృష్టవశాత్తూ సమయానికి ఆయన తన ఇల్లు చేరుకోవటంతో, ఆ కుటుంబం ఆపద నుంచి తప్పించుకొని ఒక ముస్లిమ్ ప్రాంతంలో ఉన్న ఆయన సోదరి ఇంటికి సురక్షితంగా చేరికోగలిగింది.

ఆయన తిరిగి వచ్చేసరికి ఇల్లంతా కాలిపోయి ఉంది. "సర్వనాశనమైపోయింది," అంటూ ఆయన గుర్తుచేసుకున్నారు.

ముఖ్తియార్ తన 44 ఏళ్ళ జీవితాన్నంతా ఈ ప్రాంతంలోనే జీవించారు. "మాకు (ఆయన తల్లిదండ్రులకు) ఒక చిన్న గుడిసె ఉండేది. నేను 15 ఏళ్ళ పాటు డబ్బు పొదుపు చేసుకొని, 2016లో ఈ ఇంటిని కట్టుకున్నాను. నా జీవితమంతా ఇక్కడే ఉన్నాను, ప్రతి ఒక్కరితోనూ స్నేహసంబంధాలనే కలిగివున్నాను," విచారంగా చెప్పారతను.

తన ఇంటిని కోల్పోవటంతో ముఖ్తియార్ ప్రస్తుతం ఖర్‌గౌన్‌లో నెలకు రూ. 5,000 చెల్లించి ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆ మొత్తం ఆయనకొచ్చే జీతంలో మూడవ వంతు. ఆయన ఇంటిని అందులోని మొత్తం సామాన్లతో సహా తగులబెట్టడంతో, కొత్త పాత్ర సామగ్రిని, కొత్త బట్టలను, చివరకు కొత్త గృహోపకరణాలను కూడా ఆయన కొనవలసివచ్చింది.

"నా జీవితాన్ని నాశనం చేయబోయే ముందు వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచించనేలేదు. ప్రత్యేకించి గత నాలుగైదు సంవత్సరాలుగా హిందూ ముస్లిముల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఈ రోజుల్లో మేమెప్పుడూ ప్రమాదపు అంచునే ఉంటున్నాం."

Mukhtiyar lost his home during the communal riots in Khargone
PHOTO • Parth M.N.

ఖర్‌గౌన్‌లో జరిగిన మతకలహాలలో ఇంటిని కోల్పోయిన ముఖ్తియార్

ముఖ్తియార్‌కు రూ. 1.76 లక్షల పరిహారం రావలసి ఉంది- ఇది ఆయన కోల్పోయినదానిలో చాలా కొద్ది మొత్తం మాత్రమే. ఈ కథనాన్ని ప్రచురించే సమయానికి ఆయనకు ఎటువంటి నష్టపరిహారం అందలేదు; అసలా డబ్బు అంత తొందరగా వస్తుందని కూడా ఆయన అనుకోవటంలేదు.

"నా ఇల్లు ధ్వంసం అయిపోయింది కాబట్టి నేను నష్టపరిహారాన్నీ న్యాయాన్నీ కూడా కోరుతున్నాను," అన్నారాయన. "రెండు రోజుల తర్వాత, ఆ అల్లరి మూకలు చేసిన పనినే పాలనాధికారులు కూడా చేశారు."

గత రెండు లేదా మూడేళ్ళుగా బిజెపి పాలిత రాష్ట్రాలు 'బుల్‌డోజర్ న్యాయానికి’ పర్యాయపదంగా మారాయి. మధ్యప్రదేశ్‌తో పాటు ఉత్తరప్రదేశ్, దిల్లీ, హరియాణా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు, నేరం చేసినట్లుగా ఆరోపించబడినవారికి చెందిన ఇళ్ళనూ దుకాణాలనూ బుల్‌డోజర్‌తో నేలమట్టం చేసిన సంఘటనలను చూశాయి. అలా అరోపణలు ఎదుర్కొంటున్నవారు నిజంగా దోషులు కాకపోవచ్చు, కానూవచ్చు. కానీ అలా కూల్చివేసిన నిర్మాణాలలో ఎక్కువ ముస్లిములవే ఉంటున్నాయి.

ఖర్‌గోన్‌లో రాజ్యం కేవలం ముస్లిములకు చెందిన నిర్మాణాలనే కూలగొట్టిందని రాజ్యం చేసిన ఈ కూల్చివేతలను పరిశీలించిన పౌర హక్కుల ప్రజా సంఘం (పియుసిఎల్) ఈ రిపోర్టర్‌తో పంచుకున్న ఒక నివేదికలో ఎత్తిచూపింది. నేలమట్టం చేసిన దాదాపు 50 నిర్మాణాలు మొత్తం ముస్లిములకు చెందినవేనని వారు కనుగొన్నారు.

"ఈ హింస వలన రెండు సముదాయాలూ నష్టపోయినప్పటికీ, పరిపాలనాధికారులు నాశనం చేసిన ఆస్తులన్నీ ముస్లిములకు చెందినవే," అని ఈ నివేదిక ప్రకటించింది. "ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, తమ వస్తువులను తీసుకోవడానికి వారికి ఎలాంటి సమయం కూడా ఇవ్వలేదు. జిల్లా అధికారుల నాయకత్వంలోని కూలగొట్టే బృందాలు వారి ఇళ్ళపైనా, వ్యాపారాలపైనా నేరుగా దిగిపోయి వాటిని నాశనం చేశాయి."

*****

తరచుగా జరిగినట్లే ఈసారి కూడా అదంతా ఒక పుకారుతో మొదలయింది. రామ నవమి వేడుకలు జరుగుతోన్న ఏప్రిల్ 10, 2022న ఖర్‌గౌన్‌లోని తాలాబ్ చౌక్ వద్ద ఒక హిందువుల ఊరేగింపును పోలీసులు నిలిపివేశారనే వదంతి వ్యాపించింది. అది సోషల్ మీడియాలో చిలువలుపలువలు తొడగటంతో, కొద్దిసేపటికే ద్వేషపూరిత నినాదాలు చేస్తూ ఒక మిలిటెంట్ గుంపు పోగయ్యి, ఆ ప్రాంతం వైపుకు సాగింది.

Rafique in front of his now destroyed shop in Khargone. A PUCL report says, 'even though both communities were affected by the violence, all the properties destroyed by the administration belonged to Muslims'.
PHOTO • Parth M.N.

ఖర్‌గౌన్‌లో ప్రస్తుతం నాశనమైపోయిన తన దుకాణం ముందు నిల్చొనివున్న రఫీక్. 'ఈ హింస వలన రెండు సముదాయాలూ నష్టపోయినప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం నాశనం చేసిన ఆస్తులన్నీ ముస్లిములకు చెందినవే,' అని ఒక పియుసిఎల్ నివేదిక తెలియజేస్తోంది

అదే సమయంలో దగ్గరలోనే ఉన్న మసీదు నుంచి తమ ప్రార్థనలు ముగించుకొని వస్తోన్న ముస్లిములు ఈ కోపంతో ఉన్న గుంపుకు తారసపడ్డారు. రాళ్ళు రువ్వడంతో పరిస్థితులు హింసాత్మకంగా మారి, వెంటనే పట్టణంలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపించింది. తీవ్రవాద హిందూ గుంపులు ముస్లిముల ఇళ్ళనూ దుకాణాలనూ లక్ష్యంగా చేసుకున్నాయి.

విషయాలను మరింత దిగజార్చడానికి, సిఎన్ఎన్ న్యూస్ 18 ప్రైమ్ టైమ్ యాంకర్ అయిన అమన్ చోప్రా, అదే సమయంలో ఖర్‌గౌన్‌పై ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించాడు. దానికి “హిందూ రామ్ నవమి మనాయే, ‘రఫీక్’ పత్తర్ బర్సాయే” అనే శీర్షిక పెట్టారు. ఈ శీర్షికను స్థూలంగా అనువదిస్తే, "హిందువులు రామ నవమిని జరుపుకుంటారు, కానీ 'రఫీక్' రాళ్ళ వర్షం కురిపిస్తాడు." అని అర్థం.

చోప్రా ప్రత్యేకంగా మొహమ్మద్ రఫీక్‌ను లక్ష్యంగా చేసుకున్నాడా, లేదా ఒక సాధారణ ముస్లిమ్ పేరును ఉపయోగించాలనుకున్నాడా అనేది ఇక్కడ స్పష్టంగా లేదు, కానీ ఈ ప్రదర్శన రఫీక్, అతని కుటుంబంపై భయంకరమైన ప్రభావాన్ని చూపింది. "ఈ సంఘటన తర్వాత చాలా రోజుల పాటు నేను నిద్రపోలేకపోయాను," అని అతను చెప్పారు. "ఈ వయస్సులో, నేను ఈ ఒత్తిడిని భరించలేను."

రఫీక్ దుకాణాలను పడగొట్టి ఇప్పటికి ఏడాదిన్నర కావొస్తోంది. కానీ ఇప్పటికీ ఆయన వద్ద చోప్రా షోకు సంబంధించిన ఒక ప్రింటవుట్ ఉంది. అది ఆయనను మొదటిసారి ఎంతగా బాధించిందో ఇప్పటికీ అంతే బాధిస్తుంటుంది.

చోప్రా షో తర్వాత, హిందూ సముదాయంవారు కొంతకాలం పాటు తన దగ్గర శీతల పానీయాలను, పాల ఉత్పత్తులనూ కొనడం మానేశారని రఫీక్ చెప్పారు. ముస్లిములను ఆర్థిక బహిష్కరణ చేయాలని తీవ్రవాద హిందూ గ్రూపులు ఇప్పటికే పిలుపునిచ్చాయి. ఈ ప్రదర్శన వలన పరిస్థితి మరింత దిగజారింది. "నువ్వొక జర్నలిస్టువి బిడ్డా," రఫీక్ నాతో అన్నారు. "జర్నలిస్టు చేయాల్సిన పని ఇదేనా?"

The rubble after the demolition ordered by the Khargone Municipal Corporation
PHOTO • Parth M.N.

ఖర్‌గౌన్ మునిసిపల్ కార్పోరేషన్ కూల్చివేత ఉత్తర్వుల ఇచ్చిన తర్వాత మిగిలిన శిథిలాలు

నా స్వంత వృత్తి గురించి కలవరపడటం తప్ప ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. “నిన్ను ఇరకాటంలో పెట్టటం నా ఉద్దేశ్యం కాదు. నువ్వు మంచి కుర్రాడిలా కనిపిస్తున్నావు,” వెంటనే అంటూ ఆయన తన దుకాణం నుండి శీతల పానీయాన్ని నవ్వుతూ నాకు అందించారు. “నాకింకా ఒక దుకాణం మిగిలి ఉంది, నా కొడుకులు కూడా స్థిరపడ్డారు. కానీ చాలా మందికి ఆ సౌకర్యం లేదు. వారంతా తినే తిండికి కూడా కష్టపడుతూ జీవిస్తున్నారు.”

తన దుకాణాన్ని మళ్ళీ నిర్మించుకునేందుకు వసీమ్ వద్ద డబ్బు లేదు. ఆయన దుకాణాన్ని కూల్చివేసిన ఈ ఏడాదిన్నరలో నడిపేందుకు దుకాణం లేకపోవడంతో ఆయన డబ్బులేమీ సంపాదించలేకపోయారు. అతనికి సహాయం చేస్తామని ఖర్‌గౌన్ మునిసిపల్ కార్పొరేషన్ చెప్పింది: " ముఝే బోలా థా మదద్ కరేంగే, లేకిన్ బస్ నామ్ కే లియే వో [నష్టపరిహారం ఇచ్చి నాకు సహాయం చేస్తామని వాళ్ళు చెప్పారు, కానీ అదేదో పేరుకు మాత్రమే]."

"చేతులు లేని మనిషి పెద్దగా చేయగలిగిందేమీ ఉండదు," అంటారు వసీమ్.

వసీమ్ దుకాణాన్ని కూలగొట్టిన తర్వాత, ఖర్‌గౌన్‌లో అలాంటిదే ఒక చిన్న దుకాణాన్ని నడుపుతోన్న ఆయన అన్న వారి బాగోగులు చూస్తున్నారు. "నా ఇద్దరు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాను," అన్నారు వసీమ్. "మూడో అబ్బాయి వయసు రెండేళ్ళు. వాడు కూడా ప్రభుత్వ పాఠశాలకే వెళ్ళాలి. నా పిల్లల భవిష్యత్తు నాశనమైపోయింది. నా విధితో నేను బలవంతంగా రాజీపడాల్సి వస్తోంది."

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Editor : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli