డ్రైవరు ఆమెను ఇంటి దగ్గర దింపుతానని హామీ ఇచ్చాడు, కాని కారు ఆమె వెళ్లాల్సిన దిశకు వ్యతిరేకంగా వెళుతూనే ఉంది. అతను హైవే మీద మొదట వచ్చిన యు-టర్న్ తీసుకోనప్పుడు, అతను మరచిపోయాడేమో అని నేహ భావించింది. రెండో యు-టర్న్ వచ్చి వెళ్ళాక 15 ఏళ్ల ఆ బాలికకు అనుమానం కలిగింది. మూడోసారీ అలా జరగడంతో ఆమె భయాందోళనలకు గురైంది. ఆమెకు ఏడుపు వచ్చేసింది; నోరంతా చేదుగా తయారైంది.

అనుమానం, అపనమ్మకంతో ఆమె తనను తన తల్లిదండ్రుల దగ్గరకు తీసుకుపొమ్మని గట్టిగా కేకలు వేసింది. కారులో ఆమె పక్కన కూర్చునివున్న మహిళ, డ్రైవర్ ఇద్దరూ ఆందోళన చెందాల్సిన పని లేదంటూ ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నించారు.

కానీ మనసు లోలోతుల్లో నేహకు తానో పెద్ద సమస్యలో ఇరుక్కున్నానని తెలిసిపోయింది. ఇంటిని వదిలివెళ్ళాలనుకోవటం ఆమె దుడుకుగా తీసుకున్న నిర్ణయం, అందుకు ఆమె అప్పటికే పశ్చాత్తాపపడుతోంది.

ఆ సంవత్సరం ప్రారంభంలో, మే 2023లో, ఫోన్‌తోనే ఎక్కువ సమయం గడుపుతూ పుస్తకాలు చదవడం లేదని తల్లిదండ్రులు కోప్పడడంతో ఆ టీనేజీ అమ్మాయి వాళ్లతో వాగ్వాదానికి దిగింది. వాళ్లు నేహ ఫోన్‌ను తీసేసుకోవడంతో అప్పటికి ఆ గొడవ ముగిసింది.

"మా అమ్మానాన్నలు నా మొబైల్ ఫోన్‌ను తీసుకోవడంతో నాకు చాలా కోపం వచ్చింది," ఆమె లోగొంతుకతో, కళ్లలోకి చూడకుండా చెప్పింది. "అందుకే నేను వాళ్లకు దూరంగా వెళ్లిపోవాలనుకున్నాను."

అందుకని ఆమె ఉదయం 6 గంటలప్పుడు ఇంటి నుంచి బయలుదేరి, తన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఇరుకైన వీధులన్నీ దాటుకొని హైవేకి వెళ్లే దారిపట్టింది. ఇంకా తల్లిదండ్రులపై కోపంతో ఉన్న ఆమె, తాను చాలా దూరం వచ్చేసిందని గ్రహించేలోపే హైవే వెంట 7-8 కిలోమీటర్లు నడిచింది. అప్పటికి సూర్యోదయమై కొన్ని గంటలు కావడంతో ఆమెకు దాహం వేసింది, కానీ నీళ్ళ బాటిల్ కొనడానికి ఆ అమ్మాయి దగ్గర డబ్బు లేదు.

ఇంతలో మెరుస్తున్న నల్లటి సెడాన్ ఆమె ముందు ఆగింది. "ఒక మగ మనిషి ఆ కారును నడుపుతున్నాడు, వెనుక ఒక మహిళ కూర్చునివుంది" అని నేహ గుర్తు చేసుకుంది. ఆ మహిళ కిటికీ అద్దాలు దించి, ఇంటి దగ్గర దింపాలా అని నేహను అడిగింది. "వాళ్లిద్దరూ మంచి మనుషుల్లాగే కనిపించారు. వెనక్కి తిరిగి నడిచి వెళ్లడానికి నేను చాలా అలసిపోయాను, బస్ టికెట్‌కు నా దగ్గర డబ్బు కూడా లేదు.’’

సహాయం చేస్తామన్న వాళ్ల ప్రతిపాదనకు నేహ అంగీకరించింది. ఎయిర్ కండీషనర్‌తో ఆమెలో అలసట తొలగిపోగా, తలను వెనుకకు వాల్చి చేతిరుమాలుతో నుదుటి మీది చెమటను తుడుచుకుంది. ఆ మహిళ నేహకు నీళ్ల బాటిల్ అందించింది.

కానీ ఆ వ్యక్తి కారును ఆమె ఇంటికి దూరంగా తీసుకుపోవడం గమనించినప్పుడు అప్పటివరకూ ఆమె పొందిన హాయి కాస్తా భయంగా మారింది. ఆమె అరుస్తూ ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. కానీ చివరకు ఒక గంట తర్వాత కానీ కారు ఆగలేదు. వాళ్లు భోపాల్ చేరుకున్నారు. నేహను వాళ్లు కిడ్నాప్‌ చేశారు.

భారతదేశంలో, 2016 నుండి 2021 మధ్య కాలంలో మొత్తం 4,03,825 మంది పిల్లలు కనిపించకుండాపోయారు. ఆందోళన కలిగించే ఈ గణాంకాలలో, మధ్యప్రదేశ్ చాలా కాలంగా అగ్రస్థానంలో ఉంటూవస్తోంది – ఈ మధ్య కాలంలో, రాష్ట్రంలో అధికారికంగా 60,031 కేసులు నమోదయ్యాయి (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో). చైల్డ్ రైట్స్ అండ్ యు (CRY) వారు 2022లో సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) ద్వారా తెలుసుకున్న వివరాల ప్రకారం 11,717 మంది పిల్లలు తప్పిపోయారు. అంటే సంవత్సరానికి సగటున 10,250 మంది లేదా రోజుకు 28 మంది పిల్లలు - భారతదేశంలోని ఏ ఇతర రాష్ట్రం కంటే కూడా ఇది ఎక్కువ.

Madhya Pradesh consistently has the highest numbers of children that go missing in India

భారతదేశంలో మధ్యప్రదేశ్‌ నుంచే ఎక్కువమంది పిల్లలు క్రమం తప్పకుండా తప్పిపోతున్నారు

నేహలాగా తప్పిపోయిన పిల్లలలో అత్యధికంగా అంటే 77 శాతం - 55,073 - ఆడపిల్లలే. "అయితే ఈ సంఖ్య [తప్పిపోయిన పిల్లలు] కూడా కేవలం తక్కువ అంచనా మాత్రమే, ఎందుకంటే మారుమూల ప్రాంతాలలో తప్పిపోయిన చాలా కేసులను అసలు రిపోర్టే చేయరు," అని భోపాల్‌కు చెందిన కార్యకర్త సచిన్ జైన్ అన్నారు. సచిన్ పిల్లల హక్కుల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ వికాస్‌ సంవాద్‌ సమితిలో పనిచేస్తున్నారు. ఈ సంస్థ మధ్యప్రదేశ్‌లో తప్పిపోయిన పిల్లల డేటాను కూడా సేకరిస్తుంటుంది.

ఇంతలో, నగర శివార్లలో ఒక ఒంటి గది గుడిసెలో నివసించే నేహ తల్లిదండ్రులైన ప్రీతి, రమణ్‌లు నేహ కోసం ఆందోళనపడుతూ ఇరుగుపొరుగువాళ్లను అడుగుతూ, బంధువులను పిలిచి ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. "నాకు తప్పు చేసినట్లనిపించి, నన్ను నేను తిట్టుకున్నాను," అన్నారు ప్రీతి. "మేం మొత్తం చుట్టుపక్కలంతా వెతికాం, కానీ తనెక్కడా కనిపించలేదు. మధ్యాహ్నానికంతా ఆమె తిరిగొస్తుందని మేం అనుకున్నాం." వాళ్ళు మరుసటి రోజు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ కూతురు కనిపించడంలేదని ఫిర్యాదు చేశారు.

ఆ దంపతులు భోపాల్ చుట్టుపక్కల ఉన్న పలు ఫ్యాక్టరీలలో రోజువారీ కూలీలుగా పని చేస్తూ నెలకు రూ. 8,000-10,000 మధ్య సంపాదిస్తుంటారు. "ఎలాగైనా సరే మా పిల్లలకు చదువు చెప్పించాలని, వాళ్లకు మంచి ఉద్యోగాలు రావాలని మేమెప్పుడూ అనుకునేవాళ్లం," అని ప్రీతి చెప్పారు.

ఆమె, ఆమె భర్త 20 సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్ నుండి మధ్యప్రదేశ్‌కు వలస వచ్చారు. వాళ్లకు తమదంటూ ఏ కాస్త భూమీ లేదు. వారు ఇతర వెనుకబడిన తరగతి వర్గానికి చెందినవాళ్లు. “మా పిల్లలు కూలీలుగా అవమానాలకు, దోపిడీకి గురికావడం మాకిష్టం లేదు. అందుకే ఆమె బాగా చదువుకోవాలని మేం కాస్త కఠినంగా వ్యవహరించాం.’’

యుక్తవయసులోని నేహలాంటి పిల్లలు, తల్లిదండ్రులతో గొడవపడి ఇళ్లను వదిలి పారిపోయిన కౌమారదశలోని పిల్లలు, ప్రేమలో పడి పారిపోయిన యవతీయువకులు - వీరంతా అనేకరకాలుగా తప్పిపోయిన పిల్లలలో భాగం. వీరిని లైంగిక దోపిడీ కోసం లేదా చాకిరీ చేయించడం కోసం అక్రమ రవాణా చేయడం అత్యంత హేయమైన పద్ధతులలో ఒకటి. “కాంట్రాక్టర్లు పని కోసం పిల్లలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకువెళతారు. బాలలతో ఈ రకమైన వెట్టి చేయించడం వెనుక ఒక పూర్తి దుర్మార్గపు ఒప్పందమే ఉంది,” అని జైన్ చెప్పారు.

*****

నేహను భోపాల్‌లోని ఒక ఫ్లాట్‌కు తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లాక ఆమెను ఎక్కడికీ వెళ్లడానికి, ఎవరినీ కలవడానికి అనుమతించలేదు. వాళ్లిద్దరూ ఆమె తమ బంధువుల అమ్మాయి అని ఇరుగు పొరుగువారికి చెప్పి, ఆమెను సనా అని పిలవడం ప్రారంభించారు; కొత్త పేరుతో పిలిచినప్పుడు పలకకపోతే నేహను కొట్టేవారు.

ఇంటి నుంచి పారిపోయిన ఆ కిశోరబాలిక శారీరక, లైంగిక వేధింపులకు గురయ్యింది. ఆ జంట ఆమెతో ఇంటి పనులు, గదులు శుభ్రం చేయడం, పాత్రలు కడగడం వంటి అంతులేని పనులు చేయించేవాళ్లు. ఎట్టకేలకు ఆమె తప్పించుకునే ధైర్యం చేసినప్పుడు, ఆమెను పట్టుకుని శిక్షించారు. "నేను ఇంటికి తిరిగి వస్తాననే ఆశను వదులుకున్నాను," అని ఆమె గుర్తు చేసుకుంది. "పోలీసులు నన్ను రక్షించినప్పుడు నేను నమ్మలేకపోయాను."

ఆమె హైవే వెంబడి నడుచుకుంటూ వెళ్తున్న సిసిటివి ఫుటేజీ సహాయంతో పోలీసులు ఆమెను కనిపెట్టగలిగారు, కానీ భోపాల్‌లో ఆమెను కనిపెట్టడానికి వారికి కొన్ని రోజులు పట్టింది. కిడ్నాప్ చేసినందుకు ఆ జంటను అరెస్టు చేసి,  లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POSCO-పోస్కో) చట్టం, 2012, బాల కార్మికుల (నిషేధం, నియంత్రణ) చట్టం, 1986 కింద వారిపై అభియోగాలు మోపారు.

ఆమె ఇంటికి చేరుకోగానే తల్లిదండ్రులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. " మేం పోలీసులకు ఎప్పటికీ రుణపడి ఉంటాం," అన్నారు ప్రీతి.

PHOTO • Priyanka Borar

యుక్తవయసులోని నేహలాంటి పిల్లలు, తల్లిదండ్రులతో గొడవపడి ఇళ్లను వదిలి పారిపోయిన కౌమారదశలోని పిల్లలు, ప్రేమలో పడి పారిపోయిన యవతీయువకులు - వీరంతా అనేకరకాలుగా తప్పిపోయిన పిల్లలలో భాగం. వీరిని లైంగిక దోపిడీ కోసం లేదా చాకిరీ చేయించడం కోసం అక్రమ రవాణా చేయడం అత్యంత హేయమైన పద్ధతులలో ఒకటి

నేహను త్వరగా కనిపెట్టారంటే అది ఆమె అదృష్టమనే చెప్పాలి, కానీ తరచుగా పెరిగిపోతోన్న ఈ కేసుల సంఖ్య చాలా ఆందోళనను కలిగిస్తోందని జైన్ అభిప్రాయపడ్డారు. "ఇది కేవలం శాంతిభద్రతల సమస్య కాదు," అని అతనన్నారు. "ఇదొక సామాజిక సమస్య. నేటి కాలపు పిల్లల, యుక్తవయస్కుల శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలను పరిష్కరించడానికి సమాజం సతమతమవుతోంది.’’

గత ఏడేళ్లలో మధ్యప్రదేశ్‌లో 70,000 మందికి పైగా పిల్లలు తప్పిపోగా, రాష్ట్ర పోలీసులు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వారిలో 60-65 శాతం మంది పిల్లలను వెతికి పట్టుకుంటున్నారు. కానీ పిల్లలు ఒక్కరు తప్పిపోయినా, అది చాలామంది కిందే లెక్క. ప్రస్తుతం 11,000 కంటే ఎక్కువ మంది పిల్లలు వాళ్లు జీవించకూడని పరిస్థితుల మధ్య జీవిస్తున్నారు. ఆ పిల్లల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమ బిడ్డలు ఎలాంటి అఘాయిత్యాలకు గురవుతున్నారో అనే భయం, అనిశ్చితి మధ్య జీవిస్తున్నారు.

తమ 14 ఏళ్ల కుమార్తె పూజ ఆగస్టు మధ్యలో కనిపించకుండా పోయినప్పటి నుండి లక్ష్మి, నీతీశ్‌లు ఆమెకు ఏమై ఉండవచ్చో అని పలు రకాలుగా ఆలోచిస్తూనేవున్నారు. ఆమె ఎక్కడుందో పోలీసులింకా  కనిపెట్టలేకపోయారు, ఆ కేసు ఇప్పటికీ పరిష్కరించకుండా మిగిలే ఉంది.

" దిమాగ్ ఖరాబ్ హోగయా [మాకేవేవో పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి]" అన్నారు నీతీశ్. “మేం వీలైనంత వరకు సానుకూలంగానే ఆలోచించడానికి ప్రయత్నిస్తాం. కానీ మా బిడ్డ ఏం చేస్తుందో అని తల్చుకోకుండా ఉండటం అసాధ్యం.”

ఒకరోజు ఉదయం బడికి వెళ్ళిన పూజ మళ్లీ తిరిగి రాలేదు. సిసిటివి ఫుటేజీలో ఆమె బడికి వెళ్లే దారిలోనే కనిపించింది, కానీ మధ్యలో మాయమైపోయింది. ఎప్పుడూ చేయని విధంగా ఆ రోజు ఆమె తన ఫోన్‌ను ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్ళినందువల్ల, ఆమె కావాలనే ఇంటి నుంచి వెళ్లిపోయిందని తల్లిదండ్రులు భావిస్తున్నారు. "ఆమె కాల్ రికార్డులను పరిశీలించిన పోలీసులు, ఆమె క్రమం తప్పకుండా ఒక అబ్బాయితో మాట్లాడుతున్నట్లు గుర్తించారు," అని చెప్పారు నీతీశ్. “ఆమె ఫోన్‌లో చాలా ఎక్కువగా మాట్లాడుతుండేది, కానీ మేం ఆమె ప్రైవసీని గౌరవించాం. ఈ వయసులో పిల్లలెప్పుడూ తమ స్నేహితులతో మాట్లాడాలనుకుంటారులే అనుకున్నాం,” అని పూజ తండ్రి, 49 ఏళ్ల నీతీశ్ చెప్పారు.

పూజ ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతుండే బాలునికి ఆమె వయస్సే ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఒక గ్రామానికి చెందిన అతను, వారికి తెలిసిన అబ్బాయే. పూజ, ఆ అబ్బాయి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు కానీ ఇప్పటివరకు వారిద్దరిలో ఎవరూ దొరకలేదు.

పరిస్థితులతో సరిపెట్టుకున్న నీతీశ్, లక్ష్మి ఇప్పుడు ప్రతిరోజూ పనికి వెళుతున్నారు. ప్రస్తుతం ఏబై ఏళ్ళ వయసుకు దగ్గరవుతోన్న వీరిద్దరూ 30 సంవత్సరాల క్రితం పని కోసం పశ్చిమ బీహార్‌లోని ఒక గ్రామం నుండి వలస వచ్చారు. "ఇక్కడికి వలస వచ్చిన ఒకరు మాకు తెలుసు," అని నీతీశ్ చెప్పారు. "ఇక్కడికి వచ్చి పని వెతుక్కోమని అతను మాకు సలహా ఇచ్చాడు."

రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న ఈ జంట, గుడిసె నుండి కాంక్రీట్ ఇంటికి మారడం కోసం, తమ పిల్లల చదువులూ పెళ్లిళ్ల కోసం పొదుపు చేస్తున్నారు. రోజుకు 12-14 గంటలు పనిచేసే వీళ్లు నెలకు రూ. 9,000 వరకు సంపాదించగలుగుతున్నారు. తాను పనికి ఎక్కువ సమయం కేటాయించడమే కుమార్తెను నిర్లక్ష్యం చేయడానికి దారి తీసిందా అని నీతీశ్ ఆలోచిస్తున్నారు. "మా పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలని మేం దొరికిన ప్రతి పనినీ చేశాం. ఆమె దేనిగురించైనా మాతో మనసువిప్పి మాట్లాడలేకపోయిందంటే, తల్లిదండ్రులంగా మేం విఫలమయ్యామా?”

పూజ తెలివైన విద్యార్థిని, పెద్ద చదువులు చదవాలని కలలు కనేది. ఆమె అక్కలకు 20, 22 ఏళ్ల వయస్సులో పెళ్ళిళ్ళయ్యాయి, కానీ పూజ మాత్రం తాను పోలీసు అధికారిని కావాలనునుకుంది. ఇప్పుడామె కనిపించకుండా పోయింది కాబట్టి, ఆమె తన కలను వదులుకుందా అని ఆమె తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఆమెను తీసుకువెళ్లారేమోననీ, మళ్లీ ఆమెను తిరిగి చూడగలమో లేదోననీ వాళ్లు ఆందోళన చెందుతున్నారు.

PHOTO • Priyanka Borar

తమ కూతురిని మళ్లీ చూస్తామో లేదోనని పూజ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు

కుమార్తె కనిపించకుండా పోయినప్పటి నుండి సరిగ్గా నిద్రపోని లక్ష్మి, "తప్పిపోయిన అమ్మాయిలకు ఏం జరుగుతుందో వివరిస్తూ భయంకరమైన కథనాలతో చాలా వార్తలు వస్తున్నాయి. అలాంటి ఆలోచనలను వదిలించుకుందామన్నా వదిలించుకోలేకపోతున్నాను. మా ఇంట్లో వాతావరణం ఎవరిదో అంత్యక్రియలు జరిగినట్లు ఉంది," అన్నారు.

నిర్ణీత నిర్వహణా పద్ధతి ప్రకారం, తప్పిపోయిన మైనర్ జాడ నాలుగు నెలల పాటు తెలీకపోతే, కేసును జిల్లాలోని మానవ అక్రమ రవాణా నిరోధక విభాగానికి (AHTU) బదిలీ చేయాలి.

ఈ విభాగానికి బదిలీ అయిన తర్వాత, దాన్ని మరింత లోతుగా, కేంద్రీకరించి పరిశోధిస్తారని జైన్ చెప్పారు. "కానీ రాజ్యం తరచుగా అలాంటి పని చేయదు. ఎందుకంటే అక్రమ రవాణా సంఖ్యలు ఎక్కువగా ఉంటే అది ప్రభుత్వానికే అప్రతిష్ట." దురదృష్టవశాత్తూ, ఇలాంటి కేసులు స్థానిక పోలీసుల దగ్గరే సమాధి అయిపోతాయి. దాంతో తప్పిపోయిన పిల్లలను కనుగొనడం ఆలస్యం అవుతుంది.

*****

పిల్లలు దొరికిన తర్వాత, వారు అనుభవించిన బాధాకరమైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, వారిని తిరిగి దృఢంగా నిలబడేలా చేయటం చాలా అవసరం. తరచుగా వాళ్ల మానసిక స్థితి దెబ్బతిని ఉంటుంది.

మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగినంతమంది వృత్తినిపుణులైన సైకాలజిస్టులు లేరని, చాలామంది నగరాల్లోనే ఉన్నారని భోపాల్‌కు చెందిన బాలల హక్కుల కార్యకర్త రేఖాశ్రీధర్ చెప్పారు. "ఇలాంటి పిల్లలకు ఎన్నోసార్లు కౌన్సెలింగ్ ఇవ్వాల్సివుంటుంది. కానీ మారుమూల ప్రాంతాలలో నివాసముండే ఈ పిల్లలు తమకు ఎంతో, ఎన్నోసార్లు అవసరమైన ఈ కౌన్సెలింగ్ సెషన్‌లను పొందలేకపోతున్నారు," అని ఆమె వివరించారు. "తల్లిదండ్రులే వాళ్ల స్వంత ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటారు కాబట్టి, ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవటం వాళ్ళకు సాధ్యంకాదు. మానసిక ఆరోగ్యం సరిగా లేనివాళ్లతో ఎలా వ్యవహరించాలన్న దానిపై సాధారణ అవగాహన లేకపోవటం కూడా మరో కారణం."

కౌన్సెలింగ్ ఆవశ్యకతను రేఖ నొక్కి చెబుతారు. "పిల్లలు కుంగుబాటులోకి కూరుకుపోతారు, వారిలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు పెరగొచ్చు," అని ఆమె వివరించారు. "ఇది వారి మనసుపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది, భవిష్యత్తులో వారు ఏర్పరచుకునే ప్రతి సంబంధంపై అది ప్రభావం వేస్తుంది."

నేహ ఇంటికి తిరిగి వచ్చి ఐదు నెలలైంది. అప్పటి నుండి ఆమె నాలుగైదు కౌన్సెలింగ్ సెషన్‌లకు హాజరైంది, కానీ ఇప్పటికీ ఆమె మునుపటిలా ఉండలేకపోతోంది. తాను ఇంటికి వచ్చేశానని, సురక్షితంగా ఉన్నాననే వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి ఆమెకు కొంత సమయం పట్టింది. "ఆ 17 రోజులు నాకు అనంతంగా అనిపించాయి," అని నేహ చెప్పింది.

ఆమె తిరిగి పాఠశాలలో చేరింది కానీ, తనంతట తానుగా వెళ్లడానికి ఆమెకు ధైర్యం చాలడం లేదు. ఆమె తమ్ముడు ప్రతిరోజూ ఆమెను పాఠశాల దగ్గర వదిలి, తిరిగి తీసుకువస్తున్నాడు. ఒకప్పుడు అందరితో కలుపుగోలుగా ఉండే నేహ ఇప్పుడు కొత్త వ్యక్తులను కలవడానికి, సూటిగా చూడడానికి భయపడుతోంది.

ఆమె కుటుంబం ఇటుకలతో కట్టి, రేకుల కప్పుతో ఒకే గదిగా ఉన్న వంటగదిలో నివసిస్తోంది. అక్కడ వారందరూ నేలపై ఒకరి పక్కన ఒకరు పడుకుంటారు. అలా పడుకోవటం ఇప్పుడు నేహకు కలవరపెట్టే జ్ఞాపకాలను తిరిగి తీసుకువస్తోంది. "తిరిగి వచ్చినప్పటి నుండి ఆమె ప్రశాంతంగా నిద్రపోయిందిలేదు," అని ప్రీతి చెప్పారు. “ఆమె పక్కన పడుకున్న వాళ్లెవరైనా నిద్రలో కదిలితే చాలు, అర్ధరాత్రి వేళ నిద్రలేచి ఏడుస్తుంది. ఆమెను ఊరుకోబెట్టడానికి కొంచెం సమయం పడుతోంది.”

ఈ కథనంలో పేర్కొన్న మైనర్‌ల వివరాలను గోప్యంగా ఉంచడానికి అన్ని పాత్రల పేర్లను మార్చడం జరిగింది.

అనువాదం: రవికృష్ణ

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Illustration : Priyanka Borar

Priyanka Borar is a new media artist experimenting with technology to discover new forms of meaning and expression. She likes to design experiences for learning and play. As much as she enjoys juggling with interactive media she feels at home with the traditional pen and paper.

Other stories by Priyanka Borar
Editor : PARI Desk

PARI Desk is the nerve centre of our editorial work. The team works with reporters, researchers, photographers, filmmakers and translators located across the country. The Desk supports and manages the production and publication of text, video, audio and research reports published by PARI.

Other stories by PARI Desk
Translator : Ravi Krishna

Ravi Krishna is a freelance Telugu translator. Along with translating George Orwell's 'Animal Farm' for 'Chatura', a Telugu monthly magazine, he has published a few translations and parodies in the Telugu magazines 'Vipula' and 'Matruka'.

Other stories by Ravi Krishna