తూఫానీ, ఆయన నేతకారుల బృందం ఉదయం 6:30 నుంచి పని చేస్తున్నారు. రోజుకు 12 అంగుళాల నేత నేస్తూ, ఆ నలుగురు కలిసి పనిచేస్తే, 23x6 అడుగుల గలీచా (కార్పెట్)ను పూర్తి చేయడానికి వారికి 40 రోజులు పడుతుంది.

మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు, తూఫానీ బింద్ చివరకు ఒక చెక్క బల్లపై విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నారు. ఆయన పని చేస్తున్న రేకుల షెడ్‌లో, ఆయనకు వెనుకవైపున్న చెక్క చట్రానికి తెల్లటి నూలు దారాలు వేలాడుతున్నాయి. ఆయన ఈ కార్యశాల ఉత్తరప్రదేశ్‌లోని పుర్‌జాగీర్ ముజేహరా గ్రామంలో ఉంది. ఈ గ్రామం రాష్ట్రంలో తివాచీ నేతపనికి గుండెకాయ వంటిది. మొఘలులు ఈ కళను మీర్జాపూర్‌లో ప్రవేశపెడితే, బ్రిటిష్‌వాళ్ళు దీన్ని ఒక పరిశ్రమగా మార్చారు. రగ్గులు, చాపలు, తివాచీల ఉత్పత్తిలో యూపీదే ఆధిపత్యం. దేశీయ ఉత్పత్తిలో దాదాపు సగం (47 శాతం) ఉత్పత్తి ఇక్కడే జరుగుతోందని 2020 అఖిల భారత చేనేత గణన పేర్కొంది.

మీర్జాపూర్ నగరం నుంచి హైవే దిగగానే పుర్‌జాగీర్ ముజేహరా గ్రామానికి వెళ్ళే ఇరుకైన రహదారి కనబడుతుంది. గ్రామంలో ఇరువైపులా ఎక్కువగా ఒకే అంతస్తు ఉన్న పక్కా ఇళ్ళతో పాటు గడ్డి కప్పులతో నిర్మించిన కచ్చా ఇళ్ళు కూడా కనిపిస్తాయి; ఆవు పేడతో తయారుచేసిన పిడకలను కాలిస్తే లేచే పొగ గాలిలో తేలుతుంటుంది. ఇక్కడ రోజంతా మగవాళ్ళు బయట కనిపించరు, కానీ ఆడవాళ్ళు చేతి పంపు దగ్గర బట్టలు ఉతకడం లాంటి ఇంటి పనులు చేస్తూనో, లేదా కూరగాయలు, అలంకరణ సామాగ్రిని అమ్మే వ్యక్తితో మాట్లాడుతూనో కనిపిస్తారు.

ఇది చేనేతకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం అనడానికి ఇక్కడ ఎలాంటి సంకేతాలు కనిపించవు – స్థానికులు గలీచాలు అని పిలిచే ఈ తివాచీలు బయట వేలాడదీసి గానీ, పేర్చిపెట్టి గానీ కనిపించవు. ఇళ్ళల్లో తివాచీలు నేయడానికి అదనంగా స్థలాన్ని, లేదా గదిని కేటాయించుకున్నప్పటికీ, అది ఒకసారి సిద్ధమయ్యాక, దాన్ని కడగడం, శుభ్రపరచడం కోసం మధ్యదళారులు స్వాధీనం చేసుకుంటారు.

తూఫానీ విశ్రాంతి తీసుకుంటూనే PARIతో మాట్లాడుతూ, "నేను మా నాన్న నుంచి ఈ పని [ముడులు వేస్తూ చేసే నేతపని] నేర్చుకున్నాను. నాకు 12-13 సంవత్సరాల వయస్సు నుంచే ఈ పని చేస్తున్నాను," అన్నారు. ఆయన కుటుంబం బింద్ సామాజిక వర్గానికి (రాష్ట్రంలో ఇతర వెనుకబడిన తరగతుల జాబితాలో ఉంది) చెందినది. యూపీలో చాలామంది నేత కార్మికులు ఒబిసి కింద నమోదైవున్నారని గణన పేర్కొంది.

PHOTO • Akanksha Kumar

మగ్గం ముందు పాటాపై (చెక్క బల్ల) కూర్చున్న పుర్‌జాగీర్ ముజేహరా గ్రామానికి చెందిన నేత కార్మికుడు తూఫానీ బింద్

PHOTO • Akanksha Kumar
PHOTO • Akanksha Kumar

ఎడమ: తివాచీలు నేసే కార్యశాల లోపల, గదికి ఇరువైపులా తవ్విన గాడిలో మగ్గం ఉంటుంది. కుడి: పుర్‌జాగీర్ గ్రామంలో ఇటుక, మట్టితో కట్టిన ఒక సాధారణ కార్యశాల

మట్టి నేలతో ఉండే వారి ఇళ్ళలోని ఇరుకైన ప్రదేశాలలోనే వారి కార్యశాలలుంటాయి. ఉన్న ఒకే ఒక కిటికీని, తలుపును గాలి కోసం తెరిచి ఉంచుతారు. ఇంటిలో మగ్గమే ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. తూఫానీకి చెందిన కార్యశాల వంటి కొన్ని, ఇనుప మగ్గానికి అనుగుణంగా పొడవుగా, తక్కువ వెడల్పుతో ఉంటాయి. దీనిపై ఒకే సమయంలో ఎక్కువమంది నేత కార్మికులు పని చేయవచ్చు. ఇంట్లోని మిగతావాళ్ళు ఇనుప లేదా చెక్క కడ్డీపై అమర్చిన చిన్న మగ్గాన్ని ఉపయోగిస్తారు; అలా కుటుంబం మొత్తం నేత పనిలో పాల్గొంటుంది.

తూఫానీ నూలు చట్రంపై ఉన్ని దారాలతో కుట్లు వేస్తున్నారు - ఈ టెక్నిక్‌ను ముడుల నేత (లేదా టప్కా ) అని పిలుస్తారు. టప్కా అనేది తివాచీలో చదరపు అంగుళానికి ఎన్ని కుట్లు ఉన్నాయో, ఆ సంఖ్యను సూచిస్తుంది. నేతకారుడు చేతితో కుట్లు వేయాల్సిరావడం వలన ఇతర నేత పనుల కంటే, ఈ పనిలో భౌతిక శ్రమ చాలా ఎక్కువ. ఈ పనిలో తూఫానీ, దంభ్ (వెదురు తులాదండం)ని ఉపయోగించి సూత్ (నూలు) చట్రాన్ని సర్దుబాటు చేయడానికి ప్రతి కొన్ని నిమిషాలకు లేవాల్సి ఉంటుంది. ఇలా పదే పదే మోకాళ్ళపై కూర్చుని, లేవడానికి చాలా శక్తి కావాలి.

ముడుల నేత కాకుండా, కుచ్చుల నేత పద్ధతిలో తివాచీని నేయడమనేది, చేతితో పట్టుకునే ఎంబ్రాయిడరీ మెషీన్‌ను ఉపయోగించి నేసే కొత్త విధానం. ముడుల నేత కష్టంగా ఉండటంతో పాటు, వేతనాలు కూడా తక్కువగా ఉండటం వలన చాలామంది నేత కార్మికులు గత రెండు దశాబ్దాలలో ముడుల నేత నుంచి కుచ్చు నేతకు మారితే, చాలామంది మొత్తానికే మానుకున్నారు. ఈ పనిలో లభించే రోజుకూలీ రూ. 200-350 వాళ్ళకు ఎందుకూ సరిపోదు. 2024 మే నెలలో, రాష్ట్ర కార్మిక శాఖ పాక్షిక నైపుణ్య కార్మికులకు రోజువారీ వేతనాన్ని రూ. 451గా ప్రకటించింది ,  అయితే ఆ మొత్తాన్ని తమకు చెల్లించడం లేదని ఇక్కడి నేత కార్మికులు చెబుతున్నారు.

పుర్‌జాగీర్ నేత కార్మికులకు చాలా పోటీ ఉందని మీర్జాపూర్ పరిశ్రమల శాఖ డిప్యూటీ కమిషనర్ అశోక్ కుమార్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్, భదోహి, పానీపత్ జిల్లాల్లో కూడా తివాచీలు నేస్తారు. "డిమాండ్ చాలా తగ్గిపోవడం సరఫరాను ప్రభావితం చేసింది," అని ఆయన చెప్పారు.

దానికి తోడు ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. 2000ల ప్రారంభంలో, తివాచీల పరిశ్రమలో బాల కార్మికులను ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు ఈ పరిశ్రమ ప్రతిష్టను దెబ్బతీశాయి. యూరో రాకతో టర్కీలో యంత్రాలతో తయారుచేసిన తివాచీలు తక్కువ ధరకే లభించడం మొదలై, నెమ్మదిగా యూరోపియన్ మార్కెట్‌ తగ్గిపోయిందని మీర్జాపూర్‌కు చెందిన ఎగుమతిదారు సిద్ధనాథ్ సింగ్ చెప్పారు. గతంలో 10-20 శాతం ఉన్న రాష్ట్ర సబ్సిడీ కూడా 3-5 శాతానికి పడిపోయిందని ఆయన అన్నారు.

"రోజుకు 10-12 గంటలు పనిచేసి రూ. 350 సంపాదించే బదులు, రూ. 550 రోజువారీ వేతనంతో నగరంలో ఎందుకు పని చేయకూడదు," అని కార్పెట్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (CEPC) మాజీ ఛైర్మన్ అయిన సింగ్ అన్నారు.

PHOTO • Akanksha Kumar
PHOTO • Akanksha Kumar

నూలు దారాన్ని మగ్గానికి ఉన్న ఇనుప పైపులపై (ఎడమ) అమరుస్తారు, దారపు చట్రాన్ని మార్చడానికి మగ్గానికి వెదురుతో చేసిన తులాదండాన్ని (కుడి) జోడిస్తారు

తూఫానీకి ఒకప్పుడు ఏకంగా 5-10 రంగుల దారాలతో నేయడంలో ప్రావీణ్యం ఉండేది. కానీ తక్కువ వేతనం ఆయన ఉత్సాహాన్ని తగ్గించింది. “పని ఇచ్చేది మధ్యదళారులు. మనం పగలనక రాత్రనకా నేస్తూ ఉంటే, మనకంటే వాళ్ళే ఎక్కువ సంపాదిస్తున్నారు," అని ఆయన నిరుత్సాహంగా చెప్పారు.

ఈరోజు ఆయన ఎంత నేసాడు అన్నదాని ఆధారంగా 10-12 గంటల పనికి ఆయన రూ.350 సంపాదిస్తారు, ఆయన వేతనాన్ని నెలాఖరులో చెల్లిస్తారు. కానీ ఈ పద్ధతిని తీసేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు, ఎందుకంటే దీనిలో ఆయన ఎన్ని గంటలు పని చేశారో పరిగణనలోకి తీసుకోరు. ఇలాంటి నైపుణ్యం కలిగిన పనికి రోజుకు రూ. 700 కూలీ ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.

కాంట్రాక్టులను పొందిన మధ్యదళారులు గజ్ (ఒక గజ్ సుమారు 36 అంగుళాలు) లెక్కన చెల్లిస్తారు. సగటు తివాచీ పొడవు నాలుగు నుంచి ఐదు గజ్‌లు ఉంటుంది. ఆ విధంగా కాంట్రాక్టర్ దాదాపు రూ. 2,200 సంపాదిస్తే, నేత కార్మికునికి కేవలం రూ. 1,200 వస్తుంది. అయితే ముడి పదార్థం - కాతీ (ఉన్ని దారం), సూత్ ( పత్తి నూలు)కు కాంట్రాక్టర్లే చెల్లిస్తారు.

తూఫానీకి ఇంకా బడిలో చదువుకుంటోన్న నలుగురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. తన పిల్లలు తన అడుగుజాడల్లో నడవడం ఆయనకు ఇష్టం లేదు. “వాళ్ళ నాన్న, తాత తమ జీవితమంతా చేసిన పనినే వాళ్ళూ ఎందుకు చేయాలి? వాళ్ళు చదువుకుని ఏదైనా మంచి ఉద్యోగాలు చేసుకోకూడదా?”

*****

ఒక సంవత్సరంలో తూఫానీ, ఆయన బృందం రోజుకు 12 గంటలు పని చేస్తూ 10-12 తివాచీలను నేస్తారు. ఆయనతో పనిచేసే రాజేంద్ర మౌర్య, లాల్జీ బింద్‌లిద్దరూ 50 ఏళ్ళ వయస్సులో ఉన్నారు. గాలి రావడానికి ఒకే ఒక కిటికీ, తలుపు ఉన్న ఒక చిన్న గదిలో వాళ్ళంతా కలిసి పని చేస్తారు. కానీ వేసవికాలం వాళ్ళకు చాలా కష్టంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు, రేకుల పైకప్పు వేసిన పాక్షిక పక్కా ఇల్లు కావటంతో, వేడిమి నుండి రక్షణ తక్కువ ఉండటం వలన గదులు చాలా వేడెక్కిపోతాయి.

" గలీచా [తివాచీ] తయారుచేయడంలో మొదటి అడుగు తానా లేదా తనానా ," అని తూఫానీ చెప్పారు. దాని అర్థం - మగ్గంపై నూలు చట్రాన్ని అమర్చడం.

PHOTO • Akanksha Kumar
PHOTO • Akanksha Kumar

ఎడమ: ఊలు దారాన్ని సరి చేస్తున్న తూఫానీ సహోద్యోగి, నేతకారుడు రాజేంద్ర మౌర్య. కుడి: ఎక్కువ గంటలు నేయడం వల్ల తన కంటి చూపు దెబ్బ తినిందని మరో సహోద్యోగి లాల్జీ బింద్ చెప్పారు

PHOTO • Akanksha Kumar
PHOTO • Akanksha Kumar

ఎడమ: మగ్గం ఇనుప దూలం మీద నూలు చట్రం జారిపోకుండా నిరోధిస్తున్న కొక్కెం. కుడి: కుట్లను సరిచేయడానికి నేతకారులు పంజా (ఇనుప దువ్వెన)ను ఉపయోగిస్తారు

25x11 అడుగుల పొడవున్న దీర్ఘచతురస్రాకారపు గదిలో, మగ్గాన్ని ఉంచినచోట ఇరువైపులా గుంతలు ఉన్నాయి. తివాచీ చట్రాన్ని నిలిపి ఉంచేందుకు ఒక వైపున తాళ్ళు ఉండేలా మగ్గాన్ని ఇనుముతో తయారుచేశారు. తూఫానీ ఐదేళ్ళ క్రితం నెలవారీ వాయిదాలలో రూ. 70,000 రుణం తీసుకుని దాన్ని కొన్నారు. "మా నాన్న కాలంలో, వాళ్ళు రాతి స్తంభాలపై ఉంచిన చెక్క మగ్గాలను ఉపయోగించేవాళ్ళు," అని ఆయన చెప్పారు.

తివాచీలోని ప్రతి ముడిలో ఒక ఛర్రీ (వరుస కుట్టు) ఉంటుంది. దీని కోసం నేతకారులు ఉన్ని దారాన్ని ఉపయోగిస్తారు. దానిని అటూ ఇటూ కదలకుండా ఉంచడానికి, తూఫానీ నూలు దారాన్ని ఉపయోగించి లచ్ఛీ (నూలు దారం చుట్టూ U-ఆకారపు ఉచ్చులు) వరుసను ఏర్పరుస్తారు. అతను దానిని వదులుగా ఉన్న ఉన్ని దారం చివరకు తీసుకువచ్చి, ఒక ఛురా తో (చిన్న కత్తి) కత్తిరించారు. అప్పుడు, పంజా (ఇనుప దువ్వెన) ఉపయోగించి, ఆయన మొత్తం కుట్ల పైన గట్టిగా తట్టారు. " కాట్నా ఔర్ ఠోక్‌నా [కత్తిరించడం, తట్టడం], అదే ముడుల నేత పని," అని ఆయన వివరించారు.

నేతపని ఆ పని చేసేవాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. 35 సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉన్న లాల్జీ బింద్ మాట్లాడుతూ, "ఏళ్ళు గడిచే కొద్దీ ఇది నా కంటి చూపును దెబ్బతీసింది," అన్నారు. ఆయన పని చేసేటప్పుడు కళ్ళద్దాలు పెట్టుకోవాలి. వెన్నునొప్పి, తుంటినొప్పి (సయాటికా) గురించి కూడా ఇతర నేతకారులు ఫిర్యాదు చేశారు. ఈ వృత్తిని చేపట్టడం తప్ప తమకు వేరే మార్గం లేదని వాళ్ళు అన్నారు. "మాకున్న అవకాశాలు చాలా తక్కువ," అన్నారు తూఫానీ. గ్రామీణ యూపీలో దాదాపు 75 శాతం మంది నేతకారులు ముస్లిములే అని జనాభా లెక్కలు చెబుతున్నాయి.

"15 సంవత్సరాల క్రితం సుమారు 800 కుటుంబాలు ఈ ముడుల నేతపని చేసేవి," అని పుర్‌జాగీర్‌కు చెందిన నేతకారుడు అరవింద్ కుమార్ బింద్ గుర్తుచేసుకున్నారు, "ఈ రోజు ఆ సంఖ్య 100కి పడిపోయింది." ఇది పుర్‌జాగీర్ ముజేహరాలోని 1,107 జనాభాలో మూడవ వంతు కంటే ఎక్కువ (జనగణన 2011).

PHOTO • Akanksha Kumar
PHOTO • Akanksha Kumar

ఎడమ: మగ్గం పొడవుకు సమాంతరంగా ఉండే డిజైన్ పటంతో నూలు, ఉన్ని దారాలను ఉపయోగించి నేస్తోన్న ముడుల తివాచీ నేత. కుడి: నేతకారులు ఛర్రీ లేదా వరుస కుట్ల కోసం ఉన్ని దారాన్ని ఉపయోగిస్తారు

PHOTO • Akanksha Kumar
PHOTO • Akanksha Kumar

ఎడమ: U-ఆకారపు ఉచ్చులు లేదా లచ్ఛీని కుట్టడానికి నూలు దారాన్ని ఉపయోగిస్తారు. కుడి: వదులుగా ఉన్న ఉన్ని దారాన్ని కత్తిరించడానికి ఒక ఛురా(బాకు)ను ఉపయోగిస్తారు, అప్పుడు తివాచీ బొచ్చుబొచ్చుగా కనిపిస్తుంది

సమీపంలోని మరొక కార్యశాలలో బాల్జీ బింద్, ఆయన భార్య తారా దేవి సౌమక్ అనే ఒక ముడుల తివాచీ మీద చాలా ఏకాగ్రతతో నిశ్శబ్దంగా పని చేస్తున్నారు. అప్పుడప్పుడూ కత్తితో దారాలను తెంచుతున్న శబ్దం మాత్రమే వినిపిస్తోంది. సౌమక్ అనేది ఏకరీతి డిజైన్‌తో ఒకే రంగులో ఉండే గలీచా . చిన్న మగ్గాలు ఉన్న నేతకారులు దీనిని నేయడానికి ఇష్టపడతారు. "నేను ఒక నెలలో దీన్ని పూర్తిచేస్తే నాకు రూ.8,000 వస్తాయి," అని బాల్జీ చెప్పారు.

నేత సమూహాలు ఉన్న పుర్‌జాగీర్, బాగ్ కుంజల్‌గీర్‌లలో బాల్జీ భార్య తార వంటి మహిళలు పని చేస్తారు. మొత్తం నేత కార్మికులలో వాళ్ళు దాదాపు మూడో వంతు ఉన్నప్పటికీ వారి శ్రమను చుట్టూ ఉన్నవాళ్ళు గుర్తించరు. పిల్లలు కూడా బడి మధ్యలో, వేసవి సెలవులప్పుడు సహాయం చేస్తారు, దీని వల్ల వాళ్ళ నేత పని చురుగ్గా సాగుతుంది.

హజారీ బింద్, ఆయన భార్య శ్యామ్ దులారీ సకాలంలో తివాచీని పూర్తిచేయడానికి కలిసి పనిచేస్తున్నారు. గతంలో ఆయనకు సహాయం చేసే ఇద్దరు కొడుకులూ ఇప్పుడు కూలిపనుల కోసం సూరత్‌కు వలస వెళ్ళారు. " బచ్చోఁ నే హమ్ సే బోలా కి హమ్ లోగ్ ఇస్‌మేఁ నహీ ఫసేంగే పాపా [నా పిల్లలు తమకు దీనిలో ఇరుక్కోవడం ఇష్టం లేదని నాతో చెప్పారు]."

PHOTO • Akanksha Kumar
PHOTO • Akanksha Kumar

ఎడమ: భార్య తారా దేవితో కలిసి సౌమక్ అని పిలిచే ముడుల తివాచీని నేస్తోన్న బాల్జీ. ఇది ఏకరీతి డిజైన్‌ కలిగి ఒకే-రంగులో ఉండే తివాచీ. కుడి: ఇప్పుడు ఉపయోగం లేక తుప్పు పట్టిన తన కుచ్చుల గన్నుల సెట్‌ను చూపిస్తోన్న షాహ్-ఎ-ఆలమ్

PHOTO • Akanksha Kumar
PHOTO • Akanksha Kumar

ఎడమ: తన ఇంట్లోనే ఉన్న మగ్గంపై సౌమక్‌లను నేస్తోన్న హజారీ బింద్‌. కుడి: నూలు దారాల పక్కన నిలబడి ఉన్న హజారీ భార్య శ్యామ్ దులారీ. పుర్‌జాగీర్ వంటి నేత సమూహాలలో మహిళలు కూడా నేతపని చేసినప్పటికీ, వాళ్ళ శ్రమకు గుర్తింపు లేదు

ఆదాయాలు తగ్గిపోవడం, పనిలో ఉన్న కష్టాలు కేవలం యువకులను మాత్రమే కాకుండా, 39 ఏళ్ళ షాహ్-ఎ-ఆలమ్‌ను కూడా నేత పనికి దూరం చేసింది. ఆయన మూడేళ్ళ క్రితం ఆ పనిని వదిలిపెట్టి ఇప్పుడు ఇ-రిక్షా నడుపుతున్నారు. పుర్‌జాగీర్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నట్వా నివాసి అయిన షాహ్, 15 ఏళ్ళ వయసులో తివాచీలు నేయడం ప్రారంభించాడు. తరువాత 12 సంవత్సరాలలో అతను ముడుల నేత నుంచి కుచ్చుల నేత పనిలో మధ్యదళారీగా మారారు. మూడేళ్ళ క్రితం ఆయన తన మగ్గాన్ని అమ్మేశారు.

" పోసా నహీ రహా థా [మేం బతకడానికి అది సరిపోలేదు]," అని అతను తన కొత్తగా నిర్మించిన రెండు గదుల ఇంట్లో కూర్చుని చెప్పారు. 2014 నుంచి 2022 మధ్య వరకు ఆయన దుబాయ్‌లోని ఒక టైల్స్ తయారీ కంపెనీలో కార్మికుడిగా పనిచేశారు. దాని వల్ల అతనికి నెలకు రూ. 22,000 జీతం వచ్చేది. "అది కనీసం నేను ఈ ఇల్లును కట్టుకోవడానికి సహాయపడింది," అని అతను తన పలకలు పరిచిన నేల వైపు చూపిస్తూ చెప్పారు. “నాకు నేతపనిలో కేవలం రోజుకు రూ. 150 వచ్చేది, డ్రైవర్‌గా నేను రోజుకు రూ.250-300 సంపాదించగలుగున్నా."

రాష్ట్ర ప్రభుత్వ ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి’ పథకం తివాచీ నేతకారులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుండగా, కేంద్ర ప్రభుత్వ ముద్రా యోజన పథకం రాయితీ మీద రుణాలు పొందడంలో వారికి సహాయపడుతోంది. కానీ బ్లాక్ స్థాయిలో అవగాహన ప్రచారాలు చేస్తున్నా, షాహ్-ఎ-ఆలమ్ వంటి నేతకారులకు వాటి గురించి తెలియదు.

పుర్‌జాగీర్ ముజేహరా నుంచి కొద్ది దూరం ప్రయాణంలో ఉన్న బాగ్ కుంజల్‌ గీర్ వెళ్ళినప్పుడు, జహీరుద్దీన్ గుల్‌తరాశ్ నేతపనిలో నిమగ్నమై కనిపించారు. అది కుచ్చుల తివాచీ మీద డిజైన్‌లను తీర్చిదిద్దే పని. ఈ 80 ఏళ్ళ వృద్ధుడు ముఖ్యమంత్రి హస్త్‌శిల్ప్ పెన్షన్ యోజన కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2018లో ప్రారంభమైన ఈ రాష్ట్ర ప్రభుత్వ పథకం కింద 60 ఏళ్ళు నిండిన చేతివృత్తుల వారికి రూ.500 పింఛను లభిస్తుంది. కానీ మూడు నెలలు పింఛను అందాక అది అకస్మాత్తుగా నిలిచిపోయిందని జహీరుద్దీన్‌ చెప్పారు.

అయితే ఆయన ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) కింద పొందుతున్న రేషన్‌తో సంతోషంగా ఉన్నారు. పుర్‌జాగీర్ గ్రామంలోని నేతకారులు కూడా " మోదీ కా గల్లా " [ప్రధాని మోదీ పథకం కింద లభించే ఆహారధాన్యాలు] అందుతున్నాయని PARIకి చెప్పారు.

PHOTO • Akanksha Kumar
PHOTO • Akanksha Kumar

ఎడమ: గుల్‌తరాశ్-కుచ్చుల తివాచీపై డిజైన్‌లను (ఎడమ) తీర్చిదిద్దే పనిలో నిమగ్నమైన బాగ్ కుంజల్ గీర్ నివాసి జహీరుద్దీన్. పూర్తిచేసిన కుచ్చుల తివాచీని (కుడి) పట్టుకున్న జహీరుద్దీన్. అది డోర్‌మ్యాట్ పరిమాణంలో ఉంటుంది

PHOTO • Akanksha Kumar
PHOTO • Akanksha Kumar

ఎడమ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి ఉన్న తన ఫోటోను PARIకి చూపిస్తోన్న పద్మశ్రీ-అవార్డ్ గ్రహీత ఖలీల్ అహ్మద్. కుడి: ఇరాన్, బ్రెజిల్, స్కాట్లండ్ వంటి దేశాలను సందర్శించిన తర్వాత ఖలీల్ రూపొందించిన డిజైన్‌లు

65 ఏళ్ళ శమ్‌శు-నిసా తన ఇనుప రాట్నానికి చుట్టే ప్రతి కిలో నూలు దారానికి ( సూత్ ) ఏడు రూపాయలు సంపాదిస్తారు. అది రోజుకు సుమారు రూ.200 వరకూ అవుతాయి. మరణించిన ఆమె భర్త హస్రుద్దీన్ అన్సారీ, 2000వ దశకం ప్రారంభంలో వారి కుటుంబం కుచ్చుల తివాచీ నేతకు మారడానికి ముందు, ముడుల తివాచీలను నేసేవారు. ఆమె కుమారుడు సిరాజ్ అన్సారీకి నేతపనిలో ఎలాంటి భవిష్యత్తూ కనిపించడం లేదు, కుచ్చు నేతకు మార్కెట్‌లో కూడా గిరాకీ లేదని ఆయన చెప్పారు

జహీరుద్దీన్ ఉన్న పరిసరాల్లోనే, 75 ఏళ్ళ ఖలీల్ అహ్మద్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. 2024లో దరియా (durries) తయారీలో చేసిన కృషికి ఆయన పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. తన డిజైన్లను చూపుతూ ఆయన ఉర్దూలో ఉన్న ఒక రాతను చూపించారు. " ఇస్ పర్ జో బైఠేగా, వో కిస్మత్‌వాలా హో గా [ఈ తివాచీ మీద కూర్చున్నవారిని అదృష్టం వరిస్తుంది]," అని ఆయన చదివి వినిపించారు.

కానీ ఆ  అదృష్టం ఆ నేతకారులకు మాత్రం చాలా దూరంలో ఉంది.

అనువాదం: రవి కృష్ణ

Akanksha Kumar

Akanksha Kumar is a Delhi-based multimedia journalist with interests in rural affairs, human rights, minority related issues, gender and impact of government schemes. She received the Human Rights and Religious Freedom Journalism Award in 2022.

Other stories by Akanksha Kumar
Editor : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Editor : Sarbajaya Bhattacharya

Sarbajaya Bhattacharya is a Senior Assistant Editor at PARI. She is an experienced Bangla translator. Based in Kolkata, she is interested in the history of the city and travel literature.

Other stories by Sarbajaya Bhattacharya
Translator : Ravi Krishna

Ravi Krishna is a freelance Telugu translator. Along with translating George Orwell's 'Animal Farm' for 'Chatura', a Telugu monthly magazine, he has published a few translations and parodies in the Telugu magazines 'Vipula' and 'Matruka'.

Other stories by Ravi Krishna